సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసే పెట్టుబడి చెక్కులను పోలీస్‌స్టేషన్లలో భద్రపరచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పోలీసుస్టేషన్లతోపాటు ట్రెజరీ కార్యాలయాలు, బ్యాంకుల్లోనూ భద్రపరచాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. రెండు, మూడు రోజుల్లో కొన్ని బ్యాంకుల నుంచి చెక్కులు ముద్రితమై బయటకు వస్తాయి.
వాటిని హైదరాబాద్‌లో ఆయా బ్యాంకు ప్రధాన కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా వ్యవసాయశాఖకు అందజేస్తారు. వాటిని ఆ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ స్వీకరిస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల(డీఏవో)కు కమిషనర్ వాటిని అందజేస్తారు. వాటిని డీఏవోలు అత్యంత భద్రత నడుమ జిల్లాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాల్సి ఉంటుంది.
గ్రామాల వారీగా బండిళ్లు
ఈ నెల 20 నుంచి రైతుబంధు చెక్కులను పంపిణీ చే సేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చెక్కులను ముద్రించే బాధ్యత ఎనిమిది బ్యాంకులకు ఇచ్చిన సంగతి తెలిసిందే. చెక్కుల బండిళ్లను జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాలవారీగా సిద్ధం చేస్తారు. వాటిని వ్యవసాయశాఖ పంపిణీ చేస్తుంది. 60 లక్షలకు పైగా చెక్కులు ముద్రించే అవకాశముంది. వాటిని తరలించేందుకు వ్యవసాయశాఖ ట్రంక్ పెట్టెలను కొనుగోలు చేసింది.
అయితే, చెక్కులు చోరీకి గురికాకుండా, దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల ముందే జిల్లాలకు పంపిణీ చేసే అవకాశమున్నందున వాటిని పోలీసు స్టేషన్లలో ఉంచాలని, అవిలేని చోట్ల ట్రెజరీలు, బ్యాంకుల్లోనూ దాచిపెట్టాలని నిర్ణయించారు. వాటి భద్రత బాధ్యత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కొందరు అధికారుల బృందానికి అప్పగించాలని నిర్ణయించారు.
కాలాతీతమైన చెక్కులు ఏంచేయాలి?
పెట్టుబడి చెక్కుల గడవు మూడు నెలలు. ఒకవేళ గ్రామసభలో పంపిణీ చేసిన చెక్కుల సొమ్మును మూడు నెలల్లోగా (గడువులోగా) రైతులు బ్యాంకుల నుంచి తీసుకోకపోయినా, రైతులు తీసుకోని చెక్కులు మూడు నెలల తర్వాత కూడా అలాగే ఉండిపోయినా వాటిని ఏం చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే బాధ్యత ఆ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment