
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పేరుతో దోచుకున్నారని తాడేపల్లి గూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తాడేపల్లి గూడెంలోనూ టీట్‌కో హౌసింగ్ కట్టించారని.. 300 చదరపు అడుగల ఇంటికోసం ఆరున్నర లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మూడున్నర లక్షలకు పైగా పేదలను అప్పుల పాలు చేశారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఎక్కడైనా వెయ్యి నుంచి 1200 వందలే ఉంటుందన్నారు. టీట్‌కో హౌసింగ్ లబ్ధిదారులను ఇష్టానుసారంగా ఎంపిక చేశారన్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీతో నిర్మాణం అన్నారని.. కానీ నిర్మాణంలో అన్నీ అవకతవకలే జరిగాయన్నారు. ప్రతి ఇంటి స్లాబు లీక్ అవుతోందన్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఆ ఇళ్లలో మురుగు నీరు బయటకు వెళ్లే సదుపాయం కూడా లేదన్నారు. ఇటర్నేషనల్ టెక్నాలజీ పేరుతో పేదలపై అప్పుల భారం మోపారని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
తాడేపల్లిగూడెంలో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.