‘రైతు బంధు’ పేరిట 100 కోట్ల ప్రచారమా? | Uttamkumar reddy commented over kcr | Sakshi
Sakshi News home page

‘రైతు బంధు’ పేరిట 100 కోట్ల ప్రచారమా?

Published Fri, May 11 2018 12:24 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttamkumar reddy commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తక్కువ సాయం చేస్తూ ప్రచారం మాత్రం భారీగా చేసుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని చెప్పి దేశంలోని అన్ని పత్రికలకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి పథకం ప్రారంభ ప్రకటనలిచ్చిందని ఆయన నిలదీశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘నాలుగేళ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి పరిహారం ఇవ్వడానికి పైసల్లేవు. పరామర్శించేందుకు సమయం లేదు. మద్దతు ధరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టవు. రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మాట తప్పావు. ఇంతటి అమానవీయ వైఖరిని రైతులపట్ల అవలంబిస్తున్న నువ్వు రైతు బంధు అంటూ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటావా?’’అని సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్‌ విరుచుకుపడ్డారు.

రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్‌ అనేక విధాలుగా మోసం చేశారని ఆరోపించారు.

ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కేసీఆర్‌...గద్దెనెక్కాక రుణమాఫీ నాలుగుసార్లు చేస్తానని మాట మార్చారని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా రైతులకు మేలు చేయకపోగా అణచివేత ధోరణితో వ్యవహరించారని, మద్దతు ధర కోసం ఖమ్మంలో ధర్నా చేసిన గిరిజన రైతులకు సంకెళ్లు వేసి దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు.

సీఎంవి మోసపూరిత మాటలు..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో సీఎం మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. గిట్టుబాటు ధరకు 25 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతానని మళ్లీ రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్‌ నుంచి భావితరాలను తాకట్టు పెట్టి తెచ్చిన రూ.2 లక్షల కోట్ల అప్పుల నుంచి ఈ 25% ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్‌ నిలదీశారు.

వరికి మద్దతు ధర రూ.1,500 ఉంటే రాష్ట్రంలో ఎక్కడా రూ.1,200 మించి కొనలేదని చెప్పారు. ఎకరానికి 30 క్వింటాళ్లు లెక్కవేసుకున్నా మద్దతు ధరకన్నా రూ.300 తక్కువ వచ్చింది కనుక రైతుకు  రూ.9 వేల మేర నష్టం జరిగిందని ఉత్తమ్‌ వివరించారు. ఆ రూ.9 వేలను దళారులకు దోచిపెట్టి రైతులకు ఇప్పు డు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తానని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.


మేమొస్తే ఏకకాలంలో రుణమాఫీ...తాము అధికారంలోకి వస్తే పంటలవారీగా మద్దతు ధరలను ప్రకటిస్తామని, కేంద్రం ఎంత ఇచ్చినా దానికి అదనంగా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కేటాయిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. వరి, మొక్కజొన్న, సజ్జలకు రూ. 2 వేలు, పత్తికి రూ. 6 వేలు, కందులు, పప్పుధాన్యాలకు రూ. 7 వేలు, పసుపు, మిర్చికి రూ. 10 వేలు, ఎర్రజొన్నకు రూ. 3 వేలకు తగ్గకుండా మద్దతు ధర అందిస్తామన్నారు.

ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు బంధు పథకం అమల్లో రైతులకు ఏదైనా సమస్య వస్తే వారికి అండగా ఉండి ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఎం.కోదండరెడ్డి, ఆరేపల్లి మోహన్, దాసోజు శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement