
కొల్లు రవీంద్రను ప్రత్యేక వాహనంలో తరలిస్తున్న దృశ్యం
సాక్షి, మచిలీపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణతోపాటు మరో మైనర్ని కూడా ప్రత్యేక బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు.
మచిలీపట్నంలోని సబ్ జైలులో సరైన సౌకర్యాలు లేనందున.. నిందితులను రిమాండ్ నిమిత్తం నేరుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది కోరగా.. జడ్జి తోసిపుచ్చారు. సోమవారం మరోసారి కొల్లు తరఫు న్యాయవాదులు ఇదే విషయమై సబ్ జైలర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి సమర్పించగా.. ఆయన కోర్టుకు రిఫర్ చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.శ్రీనివాస్ దానిపై సానుకూలంగా స్పందిస్తూ.. నిందితుల్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేందుకు అనుమతిచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య కొల్లు రవీంద్రతోపాటు మిగిలిన నిందితులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. (‘పేరు బయటకు రాకుండా మర్డర్ ప్లాన్’)