![Dishum Dishum at the municipal meeting](/styles/webp/s3/article_images/2024/06/30/illendu.jpg.webp?itok=3260tgGl)
వైస్ చైర్మన్‌పై చేయి చేసుకున్న చైర్మన్
ఎమ్మెల్యే ఎదుటే రచ్చరచ్చ
ఇల్లెందు మున్సిపల్ సమావేశంలో డిష్యుం డిష్యుం
ఇల్లెందు: ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్.. సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో బాహాబాహీకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దూషణలు, పరస్పర దాడులకు దారితీసింది. మూడు నెలల విరామం తర్వాత శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. పట్టణంలో రోడ్లపై వెలసిన దుకా ణాలు, తోపుడు బండ్లను తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చవుతుందంటూ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు.
అయితే ఆక్రమణలు తొలగిస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడం లేదు కదా.. దీనికి కొత్తగా ఫీజు రూపంలో రూ.2లక్షలు ఎందుకంటూ వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పరస్పరం అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చైర్మన్ వెంకటేశ్వరరావు.. వైస్ చైర్మన్ జానీపాషాపైకి దూసుకొచ్చినట్టు కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరోసారి ఘర్షణ జరగడంతో వైస్ చైర్మన్‌పై చైర్మన్ చేయి చేసుకున్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎదురుగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ వాసులకు సేవలందించాల్సిన పాలకవర్గ సభ్యులు ఇలా ఘర్షణ పడడం తగదని హితవు పలికారు. ఈ విషయంలో ఇద్దరిదీ తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమావేశంలో నిలదీస్తే ఇలా దాడులు చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అధికారులను ప్రశ్నిస్తుండగా చైర్మన్ జోక్యం చేసుకుని దాడికి దిగారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ వెంకటేశ్వరరావు వివరణ కోరగా.. తనను పలుమార్లు వ్యక్తిగతంగా దూషించినా సహించానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment