హలధారులే కానీ.. హంతకులు కారు | Kancha Ilaiah Article On Celebrities Talking About Farmers Protest | Sakshi
Sakshi News home page

హలధారులే కానీ.. హంతకులు కారు

Published Wed, Feb 10 2021 12:39 AM | Last Updated on Wed, Feb 10 2021 8:21 AM

Kancha Ilaiah Article On Celebrities Talking About Farmers Protest - Sakshi

ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్‌ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న విత్తనాలను నాగేటి చాలులో రైతులు ఎలా చల్లుతారో కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సచిన్‌ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగనా రనౌత్‌ వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది.

భారతీయ రైతులు ఉగ్రవాదులంటూ కంగనా రనౌత్‌ పదే పదే దాడిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్‌ గాయని రిహానా, అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌ భారతీయ రైతుల ఉద్యమాన్ని బలపర్చినందుకు స్పందనగా కంగనా మన రైతులను ఉగ్రవాదులను చేసిపడేశారు. సచిన్‌ టెండూల్కర్, ఇతర బీజేపీ అనుకూల శక్తులుకూడా దీనికి వంతపాడారు. ఈ సెలబ్రిటీల్లో చాలామంది గుత్తపెట్టుబడి దారీ సంస్థలకు అనుకూలంగా ఉంటారు.

భారతీయ రైతులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఎవరి వైపు నిలబడాలి అని తేల్చుకోవడానికి కులపరమైన సామాజిక స్థానమే కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ అభిప్రాయాలు అనేక అంశాలపై వ్యక్తమవుతూ ఉంటాయి. నిజానికి బీజేపీ/ఆరెస్సెస్‌ శక్తులు అనేక సందర్భాల్లో అంతర్జాతీయ మద్దతును తమకు అనుకూలంగా కూడగడుతూ వచ్చాయి. నిర్భయ ఘటన సమయంలో అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలు చాలా వ్యక్తమయ్యాయి. అవి చాలావరకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవి కాబట్టి ఆరెస్సెస్‌/బీజేపీ కూటమి చాలా సంతోషంగా అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలను స్వాగతించేది. మన రైతులు ఈ స్థాయిలో ఆందోళనను నిర్వహించడం నా జీవితకాలంలోనే చూసి ఎరుగను. ఈ సచిన్‌ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగన వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ద్వారా భారతీయ శూద్ర రైతులపై ఎక్కుపెట్టిన క్షత్రియ బాణమే కంగనా రనౌత్‌ అనేది అందరికీ తెలిసిందే. నేను ఇంత బలంగా ఎందుకు చెబుతున్నానంటే, ఆందోళన చేస్తున్న రైతులు చాలావరకు శూద్రులే. ఇక క్షత్రియులు ఒక సామాజిక వర్గంగా ఎన్నడూ నాగలి చేత బట్టి ఎరుగరు. వారి చేతుల్లో ఎస్టేట్ల కొద్దీ భూములున్నప్పటికీ తమ చారిత్రక ఉనికిలో క్షత్రియులు నాగలి పట్టలేదు. పొలాలను దున్నడం అనేది వారి సామాజిక హోదాకు భంగకరమని వీరి భావన. ఆసక్తికరమైనదేమిటంటే, ఉత్తరప్రదేశ్‌కి చెందిన జాట్‌లు రాకేష్‌ తికాయత్‌ నాయకత్వంలో ప్రస్తుతం రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉండటమే. అయినప్పటికీ ఖలిస్తాన్‌తో ఈ ఆందోళనను ముడిపెట్టి పంజాబ్‌ రైతుల ఉద్యమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కంగనా చెబుతూ వస్తోంది. వ్యవసాయ ఉత్పత్తికి, దానిద్వారా వ్యాపారం చేసి లాభాలు సాధించాలని కోరుకుంటున్న వ్యాపార వర్గాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. 

రైతులు భారతదేశ చరిత్రలో ఎన్నడూ వ్యాపార సముదాయంగా మారలేదు. దేశంలో ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, లింగాయత్, జాట్, గుజ్జర్, యాదవ్, మరాఠా వంటి కులాల ప్రజలు గుత్తాధిపత్య వాణిజ్యంలోకి ఎన్నడూ అడుగు పెట్టలేదు. అదే సమయంలో బడా వ్యాపారం మొత్తంగా బనియాలు, బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిస్‌ వంటి వారి చేతుల్లో ఉండిపోయింది. ఇటీవలే క్షత్రియులు కూడా వాణిజ్యంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కులపరమైన విభజన కారణంగానే రైతుల భయాలు రెట్టింపవుతున్నాయి. ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్‌ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న వనరు అయిన విత్తనాలను నాగేటి చాలులో ఎలా చల్లుతారో కూడా తెలిసి ఉండకపోవచ్చు.  

తెలుగు కవి అస్తా గంగాధర్‌ రైతు గురించి రాసిన పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. ’’ఓ కర్షకుడా నీవే మా హీరో, ఓ రైతా నీవే మా లెజెండ్, ఓ రైతా బురదలోంచి ఆహారం పండిస్తావు, నీవు ఆహారం పండించకుంటే కంప్యూటర్లు పనిచేయవు, నీవు ఆహారం పండించకుంటే రోబోలు నడవలేవు, నీవు ఆహారం పండించకుంటే సైనికులు తుపాకులు పేల్చలేరు’’ అని సాగుతుందా గీతం. జాతికి నిజమైన కథానాయకుడైన ఈ రైతును, జాతి నిజమైన దిగ్గజమైన ఈ రైతును కంగనా పదేపదే ఉగ్రవాది అని పిలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న తర్వాత వారి ఉద్యమంపట్ల ఈ అంతర్జాతీయ స్పందన ఎలా వచ్చింది? ఈశాన్య భారతదేశానికి చెందిన తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, పర్యావరణ వాది కంగుజమ్‌ ప్రపంచానికి సందేశమిస్తూ గడ్డకట్టించే చలిలో కరోనా మహమ్మారి కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆరుబయట నిరసన తెలుపుతున్న రైతుల పట్ల స్పందించాల్సిందిగా కోరారు.

‘‘ప్రియ స్నేహితులారా, లక్షలాది మన పేద రైతులు చలికి గజ గజ వణుకుతూ వీధుల్లో నిద్రిస్తున్నారు. మీ నుంచి వారు ఏమీ ఆశిం చడం లేదు. వారు సాగిస్తున్న పోరాటానికి అనుకూలంగా కేవలం ఒక ప్రేమపూర్వకమైన ట్వీట్‌ చేయండి, సంఘీభావం ప్రకటించండి.. అదే వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన భారతీయ సెలబ్రిటీల పని ముగిసిపోతుంది’’ అంటూ కంగుజమ్‌ ట్వీట్‌ చేసింది.

మన సొంత పర్యావరణవాది, యువ ఆదివాసీ బాలిక చేసిన అభ్యర్థన రిహానాతో సహా పలువురు అంతర్జాతీయ సెలబ్రీటీలను కదిలించింది. ఢిల్లీ సరిహద్దులో అతి శీతల వాతావరణంలో బతుకుతున్న భారతీయ రైతు చిత్రాన్ని పోస్ట్‌ చేసిన రిహానా ‘మనం ఈ రైతుల నిరసన గురించి మాట్లాడలేమా’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఆరుపదాల ట్వీట్‌ సుడిగాలిని సృష్టించింది. భారత్‌లో నడుస్తున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం అంటూ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ వాది గ్రేటా థన్‌ బెర్గ్‌ మద్దతు పలుకుతూ ట్వీట్‌ చేసింది. ఇక నటి, ఇన్‌స్ట్రాగామ్‌లో చురుకుగా ఉండే అమందా సెర్నీ కూడా తన మద్దతును తెలిపింది. ప్రపంచం గమనిస్తోంది. సమస్యను అర్థం చేసుకోవడానికి మీరు ఇండియన్, పంజాబీ లేక దక్షిణాసియా వాసి కావాల్సిన పనిలేదు.

వాక్‌ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, కనీస మానవ, పౌర హక్కుల సమానత్వం, కార్మికులను గౌరవించడం ఇవే మనం డిమాండ్‌ చేయవలసినవి అంటూ అమందా ఫార్మర్స్‌ ప్రొటెస్ట్, ఇంట ర్నెట్‌ షట్‌డౌన్‌ హ్యాష్‌ ట్యాగ్‌లు జతకలిపి మరీ సందేశం పంపింది. ఈ అంతర్జాతీయ ట్వీట్లకు స్పందిస్తూ కంగనా వారు రైతులు కాదు, భారత్‌ను విడదీయాలను చూస్తున్న ఉగ్రవాదులు అంటూ ట్వీట్‌ చేసింది. రిహానాను నోర్మూసుకో అంటూ దూషించడమే కాకుండా, గ్రేటా థెన్‌బర్గ్‌ను కూడా అనరాని మాటలతో నిందించింది. రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్‌ ఉగ్రవాద ఉద్యమంగా ముద్రించాలని చూస్తున్న కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా ఆమె తెగ రెచ్చిపోయింది. తన ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ మొదటి సారిగా అతిపెద్ద రాజకీయ తప్పిదానికి పాల్పడ్డారు. తాను అధికారంలోకి రావడానికి రెండుసార్లు ఓట్లేసిన రైతులపై మోదీ దాడి చేశారు.

మరోవైపున రైతులను ఉగ్రవాదులుగా వర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ రైతు కుటుంబాలనుంచి వాస్తవ మేధావులు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చి తమ తమ ప్రాంతీయ భాషల్లో, తమ సొంతపాటలు, కథలు, నవలలు రాస్తూండటం గమనార్హం. ఈ విధంగా రైతుల ఆందోళన ఒక కొత్తతరం రాతను, పాటను, నృత్యాన్ని గ్రామాల్లో ప్రభావితం చేసింది. సోషల్‌ మీడియాకు రెండు కోణాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట దశలో అది ఆరెస్సెస్‌/బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. కానీ ఇప్పుడు దాని భాష మారుతోంది. ఎందుకంటే ఉగ్రవాదిగానో, జాతి వ్యతిరేకి గానూ ముద్ర వేసి తొక్కేసేటంత తక్కువ జాతీయవాదిగా మన రైతు నేడు లేడు.


ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement