
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ఆయన ప్రతినిధులుగా గ్రామీణ ప్రజలకు వివరించి.. వారిని చైతన్యపర్చాల్సిన బాధ్యత మీదేనని వైఎస్సార్‌సీపీ సర్పంచులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 175 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సర్పంచులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడుతో కలిసి ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని సమస్యలను, ఇతర అంశాలను సజ్జల రామకృష్ణారెడ్డి, బూడి ముత్యాలనాయుడుల దృష్టికి సర్పంచులు తీసుకొచ్చారు. వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచులకు వారు హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచులను ఉద్దేశించి సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా సీఎం వైఎస్ జగన్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర విభజన, కోవిడ్, ఆర్థిక సమస్యలు.. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో పేదరికాన్ని పోగొట్టడం, విద్య, వైద్యం వంటి విషయాల్లో ప్రయోజనం కలిగేలా సీఎం వైఎస్ జగన్ దార్శనికతతో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలకు అవకాశాలు కల్పించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా పేదలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు.
పథకాల ఫలాలు ప్రజలకు చేరడం వల్లే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం ఆ పథకాల ఫలితాలు మరింతగా ప్రతి కుటుంబానికి చేరడంతో ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింతగా పెరిగిందని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులమేగానీ దొరలం కాదన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలతో సర్పంచుల అధికారాలను హరించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆయన ప్రతినిధులుగా ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు. పథకాలు అందుతున్న తీరు తెన్నులను మీరే పరిశీలించాలి. తద్వారా వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరుగుతుందంటే.. మీకు, మనందరికి ఆదరణ పెరిగినట్లే’ అని సజ్జల చెప్పారు. ప్రతిపక్షాలకు సర్పంచులు కనీస సంఖ్య లేకున్నా.. పాత సంఘాల పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద సంఖ్యలో ఉన్న వైఎస్సార్‌సీపీ సర్పంచులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్‌లతో రాష్ట్రస్థాయి కార్యవర్గం: మంత్రి బూడి ముత్యాలనాయుడు
మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి సంబంధించిన సర్పంచులతో రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దాని ద్వారా వారి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచులకు నిధులివ్వడం లేదంటూ ప్రతిపక్షాల విమర్శలు అర్థంలేనివన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నవరత్నాల అమలు ప్రోగ్రాం వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు.