సాక్షి, తాడేపల్లిగూడెం: బీజేపీలో గుర్తింపు కోసమే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..తాడేపల్లిగూడెంలో దేవాదాయ భూములను విచ్చలవిడిగా ఆక్రమించుకుని అమ్ముకున్న మాణిక్యాలరావు.. వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దేవాదాయ శాఖ భూములను ప్రజలకు పంపిణీ చేస్తామని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. టీడీపీ ఎజెండాను మోస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ఐవైఆర్ కృష్ణారావు చెబుతుంటే.. మాణిక్యాల రావు మాత్రం గుర్తింపు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!
వైఎస్ జగన్ పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కితాబునిస్తుంటే.. మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని భూములపై చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ట్రేడింగ్ వ్యవహారానికి తెర లేపితే చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా అని నిప్పులు చెరిగారు. జన్మభూమి కమిటీలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటేనంటూ అహగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాణిక్యాలరావును విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించే వాలంటరీ వ్యవస్థ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రసుగా మారిపోయిన టీడీపీ ఎంపీలను బీజేపీలో సభ్యులుగా చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వ్యక్తులకు మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారని ఎమ్మెల్యే సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment