జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
-
డిప్యూటీ సీఎం చినరాజప్ప
-
ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లకు సన్మానం
రాజమహేంద్రవరం సిటీ :
గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే జిల్లా ఆదర్శంగా తయారవుతుందని, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. రెండేళ్ల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం పూర్తకావడంతో రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఆదివారం ‘ ఒక అడుగు స్వచ్ఛత వైపు’ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని బహిరంగ మలమూత విసర్జన రహిత గ్రామాల సర్పంచ్‌లను సన్మానించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వచ్ఛత వైపు అడుగులు
చినరాజప్ప మాట్లాడుతూ ప్ర«ధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛగ్రామాల వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం మెరుగుకు సహకరించాలన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ మలమూత్ర విసర్జన గ్రామాల్లో దుళ్ల గ్రామ సర్పంచ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1069 పంచాయతీల్లో కేవలం 139 మాత్రమే మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా గుర్తించబడ్డాయన్నారు. వచ్చే ఏడాది 250 గ్రామాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 139 గ్రామాల సర్పంచ్‌లను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులవర్తి నారాయణరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ కే.పద్మ, డ్వామా పీడీ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సెంట్రల్ జైలులో రూ.ఆరుకోట్లతో ఆసుపత్రి
రాజమహేంద్రవరం క్రైం : ఖైదీలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు రూ.ఆరుకోట్లతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో హాస్పటల్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సెంట్రల్ జైల్లో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవం, గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, మంజూరైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎంపీ మాగంటి మురళీ మోహన్, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర ఘు, ఎస్.రాజారావు, సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్ పాల్గొన్నారు.