
సాక్షి, అమరావతి: గతేడాది మధ్యలో నిలిపివేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాగుడుమూతలాడుతున్నారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ సమాచారమిచ్చి ముఖం చాటేయడం గమనార్హం. ఏడాది క్రితం మధ్యలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిఉన్న ఆ ఎన్నికలను పూర్తి చేసేలా ఆదేశించాలని సీఎస్ కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ఆరు రోజుల్లో ముగిసిపోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టవచ్చని ప్రభుత్వం తరపున సీఎస్ నివేదించారు.
ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకే తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు.
సెలవు కాదు.. విధుల్లోనే ఉన్నా
నిమ్మగడ్డ శుక్రవారం సెలవులో లేరని, అధికారికంగా ఆయన విధుల్లోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా నిమ్మగడ్డ హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, 18న జరిగిన మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలను ఆయన అక్కడ నుంచే పర్యవేక్షించారని పేర్కొన్నాయి. కాగా ఈ నెల 22 నుంచి 24వతేదీ వరకు ఎల్‌టీసీపై తమిళనాడులోని మధురై, రామేశ్వరం పర్యటనకు వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది.
కలవకపోవడం ధిక్కారమే..
కరోనా వ్యాక్సినేషన్ కారణంగా అధికార యంత్రాంగం అంతా ఈ ప్రక్రియలో నిమగ్నమైనందున ఈ ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ వైద్య ఆరోగ్య శాఖ నివేదికతో సహా ఎస్‌ఈసీకి తెలియచేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆగమేఘాలపై నిర్వహించి ఏడాది క్రితం మధ్యలో ఆపేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం పట్టించుకోలేదు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ ఎన్నికల నిర్వహణకు సుముఖత చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ ఆదేశించినా ఏవో సాకులు చెప్పి రాకపోవడం నిమ్మగడ్డ ధిక్కార ధోరణికి నిదర్శనమనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో
జరుగుతోంది.