పక్కా స్కెచ్‌తో.. | Murder Attempt On Municipal Chairman Suribabu | Sakshi
Sakshi News home page

పక్కా స్కెచ్‌తో..

Published Sat, May 12 2018 1:10 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

Murder Attempt On Municipal Chairman Suribabu - Sakshi

చైర్మన్‌ హత్య కుట్రకు కారణమైన భవంతి ఇదే..( చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు )

పెద్దాపురం: పట్టణ ప్రథమ పౌరుడు, పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజును హత్య చేసే కుట్ర విఫలమైంది. గుర్తు తెలియని దుండగులు చైర్మన్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పెద్దాపురం పోలీసులు భగ్నం చేశారు. 15 రోజులుగా ఆయనను హత్య చేసేందుకు స్థానికంగా ఓ లాడ్జిలో ఉంటూ సూరిబాబు రాజు ఏ సమయానికి ఎక్కడ వెళతారన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటూ రెక్కీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. పట్టణంలోని ఆరో వార్డులో ఓ స్థల వివాదానికి సంబంధించి సూరిబాబు రాజు వద్దకు కొందరు వచ్చారు. వారికి మద్దతుగా ఆయన ఇచ్చిన తీర్పు నచ్చకపోవడంతో వ్యతిరేక వర్గీయులు ఆయనపై హత్యాయత్నానికి కుట్రపన్నారన్న వార్తలు శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో దావణంలా వ్యాపించాయి.

గురువారం రాత్రి క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం దాడులు నిర్వహించిన పోలీసులకు నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారిస్తుండగా.. ఈలోపు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు మిగిలిన ఇద్దరిని విచారించగా.. చైర్మన్‌ సూరిబాబు రాజును హత్య చేసేందుకు వచ్చినట్టుగా వారు పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలిసింది. గతంలో టెన్నిస్‌ కోర్టు, వాకింగ్‌ వెళుతున్నప్పుడు, ఓ వివాహ వేడుకలో కూడా చైర్మన్‌ సూరిబాబు రాజుపై అటాక్‌ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. రాజమండ్రి, ఏలూరు, పెద్దాపురం ప్రాంతాలకు చెందిన వారే ఆయనపై హత్య చేసే కుట్ర పన్నినట్టు చైర్మన్‌ వర్గీయులు చెబుతున్నారు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇరువురు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను సామర్లకోట క్రైం స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement