రాజమహేంద్రవరం: అమ్మా.. ఎక్కడికి వెళ్లాలి. రమ్మంటారా.. బ్యాంకుకా పదండి వెళ్దాం.. అంటూ నమ్మకస్తుడిగా నటించిన ఓ ఆటో డ్రైవర్ చివరికి ఆ వృద్ధురాలిని హత్య చేసి బంగారం కాజేశాడు. అప్పులు, ఖర్చుల కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఎ.లతామాధురి తెలిపారు. దీనిపై శుక్రవారం బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
గత నెల 4న రాత్రి హుకుంపేట ఆదర్శనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు జంగా నారాయణమ్మ (60) హత్యకు గురైంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఆమె ముక్కు, నోరు మూసివేసి హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ శేమూషీ బాజ్‌పాయ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, ఈస్ట్‌జోన్ డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో బొమ్మూరు, రాజానగరం ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్‌లు, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు.
అనుమానం వచ్చి హుకుంపేట ఆదర్శనగర్ పార్కు వద్ద ఉంటున్న ఆటో డ్రైవర్ చుక్కా లోవరాజును ఆవ రోడ్డులో బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరెడ్డి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. లోవరాజు సొంతూరు విజయవాడ. అక్కడ గతంలో అతనిపై దొంగతనాల కేసులున్నాయి. పదేళ్ల కిందట ఆయన రాజమహేంద్రవరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హత్యకు గురైన జంగా నారాయణమ్మకు లోవరాజు ఆటోడ్రైవర్‌గా పరిచయం అయ్యాడు. ఆమెకు నమ్మకస్తుడిగా ఉంటూ సుమారు నాలుగేళ్ల నుంచి ఆసుపత్రులకు, బ్యాంకు పనులకు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు తన ఆటోలో కిరాయికి తిప్పుతూ ఉండేవాడు.
అంతా గమనించి..
నారాయణమ్మ ఒంటరిగా ఉంటుందని, ఆమె వద్ద బంగారం ఉందని గమనించాడు. ఆ బంగారం దొంగిలించి అప్పులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని నిందితుడు భావించాడు. ముందుగానే హత్యకు పథకం వేశాడు. గత నెల 4న రాత్రి 8 గంటలకు ఎవరూ లేని సమయంలో లోవరాజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి, ఒంటి మీద బంగారాన్ని దోచుకుపోయాడు. ఈ కేసులో చివరికి నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.4 లక్షల విలువైన 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ లతామాధురి తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్‌స్పెకర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్‌లను, బొమ్మూరు పీఎస్ సిబ్బంది, డీఎస్పీ క్రైం పార్టీని ఎస్పీ శేముషీ బాజ్‌పాయ్ అభినందించారు.
చోరీ కేసులలో నిందితుల అరెస్ట్
అర్బన్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రవికుమార్, ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాస్‌లకు వచ్చిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర చోరీ నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ లతామాధురి తెలిపారు. విశాఖపట్నానికి చెందిన బందు గోవింద్, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్‌కు చెందిన ఆలమురి సంజీవరెడ్డిలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కాసుల బంగారు ఆభరణాలు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు గత రెండు నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఆరు నేరాలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంటి ప్రహరీ దూకి కిటికీ తెరిచి చూస్తుండగా వాచ్‌మెన్ చూడటంతో పరారయ్యారు. టుటౌన్ పరిధిలో రెండు, ప్రకాష్‌నగర్ పరిధిలో రెండు, బొమ్మూరు రెండు, కాకినాడ సీసీఎస్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటి, చిత్తూరు జిల్లా అలిపిరి పరిధిలో పలు దొంగతనాలు చేశారు. బందు గోవిందుపై రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో సుమారు 15 కేసులు ఉన్నాయి. ఐదు కేసుల్లో శిక్ష కూడా పడింది. వారిని పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులను అర్బన్ ఎస్పీ అభినందించారని లతామాధురి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment