సంతానోత్పత్తికి సంబంధించి ఏపీ శాసనసభ చేసిన చట్ట సవరణ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా చేస్తున్న ప్రచారానికి అనుగుణంగా ఉంది. దీని ప్రకారం ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హులవుతారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణ కోసం అప్పటి ప్రభుత్వం చేసిన చట్టం కాస్తా లేకుండా పోయింది. అయితే దీనివల్ల ప్రయోజనం ఎంత మేరకన్నది మాత్రం చర్చనీయంశమే. ఇద్దరి కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టాన్ని ఆమోదించింది కానీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఇది వర్తించదు.
టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అరకొరగా చేసిన ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏమిటన్న సందేహమూ ఆయన వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా ‘‘పిల్లలను కనండి..వారి భవిష్యత్తు నేను చూసుకుంటా‘ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందులో భాగంగా కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేల చొప్పు ఇస్తామన్న ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రోత్సహాకాలు ఇవ్వాలని కూడా సూచించారు. చైనా, జపాన్ వంటి దేశాలలో వృద్దుల సంఖ్య పెరుగుతుండడం, అక్కడ యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటుండడం వంటి కారణాల రీత్యా కొన్ని సమస్యలు వస్తున్నాయి.
ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చైనా తన చట్టాలను కూడా మార్చుకుంది. ఒకే సంతానం అన్న పరిమితిని ఎత్తేసింది. జపాన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. రష్యా తదితర దేశాలు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. అయితే ఈ దేశాలకు, భారత్‌కు అసలు పోలికే లేదు. భారత్‌లో నిరక్షరాస్యత ఎఉక్కవ, పేదరికమూ తగ్గలేదు. అధిక జనాభా కారణంగా సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమవుతోందన్న ఆలోచనతో అప్పట్లో భారత్‌లో జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. 1960లలో కేంద్రం కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంలా అమలు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారన్న అంశం పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే.
ఎమర్జెన్సీ అకృత్యాలతోపాటు నిర్భంధ ఆపరేషన్లూ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.1990లలో జనాభా నియంత్రణ లక్ష్యంతో ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలలో పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తెచ్చారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా తగ్గుదల ఆవశ్యకతపై శాసనసభలో చర్చలు జరిపారు. తీర్మానాలు చేశారు. నిరోధ్ వంటి బొమ్మలను అసెంబ్లీ ఆవరణలో ప్రదర్శించడం పై కొన్ని అభ్యంతరాలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కాలంలో ఈ అంశానికి అంత ప్రాధాన్యత రాలేదు. దానికి కారణం ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒకరిద్దరు పిల్లలను కంటున్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి వాటిపై శ్రద్ద చూపుతున్నారు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎప్పటి నుంచో ఈ విధంగా ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నాయి.
ఒకప్పుడు అంటే పూర్వకాలంలో జనాభా నియంత్రణ పద్దతులు అంతగా వ్యాప్తిలోకి రాకముందు అధిక సంఖ్యలో సంతానాన్ని కనేవారు. ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు పదకుండు మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఒకరని కాదు..అనేకమంది పరిస్థితి ఇలాగే ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కుటుంబ పద్దతులు అన్నిటిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహాకాలతో నిమిత్తం లేకుండా ఎవరికి వారు అలా చేస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రబాబు అధిక సంతానం కోసం ప్రచారం ఆరంభించే దశ వచ్చింది. దీనిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వంటి ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్వాగతించలేదు. దానికి కారణం పిల్లలను కంటే ఎవరు పోషిస్తారు? దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అన్న మీమాంస ఉండడమే.
ఈ రోజుల్లో పిల్లల విద్యకు ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయల చొప్పున ఫీజులు కట్టాల్సి వస్తోంది. జగన్ ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడేలా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడంతో పాటు ,అమ్మ ఒడి పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చింది. ఆ స్కీమ్ సఫలం అవడంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేస్తూ ప్రతి తల్లికి కాదు.. బడికి వెళ్లే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దీనిని అమలు చేయలేదు. దాంతో ఏపీలో పేద కుటుంబాలు మోసపోయామని భావిస్తున్నాయి. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కూడా టీడీపీ, జనసేన కూటమి సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చాయి. ఆ విషయాన్ని చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.
తీరా అధికారంలోకి వచ్చాక అవన్ని ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి నిజంగానే పిల్లలను ఎక్కువగా కంటే ఎవరు పోషిస్తారని జనం అడుగుతున్నారు. పోనీ ఈ ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ కుటుంబాలలో దానిని అమలు చేసి చూపిస్తున్నారా? అంటే అదేమీ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక, వారి మెప్పు పొందేందుకు ఇలాంటి కొత్త, కొత్త ప్రచారాలు ఆరంభించారన్న అభిప్రాయం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త అవతారం ఎత్తే యత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలపై హిందూవాదులు పెద్దగా స్పందించలేదు కాని, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు.
నిజానికి ఎవరి కుటుంబం వారిది. వారి ఆర్థిక స్థోమతను బట్టి పిల్లల సంఖ్యను నిర్ణయించుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు చెప్పారనో, మరెవరో అన్నారనో, లేక కేవలం ఏదో స్థానిక ఎన్నికల నిమిత్తమో ఇద్దరిని మించి పిల్లలను కంటారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ సభ్యుడు అన్నట్లు నిజంగానే అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ఆయా సంక్షేమ పథకాలు పిల్లలందరికి వర్తిస్తాయని కూడా ప్రభుత్వం తీర్మానించాలి కదా! అలా చేయలేదు సరికదా, ఇస్తామన్న తల్లికి వందనం స్కీమును హుళక్కి చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలను బాగా కనండి అని చంద్రబాబు ప్రచారం చేస్తే నమ్మి ఎవరైనా అలా చేస్తారా?
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment