పదవులు ఉండవ్‌ | KCR Holds State Level Municipal Conference At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

పదవులు ఉండవ్‌

Published Wed, Feb 19 2020 3:34 AM | Last Updated on Wed, Feb 19 2020 5:03 AM

KCR Holds State Level Municipal Conference At Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ‘పట్టణ ప్రగతి’కార్యక్రమాన్ని.. ‘పల్లె ప్రగతి’పునాదిగా పేదలు ఎక్కువగా నివసించే దళితవాడల నుంచి ప్రారంభించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని పట్ట ణాలు, నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, 8 నెలల్లో విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం చూపని ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. పట్టణ ప్రగతి నిర్వహణపై ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సదస్సులో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. శాసనసభ్యులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతిని నిర్వహించాల్సిన తీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించి ప్రణాళికకు అనుగుణంగా ఖర్చు చేయాలన్నారు. పల్లె ప్రగతి సమీక్షలో భాగంగా గ్రామ పర్యటనలపై మండల పంచాయతీ అధికారుల్లో నిర్లక్ష్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని  గ్రామాల్లో రాత్రి బస, పాదయాత్ర ద్వారా పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు.

బల్దియా.. ఖాయా పీయా చల్దియా
‘మున్సిపాలిటీలు మురికి, చెత్త, అవినీతికి పర్యాయపదాలుగా మారాయి. బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా అనే సామెతలు వచ్చాయి. పారదర్శక విధానాలతోనే చెడ్డపేరు పోతుంది. ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకొద్దు. అన్ని పనులు ఓవర్‌ నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడొద్దు. ఫొటోలకు పోజులివ్వడం తగ్గించి పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు అభివృద్ది సాధిస్తాయి. ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు... మనమూ విజయం సాధించాలి’అని కేసీఆర్‌ సూచించారు.


మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సదస్సులో మాట్లాడుతున్న కేసీఆర్‌. సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు,  అధికారులు 

ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక...
స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో వార్డులు, పట్టణాలవారీగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని, వార్డులవారీగా నియమించే ప్రజాసంఘాల అభిప్రాయం కూడా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించి స్థానిక అవసరాలపై అంచనాకు రావాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, గుంతలు లేని రహదారులు, పచ్చదనం, డంప్‌ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్, శ్మశానవాటికలు, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం మార్కెట్లు తదితరాలను ఆదర్శ పట్టణాలు, నగరాలకు ఉండే ప్రధాన లక్షణాలని సీఎం పేర్కొన్నారు. పట్టణాల్లో కనీస పౌర సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనువైన స్థలాల ఎంపికతోపాటు అవసరమైన టాయిలెట్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు.

వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు...
వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే వరకు వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్ట ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నామన్నారు. ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒరిగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలో ఉండే స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉండే ట్రాన్స్‌ఫార్మర్‌లను మార్చాలన్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయడంతోపాటు పొట్టి స్తంభాలను తొలగించి పెద్ద స్తంభాలు వేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌లను విద్యుత్‌ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలన్నారు. గ్రామాల తరహాలో పట్టణాల్లోనూ మొక్కల పెంపు బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుతీసుకోవాలని, పట్టణ అవసరాల కోసం నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 3,100 వాహనాలకుగాను ఇప్పటికే 600 వాహనాలు కొనుగోలు చేసినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. డ్రైనేజీలు శుభ్రం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు.

పట్టణాలకు ప్రతినెలా నిధులు...
ఇతర ఖర్చులను తగ్గించుకొని పట్టణాలకు ప్రతి నెలా రూ. 148 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తామని, వాటిని ఖర్చు చేసేందుకు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల అప్పులకు సంబంధించిన కిస్తీ చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులను ప్రతి నెలా కచ్చితంగా చెల్లించే బాధ్యత కమిషనర్లు తీసుకోవడంతోపాటు పచ్చదనం కోసం 10 శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణ ప్రగతికి వినియోగించాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలపై నమ్మకాన్ని పెడుతూ ఇళ్ల నిర్మాణం, లే అవుట్‌ల విషయంలో సులభతర అనుమతుల విధానం తెచ్చామన్నారు. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. జీవో నంబర్‌ 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం వెల్లడించారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సదస్సులో భాగంగా మేయర్లు, చైర్‌పర్సన్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఆదర్శ నగరాలుగా మార్చే బాధ్యత మీదే...
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా మార్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకప్పుడు కష్టం, త్యాగాలతో కూడిన రాజకీయాలు ఉండేవని, బ్రిటిష్‌ పాలన తర్వాత దేశంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయన్నారు. ‘జాతి నిర్మాణంలో తమ పాత్రను గుర్తెరిగి పనిచేసే వారికి మంచిపేరు వస్తుంది. ప్రజానాయకులుగా ఎదిగితే అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోకూడదు’అని సీఎం హితవు పలికారు. ‘ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం. ఆ తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు తీరు చూస్తే అది అర్థం అవుతుంది. ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. సంకల్పం గట్టిగా ఉంటే 100 శాతం విజయం సాధిస్తారు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్‌ సత్యనారాయణ సైతం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement