ఓటెత్తిన పురం | Heavy polling registration in AP municipal elections | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన పురం

Published Thu, Mar 11 2021 2:55 AM | Last Updated on Thu, Mar 11 2021 5:41 AM

Heavy polling registration in AP municipal elections - Sakshi

ఒంగోలు నగరం ఆగ్జీలియం స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు

సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో ఓట్లు పోటెత్తాయి. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 62.28 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరపాలక సంస్థల కంటే పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లో 57.14 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 70.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవమైనవాటిని మినహాయించగా 12 నగరపాలక సంస్థల్లోని 581 డివిజన్‌ల్లో 2,569 మంది, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డుల్లో 4,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం మీద 7,550 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నగరపాలక సంస్థల పరిధిలో 4,626, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 3,289 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు విజయవాడలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారిని కూడా ఓట్లు వేసేందుకు అనుమతించారు. ఓటర్‌ స్లిప్పులు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తే ఓటింగ్‌కు అవకాశమిచ్చారు. 

పటిష్ట భద్రతా ఏర్పాట్లు
పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులను సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూములకు తరలించారు. సీసీ కెమెరాలతోపాటు స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

ఓట్లేసిన 48.30 లక్షల మంది..
► పోలింగ్‌ నిర్వహించిన 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొత్తం 77,56,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 48,30,296 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
► అత్యధికంగా 75.93 శాతం ఓటింగ్‌తో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 
► 75.49 శాతం పోలింగ్‌తో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో, 71.52 శాతంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. 
► కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్‌ నమోదైంది. 

నగరపాలక సంస్థల్లో టాప్‌లో ఒంగోలు
► నగరపాలక సంస్థల్లో 75.52 శాతం పోలింగ్‌తో ఒంగోలు మొదటి స్థానంలో నిలిచింది. 
► 71.14 శాతం పోలింగ్‌తో మచిలీపట్నం రెండో స్థానంలో, 66.06 శాతం పోలింగ్‌తో చిత్తూరు మూడో స్థానంలో ఉన్నాయి.
► కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం ఓట్లు పోలయ్యాయి. 

పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొదటి స్థానంలో గూడూరు 
► 85.98 శాతం పోలింగ్‌తో గూడూరు (కర్నూలు జిల్లా) నగర పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది.
► 83.04 శాతం ఓటింగ్‌తో అద్దంకి రెండో స్థానంలో, 82.24 శాతం ఓటింగ్‌తో మండపేట మూడో స్థానంలో ఉన్నాయి. 
► ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం ఓట్లు పోలయ్యాయి. 


పురపాలక ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు..
పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పురపాలక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్‌ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
► ఎన్నికలు నిర్వహించిన 12 నగరపాలక సంస్థల్లో మొత్తం 2,204 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 9,788 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్‌ సిబ్బంది 7,412 మంది కాగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 2,376 మంది.
► ఎన్నికలు నిర్వహించిన 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కోసం 1,822 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 7,136 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్‌ సిబ్బంది 5,195 మంది కాగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 1,941 మంది ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement