సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు.
శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్‌పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్‌పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది.
తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్‌పర్సన్‌కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment