మంత్రితో వేగలేం | DONOT CONTINUE WITH ENDOWMENT MINISTER | Sakshi
Sakshi News home page

మంత్రితో వేగలేం

Published Thu, Jul 13 2017 1:16 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

మంత్రితో వేగలేం - Sakshi

మంత్రితో వేగలేం

తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పోగొడతారేమోనన్న అనుమానం వస్తోందని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 15వ వార్డులో టీడీపీ అధికారిక కౌన్సిలర్‌ను కాదని ప్రతిపక్ష పార్టీవారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్టు చుక్కా కన్నమనాయుడు రాజీనామా పత్రాన్ని మున్సి పల్‌ చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ వార్డులో మంత్రి మాణిక్యాలరావు ఓటమికి పనిచేసిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్‌ రాజీనామా చేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ద్వారా అధికారులను వెంటబెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నిక విధానం ఒకటేనన్నారు. ఎవ్వరికైనా ప్రజలు ఓట్లేసి నెగ్గించాలి్సందేనన్నారు. ఎంపీ సీట్లో మంత్రి కూర్చోలేరు. మంత్రి సీట్లో ఎంపీ కూర్చోలేరు. నా సీట్లో ఎమ్మెల్యే వచ్చి కూర్చోలేరని బొలిశెట్టి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలన్నారు. మంత్రిని గౌరవిస్తూ వస్తున్నామన్నారు. ప్రతీ అభివృద్ధి పనికి మంత్రి మాణిక్యాలరావుకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు. కౌన్సిలర్లు కలిసిఉండటం మంత్రికి ఇష్టంలేదన్నారు. గతంలో నలుగురు బీజేపి కౌన్సిలర్లకు 40 లక్షల రూపాయల నిధులు ఇచ్చారు. ఇటీవల సీఎం ఇచ్చిన కోటి రూపాయల నిధులను ఆరుగురు కౌన్సిలర్లకు మంత్రి ఇచ్చారన్నారు. కనీసం మునిసిపల్‌ చైర్మన్‌కు, అధికారులకు తెలియకుండా మంత్రి ఇలా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి ఈ విధంగా పంచుకుంటూ వెళితే మిగిలిన కౌన్సిలర్లకు ఏం సమాధానం చెప్పాలన్నారు. సీఎం గూడెంకు సంబంధించిన పనులు, నిధులు నాకు అప్పగిస్తే మంత్రి ఎలా ఫీలవుతారో.. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో నిధులు, పనులు చేస్తే తాను కూడా అదేవిధంగా ఫీలవుతానన్నారు.
 
అవసరమైతే సామూహిక రాజీనామా 
మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే 
తేల్చుకుంటామని బొలిశెట్టి చెప్పారు. ఈ మేరకు కౌన్సిలర్లతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం కనుక మాణిక్యాలరావు కరెక్టు అని చెబితే ఆయన చేతికే రాజీనామా సమర్పించి వస్తానని చైర్మన్‌ స్పష్టం చేశారు. మంత్రి వైఖరికి నొచ్చుకొని రాజీనామా చేసిన చుక్కా  కన్నమనాయుడు రాజీనామాను ఆమోదిస్తే. ఆయనకు మద్దతుగా సామూహిక రాజీనామా చేస్తామని బొలిశెట్టి చెప్పారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ కిల్లాడి ప్రసాద్‌ , టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement