సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు.
►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం.
►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్‌ఆర్ సీపీ పాగా వేసింది.
►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్‌లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment