బాలాజీ నాయుడు
రాజకీయ నేతలనే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ భర్తను మోసగించిన కేసులో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 29 పోలీస్ స్టేషన్లలో 32 కేసులు నమోదవగా 21 సార్లు జైలుకు వెళ్లాడు.
సాక్షి, సిటీబ్యూరో: అతను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు... కరీంనగర్, ఖమ్మం, విశాఖ జిల్లాల్లో పని చేశాడు... గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు.రాజకీయ నేతలనే లక్ష్యంగా చేసుకొని వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 29 పోలీస్ స్టేషన్లలో అతనిపై 32 కేసులు ఉండగా... 21 సార్లు జైలుకు వెళ్లాడు. ఇదీ ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడి నేర చరిత్ర . తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ భర్తను మోసగించిన కేసులో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు.
ఏసీబీకి చిక్కి...
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్ ఇంజినీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పని చేశాడు. విశాఖలో విధులు నిర్వహిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి, ఆ కేసు రుజువై ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో జట్టుకట్టి బయటకు వచ్చిన ఇతను మోసాలనే వృత్తిగా మార్చుకున్నాడు. విజయనగరంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని సంబంధిత ఎమ్మెల్యేలకు సూచించాలని ఎర వేసి, డిపాజిట్ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. దీంతో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచే రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు.
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఫోన్ నెంబర్లు...
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెం.197ను సంప్రదించి అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్‌పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చీపురుపల్లి, పొన్నూరు, కారంచేడులకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు తెలుసుకుని 2013లో వారిని టార్గెట్ చేశాడు. రాజీవ్ యువకిరణాల ప్రాజెక్ట్ డైరెక్టర్‌నంటూ ఎర వేశాడు. వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున డిపాజిట్ పేరిట రూ.3.50 లక్షలు రాబట్టాడు. కొందరు నిరుద్యోగులను సైతం ముంచాడు. వీటిపై బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు.
ముగ్గురు ఎంపీలకూ..
బెయిల్‌పై బయటకు వచ్చిన బాలాజీ అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు (వీహెచ్), దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్థన్‌లను టార్గెట్ చేశాడు. వీహెచ్ రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ నుంచి రూ.66,000, గోవర్థన్ రూ.1,32,00 డిపాజిట్ చేశారు. తర్వాత వారికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అరెస్టయ్యాడు. 2015లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి చిక్కాడు.
కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్సీని...
బాలాజీ నాయుడిని హైదరాబాద్ పోలీసులు గతేడాది జనవరిలో పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలుకు పంపారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఇతను సిటీతో పాటు ఏపీ, తెలంగాణల్లో పలు మోసాలు చేశాడు. సెప్టెంబర్ 12న తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్‌చేసి తనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర పథకాలకు చెందిన రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఐదు శాతం చెల్లిస్తే ఆ మొత్తం విడుదల చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో ఆమె తన కుమారుడు దీపక్ ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు వేయించారు. తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త ప్రకాశ్‌కు ఫోన్ చేసి వారి మున్సిపాలిటీకి చెందిన రూ.2 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉన్నాయనీ, రూ.30 వేలు చెల్లిస్తే క్లియర్ చేస్తానంటూ నమ్మించాడు. ఈ మోసంపై సూర్యాపేట టూటౌన్ ఠాణాలో కేసు నమోదైంది. బాలాజీ నాయుడి కదలికలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు వలపన్ని ఆదివారం పట్టుకున్నారు. నిందితుడు మనోహర్, లక్ష్మణ్, మల్లేశ్ పేర్లతోనూ చెలామణీ అయినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment