58.33 లక్షల మందికి ‘పెట్టుబడి’ | Department of agriculture on kharif investments | Sakshi
Sakshi News home page

58.33 లక్షల మందికి ‘పెట్టుబడి’

Published Tue, May 1 2018 12:52 AM | Last Updated on Tue, May 1 2018 12:52 AM

Department of agriculture on kharif investments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద 58.33 లక్షల మంది అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందనుంది. వ్యవసాయశాఖ దీనిపై తుది నిర్ధారణ చేసి, ఆ వివరాలను సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అటవీ హక్కు యాజమాన్య పత్రాలున్న గిరిజన భూములతో పాటు మొత్తంగా 1.43 కోట్ల ఎకరాల వివాద రహిత వ్యవసాయ భూమి ఉంది.

ఆ భూములున్న రైతులందరికీ ఖరీఫ్‌ పెట్టుబడి సొమ్ము అందనుంది. ఆ రైతులందరికీ ఖరీఫ్‌లో రూ. 5,720 కోట్ల పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పరిపాలన అనుమతి ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.

అందులో భాగంగా మొదటి దశ కింద రూ.1,602 కోట్ల సొమ్మును బ్యాంకులకు పంపింది. రెండో దశ కింద రూ. 2,455 కోట్లు బ్యాంకులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలో అందజేయనున్నారు. పదో తేదీ నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ చెక్కుల పంపిణీ జరుగనుంది.  

తొమ్మిది వేల చెక్కుల్లో తప్పులు...
ఇప్పటివరకు 54.15 లక్షల చెక్కుల ముద్రణ పూర్తయింది. వాటిని ఆయా జిల్లాలు, మండ లాలకు పంపారు. మిగిలిన చెక్కుల ముద్రణ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ముద్రించిన వాటిల్లో 9 వేల చెక్కుల్లో తప్పులు దొర్లినట్లు వ్యవసాయశాఖ అధికా రులు పేర్కొన్నారు. కొన్ని చెక్కుల్లో రైతుల పేరు తప్పుగా ముద్రణ కావడం, కొన్నింటిలో గ్రామం పేరు, మండలం పేరు తప్పులు వచ్చినట్లు చెప్పారు.

తప్పులు దొర్లిన చెక్కులను బ్యాంకులకు పంపామని, తిరిగి ముద్రిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 10,823 గ్రామాలకుగాను 160 గ్రామాల్లో అసలు రైతు ఖాతాలే లేవని నిర్ధారించారు. ఆ గ్రామాల్లో రైతులు లేరని సర్కారుకు నివేదించారు. కొన్నిచోట్ల రైతులు వివిధ కారణాలతో గ్రామాలను ఖాళీ చేయడం, మరికొన్నిచోట్ల ఆయా గ్రామాలు ముంపునకు గురికావడం జరిగిందన్నారు.

సగానికి పైగా పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ
ఇంకా పది రోజుల్లో చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ మొదలు కానుంది. ఇప్పటికే చెక్కుల ముద్రణ పూర్తి దశలో ఉంది. అలాగే 32 లక్షల పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని రైతులకు గ్రామ సభల్లో పంపిణీ చేస్తారు.

పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ జరుగుతున్నందున గ్రామ సభలను ఎలా నిర్వహించాలన్న దానిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గొడవలు జరిగే అవకాశమున్న గ్రామాలు, ప్రతిపక్షాలకు బలమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పోలీసు కాపలా భారీగా ఏర్పాటు చేసే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement