గిఫ్ట్ సిటీలు అభివృద్ధి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులకు లాభం చేకూర్చేలా వారిని భాగస్వాములను చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గిఫ్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. దేశంలోని చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 3వేల ఎకరాలకు ఒక టౌన్ చొప్పున నిర్మిస్తామని, అందుకు రైతుల నుంచి భూమి సేకరిస్తామని వెల్లడించారు.
సేకరించిన భూమికి ధర కట్టి అందుకు సమానంగా సదరు లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామన్నారు. దీంతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. నివాస సముదాయాల లే అవుట్లలో పారదర్శకత ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన విధానం తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పన్నెండేళ్ల వివాదానికి పరిష్కారం
ఉప్పల్ భగావత్ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ అధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాల లే అవుట్‌కు సంబంధించిన బాధితులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డి తదితరులతో కలసి వచ్చిన బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో దాదాపు 12 ఏళ్ల కిందట నాటి ప్రభుత్వం వివిధ అవసరాలకు స్థానిక రైతుల నుంచి 754 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో సీవరేజీ ప్లాంటుకు, మెట్రో రైలు ప్రాంగణం నిర్మాణానికి, వాటర్ వర్క్స్ కోసం పోయిన భూమి కాకుండా మిగిలిన 430 ఎకరాలను హెచ్‌ఎండీఏ లే అవుట్ చేసింది.
రైతుల నుంచి భూమి తీసుకునే క్రమంలో ఎకరా భూమి కోల్పోయిన రైతుకు అభివృద్ధి చేసిన లే అవుట్‌లో 1000 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులు ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో 54 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోనిదని తర్వాత తేలింది. దీంతో సదరు భూమి అమ్మిన రైతులకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎకరాకు వెయ్యి గజాలు ఇవ్వడం కుదరదని అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పింది.
దసరా లోపే నివాస స్థలం కేటాయింపు
తాము భూమి కొనే సందర్భంలో కానీ.. ఆ భూమిని ప్రభుత్వానికి అమ్మే సందర్భంలో కానీ అది అర్బన్ లాండ్ సీలింగ్ భూమి అని తమకు తెలియదని బాధితులు 12 ఏళ్ల నుంచి ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. పట్టా భూములు అప్పగించిన వారికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున కేటాయించే నిర్ణయం ఇప్పటికే జరిగినందున వెంటనే వారికి నివాస స్థలం కేటాయించి మార్కింగ్ చేయాలన్నారు. నివాస స్థలం అప్పగించే ప్రక్రియ దసరా లోపు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డిని ఆదేశించారు.