సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద గురువారం తొలి రోజు రాష్ట్రంలో 3.79 లక్షల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ తెలిపింది. అందులో 51,236 చెక్కులను రైతులు నగదుగా మార్చుకుని బ్యాంకుల నుంచి రూ.52 కోట్లు పొందారని వెల్లడించింది.
సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం ఉదయం 11.15 గంటలకు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 568 మండాలాల్లో 509 మండలాల పరిధిలోని 1,629 గ్రామాల్లో చెక్కుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు కరీంనగర్ జిల్లాలో జరిగిన సీఎం కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా ఆ జిల్లాలో శుక్ర వారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
సజావుగా పంపిణీ..
తొలి రోజు కావడంతో చెక్కుల పంపిణీ శాతం తక్కువగా నమోదైందని పార్థసారిథి తెలిపారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చెక్కుల పంపిణీ సజావుగా సాగిం దన్నారు. కౌంటర్ల వద్ద తాగు నీరు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేశామన్నారు.
కొంతమంది రైతులకు చెక్కులు మాత్రమే ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించ లేదని, తహసీల్దారులు ధ్రువీకరించిన పట్టాదారు పాస్‌పుస్తకాల జాబితాలను బ్యాంకు అధికారులకు అందించడం ద్వారా ఇలాంటి రైతుల చెక్కులను నగదుగా మార్చాలని కోరారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీని సంప్రదించిన అనంతరం ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. పాస్ పుస్తకాలు పొందని రైతులు అధికారిక ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు అధికారులకు చూపించి చెక్కుల మార్పిడి చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment