చైర్‌పర్సన్ దంపతులు మంజుల రమేష్
వికారాబాద్ అర్బన్: కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్‌కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్‌గా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్‌కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్‌కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది.
2020లో బీఆర్‌ఎస్‌లోకి..
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ చైర్మన్ పదవి ఆశించి బీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. అయితే చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు రావడంతో అనూహ్యంగా తన సతీమణి మంజులను బీఆర్‌ఎస్ తరఫున 24వ వార్డు కౌన్సిరల్‌గా పోటీ చేయించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చైర్‌పర్సన్ పదవి దక్కింది. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చైర్‌పర్సన్ దంపతులకు, ఎమ్మెల్యే ఆనంద్‌కు తీవ్రంగా గ్యాప్ పెంచింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ అధికార పార్టీ కౌన్సిలర్లతో అనేక సార్లు కౌన్సిల్ సమావేశాల్లో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారని చైర్‌పర్సన్ దంపతులే నేరుగా ఆరోపించారు.
అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్‌పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
మంజుల రమేష్‌కుమార్ దంపతుల బాటలోనే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్‌ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్‌కుమార్ దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment