పుర పోరు.. పారాహుషారు | All Parties Leaders Ready To Municipal Elections In Telangana | Sakshi
Sakshi News home page

పుర పోరు.. పారాహుషారు

Published Mon, Nov 4 2019 2:43 AM | Last Updated on Mon, Nov 4 2019 5:01 AM

All Parties Leaders Ready To Municipal Elections In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నగారా మోగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కదలిక షురూ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న పట్టణ స్థాయి ఔత్సాహికులు గతంలోనే రంగంలోకి దిగినా.. తాజా పరిణామాల నేపథ్యంలో తమ కసరత్తును ముమ్మరం చేశారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేలతో కొంత వెనక్కు తగ్గినా.. ఇటీవల ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ, ఎన్నికల కమిషన్‌లు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో వారంతా వార్డుల బాట పట్టారు. రాష్ట్రంలో మొత్తం 129 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా.. 77 మున్సిపాలిటీల విషయంలో సింగిల్‌ బెంచ్‌ స్టే ఇచ్చింది. అయితే, వీటిపై సానుకూల తీర్పు వెలువడి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనే అంచనాలతో ఆశావహులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. 

రిజర్వేషన్లు, స్టేలపైనే ఉత్కంఠ.. 
ఓటర్ల జాబితాలో అవకతవకలు, కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం వార్డుల పునర్విభజన అంశాల్లో గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీలపై సోమవారం హైకోర్టు విచారించనుంది. విచారించాల్సిన కేసుల జాబితాలో దీనిని కూడా చేర్చినా.. సోమవారం విచారణకు వస్తుందా.. లేదా మళ్లీ వాయిదా పడుతుందా.. ఒకవేళ విచారణ జరిగితే ఏం తీర్పు వస్తుంది అనే లెక్కల్లో స్థానిక రాజకీయ యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి తోడు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే రిజర్వేషన్లు రెండు, మూడు రోజుల్లోనే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏ వార్డు ఎవరికి రిజర్వ్‌ అవుతుందన్న దానిపైనా రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలపై ఈ రిజర్వేషన్ల అంచనాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పాత మున్సిపాలిటీల విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఏ వర్గానికి రిజర్వ్‌ అయింది? ఈసారి ఎవరికి అవకాశం ఉందన్న దానిపై మాజీ కౌన్సిలర్లు, కొత్తగా కౌన్సిలర్లు కావాలనుకుంటున్న వారు లెక్కలు వేసుకుంటున్నారు. తమ వర్గానికే రిజర్వ్‌ అవుతుందా లేదా తమ వర్గానికి చెందిన మహిళకు రిజర్వ్‌ అవుతుందా.. అలా అయితే తాను కాకుండా తన భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దింపాలా అనే తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకవేళ తాము ఆశించిన వార్డులో రిజర్వేషన్‌ రాకపోతే తమకు అనుకూల రిజర్వేషన్‌ వచ్చే వార్డులు ఏమున్నాయి.. అక్కడ పోటీ చేయాలా వద్దా అనే అంశాలపై కూడా నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. 

అప్పుడే వార్డుల బాట 
కోర్టు తీర్పులు, రిజర్వేషన్లు ఎలా ఉన్నా స్థానిక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఔత్సాహికులు అప్పుడే వార్డుల బాట పట్టారు. తమకు అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలను తీసుకుని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తమకు అనుకూలంగా ఉన్న ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఫలానా వార్డులో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వార్డుల పునరి్వభజన జరిగిన తర్వాతి పరిస్థితేంటి? తమకు కలిసి వచ్చే అంశాలేంటి? ఇతర పారీ్టల నుంచి టికెట్లు ఆశిస్తున్నావారెవరు? ఎవరికి టికెట్‌ దక్కే అవకాశం ఉందన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇక, ఇతర స్థానిక సంస్థలతో పోలిస్తే నిధులకు ఇబ్బంది లేని నగర, పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన రాజకీయ పక్షాలకు తలనొప్పి కలిగించబోతోందని అంటున్నారు. 

ప్రసన్నం చేసుకుందాం.. పద 
ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో 80 శాతం మంది మళ్లీ సిద్ధపడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉండడంతో ఒక్కో వార్డులో వివిధ పారీ్టల నుంచి ఇద్దరు నుంచి 8 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అలాంటివారంతా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అగ్రనాయకత్వం వద్ద తమ అభ్యరి్థత్వం కోసం అప్పుడే పైరవీలు కూడా మొదలుపెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకత్వం వద్దకు వెళ్లి తమకు ఈసారి టికెట్‌ ఇప్పించాలంటూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. వీరితో పాటు స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరంతా నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి పురపోరు రసవత్తరంగా సాగబోతోందని స్థానిక రాజకీయ పరిస్థితులు చెబుతున్నాయి.  

తప్పులు సవరిస్తే బాగుంటుంది 
మున్సిపాలిటీ ఎన్నికల కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీల్లో జరిగిన తప్పులు సవరించాల్సి ఉంది. అలాగే వార్డులను ఎల్‌ ఆకారంలో, జెడ్‌ ఆకారంలో నిర్ధారించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అంతా సర్దుబాటు అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. స్టేలు వచి్చన మున్సిపాలిటీలపైప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్‌ వేయాలి. 
– బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్, నల్లగొండ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement