
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అన్నిచోట్లా రాత్రి 8 గంటలకల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతోపాటు మున్సిపల్ శాఖ కమిషనర్, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్లకు సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఒక అంకె ఓట్ల తేడా ఉన్నచోట మాత్రమే రీకౌంటింగ్ నిర్వహించాలని, రెండంకెల ఓట్ల తేడా ఉన్నప్పుడు అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరితే రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని తెలిపారు. కేవలం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్‌కు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు.
కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నిమ్మగడ్డ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వీడియో కెమేరాల ద్వారా, లేదంటే సీసీ కెమేరాలు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియో ఫుటేజీని ఎన్నికల రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో విద్యుత్ అంతరాయాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment