సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికలను ఒకే రోజు నిర్వహిస్తాం. బారులుగా ప్రజలు వచ్చి ఓట్లేస్తారు. అలాంటిది కేవలం 58 లక్షల మంది రైతులకు ఒకేరోజు చెక్కులు ఇవ్వలేమా? అలాగే చేద్దాం’అని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో అన్నట్లు తెలిసింది. ప్రతీ గ్రామంలో టీచర్లు, వీఆర్వోలు, ఇతర అధికారులు చాలామంది పనిచేస్తుంటారు. పట్టణాల్లోనూ వివిధ శాఖల్లో అనేకమంది ఉద్యోగులుంటారు. వారందరినీ రంగంలోకి దింపి ఒకేరోజు రైతుబంధు చెక్కులను పంపిణీ చేద్దామని సీఎం భావించారు. ముహూర్తం కూడా చూశారు. కానీ, కొందరు ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారుల సలహాతో మనసు మార్చుకున్నారు. ‘బ్యాంకుల్లో డబ్బు కొరతతో రాష్ట్రంలోని ఏటీఎంలు ఖాళీగా ఉంటున్నాయి. బ్యాంకులకు వెళితే డబ్బులిచ్చే పరిస్థితి లేదు.
ఈ తరుణంలో ఒకేరోజు చెక్కులు పంపిణీ చేస్తే చాలామంది రైతులు ఒకేసారి బ్యాంకులపై పడిపోతారు. డబ్బు దొరక్కపోతే నిందిస్తారు. కాబట్టి సమయం తీసుకుంటేనే మంచిది’అని సలహా ఇచ్చారు. దీంతో సీఎం సరేనంటూ వచ్చే నెల 10 నుంచి వారంపాటు చెక్కుల పంపిణీకి ఒప్పుకున్నారని ఒక వ్యవసాయశాఖ ఉన్నతాధికారి చెప్పారు. వారం రోజులు పంపిణీ చేస్తే చిన్న, చిన్న లోపాలను భూతద్దంలో చూపించే అవకాశం ప్రతిపక్షాలకు ఇచ్చినట్లవుతుందని సర్కారులో ఆందోళన ఉన్నట్లు సమాచారం. మరోవైపు చెక్కులను ఖరీఫ్ ప్రారంభానికి నెలరోజుల ముందే ఇవ్వడం వల్ల రైతులు డబ్బులను వృథాగా ఖర్చు చేసే పరిస్థితి ఉంటుందన్న చర్చ కూడా ఉంది. కానీ, నెల ముందే ఇస్తానని హామీ ఇవ్వడంతో దానికే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. కాగా రాష్ట్ర వ్యవసాయశాఖ చెక్కుల పంపిణీకి 21,801 బృందాలను నియమించింది. మొత్తం రైతుఖాతాలు 57.33 లక్షలున్నాయి. రైతులు 58.56 లక్షల మంది ఉన్నారు. కొందరు రైతులకు రెండు చెక్కులు ఇవ్వాల్సి వస్తున్నందున 59.15 లక్షల చెక్కులను పంపిణీ చేస్తారు.
డ్యాష్‌బోర్డు ఏర్పాటు...
పెట్టుబడి పథకం అమలుతీరును పర్యవేక్షించేందుకు సీఎం కార్యాలయం, ఆర్థిక, వ్యవసాయశాఖ మంత్రులు, ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు చూసేలా డ్యాష్‌బోర్డును శుక్రవారం తీర్చిదిద్దారు. వెబ్ పోర్టల్‌కు అనుసంధానమై ఇది పనిచేస్తుంది. జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారుల కోసం మరో డ్యాష్‌బోర్డును సిద్ధం చేశారు. మండలస్థాయి అధికారుల కోసం మరోటి అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులకు పోర్టల్ కోసం యూజర్ ఐడీలను తయారు చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకేరోజు పంపిణీకే మొదట మొగ్గు
Published Sat, Apr 21 2018 3:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment