కమ్యూనిస్టుల అడ్డాగా కేరళ.. ఎలా? | Kancha Ilaiah Article On Communist Party Forms Govt In Kerala | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టుల అడ్డాగా కేరళ.. ఎలా?

Published Sat, Apr 10 2021 2:32 AM | Last Updated on Sat, Apr 10 2021 2:51 AM

Kancha Ilaiah Article On Communist Party Forms Govt In Kerala - Sakshi

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందస్తు పోల్‌ సర్వేలు ఒక విషయాన్ని తేల్చేశాయి. కేరళలో పినరయి విజయన్‌ రెండోసారి సీపీఎం తరపున ముఖ్యమంత్రిగా కానున్నారని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ పశ్చిమ బెంగాల్లో అదే సీపీఎం కనీస వార్తల్లో కూడా నిలవలేకపోయింది. కారణం కింది కులాల నేతలను నాయకత్వ స్థానాల్లోకి రాకుండా బెంగాలీ భద్రలోక్‌ కమ్యూనిస్టు నేతలు దశాబ్దాలుగా అడ్డుకున్నారు. కేరళలో అగ్ర కులాల నేతృత్వాన్ని పక్కకు తోసి పినరయి విజయన్‌ లాంటి దిగువ కులాలకు చెందిన వారు నాయకత్వ స్థానాల్లోకి రావడంతో ఇక్కడ సీపీఎం పీఠం చెక్కు చెదరలేదు. ఇందువల్లే బీజేపీ ఆటలు బెంగాల్‌లో చెల్లుతున్నట్లుగా, కేరళలో చెల్లడం లేదు.

కేరళలో ఒకే దశ ఎన్నికలు పరిసమాప్తమై, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాసం రాస్తున్నాను. అనేక ముందస్తు పోల్‌ సర్వేలు చెబుతున్నట్లుగా కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేరళ ఎన్నికల చరిత్రలో రెండోసారి తిరిగి అధికారంలోకి రానున్నారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎన్నికల అంకగణితంలో సీపీఎం కనీసం వార్తల్లో కూడా లేకుండా పోయింది. బెంగాల్లో ఆ పార్టీ పని దాదాపుగా ముగిసిపోయినట్లుగానే కనిపిస్తోంది. కేరళలో సీపీఎం నాయకత్వం మొదటగా బ్రాహ్మణుడి (ఈఎమ్‌ఎస్‌ నంబూద్రిపాద్‌) పరమై 1957లో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్రంలోని శూద్రకులాల్లో అగ్రగామిగా ఉంటున్న నాయర్ల పరమైంది. ఇప్పుడు ఈళవ కులానికి చెందిన పినరయి విజయన్‌కి రెండోసారి కూడా సీఎం పదవి దక్కనుంది. ఈయన ఒకప్పుడు అంటరానిదిగా భావించిన కల్లుగీత కార్మికుల కమ్యూనిటీకి చెందినవారు. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త నారాయణ గురు ఈ కులానికి చెందినవారే. బెంగాల్‌ దళితుల్లా కాకుండా, కేరళ దళితులు ఇటీవలి కాలంలో సంస్కర్త అయ్యంకళి ప్రభావంతో బాగా సంఘటితం అయ్యారు. ఇప్పటికీ వీరు కమ్యూనిస్టు మద్దతుదారులుగానే ఉంటున్నారు.

అదే పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుంచి మూడు భద్రలోక్‌ కులాలైన బ్రాహ్మణులు, కాయస్థులు, బైద్యాస్‌ నియంత్రణలో నడిచేది. మిగిలిన శూద్రులు, నామ శూద్ర (దళిత్‌) కులాలను భద్రలోక్‌ మేధావులు చోటోలోక్‌ (నిమ్న కుల ప్రజలు)గా ముద్రవేసి చూసేవారు. పార్టీ శ్రేణులలో వీరు ఎన్నటికీ నాయకులు కావడానికి అనుమతించేవారు కాదు. కమ్యూనిస్టు భద్రలోక్‌ నేతలు వ్యవసాయ, చేతి వృత్తుల ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ మూలాల్లో ఏ పాత్రా పోషించనప్పటికీ, కింది కులాల వారిని శ్రామికుల స్థాయిలోనే ఉంచడానికి మార్క్సిస్ట్‌ పదజాలాన్ని ఉపయోగిస్తూ పోయేవారు. చివరకు శూద్రులను, దళితులను రిజర్వేషన్‌ ఉపయోగించుకుని మధ్య తరగతి దిగువ స్థాయి మేధావులుగా రూపాంతరం చెందడానికి కూడా భద్రలోక్‌ నేతలు అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఇదే శూద్ర, నిమ్నకులాల ప్రజలను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు సంఘటితం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సద్‌గోప్‌ (ఇతర రాష్ట్రాల్లో యాదవులకు సమానమైన) కులానికి చెందినవారు.

ఈ కమ్యూనిస్టు భద్రలోక్‌ నేతలు పశ్చిమబెంగాల్‌లో 27 శాతం జనాభాగా ఉన్న ముస్లింలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులుగా ఎదగడానికి అనుమతించలేదు. కమ్యూనిస్టు పార్టీ భద్రలోక్‌ ఆలోచనా తత్వంనుంచి బయటపడి ఉంటే, ఒక ముస్లిం నేత ఇప్పటికే కమ్యూనిస్టుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. అలా కాకూడదనే ఉద్దేశంతోటే భద్రలోక్‌ నేతలు తమ కమ్యూనిస్టు లౌకికవాద ముసుగులో శూద్రులను, దళితులను, ముస్లింలను అణిచిపారేశారు. మరోవైపున కేరళ ప్రయోగం దీనికి విరుద్ధంగా నడిచింది. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలోని ఈళవ కుల నేతలు తమ నాయకత్వ స్థానాలను బలోపేతం చేసుకున్నారు. పార్టీలోని బ్రాహ్మణులు, నాయర్లు.. శూద్రులను దళిత కార్యకర్తలను అగ్రశ్రేణి నేతలుగా కాకుండా నిరోధించారు కానీ నారాయణ గురు, అయ్యంకళి సంస్కరణ ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన వీరు నాయకత్వ స్థానాల్లోకి ఎగబాకి వచ్చారు. కేఆర్‌ గౌరి అమ్మ, వీఎస్‌ అచ్యుతానందన్, పినరయి విజయన్‌ క్రమంగా కమ్యూనిస్టు పార్టీలోని బ్రాహ్మణ, నాయర్ల ఆధిపత్యాన్ని తొలగించి నాయకత్వ స్థానాలను చేజిక్కించుకున్నారు.

కేరళలో సీపీఎం పొలిట్‌ బ్యూరో ప్రధానంగా బెంగాల్‌ భద్రలోక్, కేరళ నాయర్ల ఆధిపత్యంలో నిండి ఉండేది. దేశంలో కానీ, అంతకు మించి పార్టీ శ్రేణుల్లో కానీ కుల చైతన్య ధోరణులు ఆవిర్భవించడాన్ని సైతం వీరు అడ్డుకునేవారు. అయితే కేరళ ఓబీసీలు, దళిత్‌ నేతలు కుల అంధత్వంలో ఉండిపోయిన కేంద్ర భద్రలోక్‌ నాయకత్వాన్ని అడ్డుకుని హుందాగానే కేంద్ర స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు పినరయి విజయన్‌ పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైన రీతిలో కెప్టెన్‌గా అవతరించారు. కింది కులాల ప్రజలు, దళితులు అలాంటి మార్గంలో పయనించడానికి బెంగాల్‌లో, త్రిపురలో కూడా అక్కడి పార్టీ నాయకత్వం అనుమతించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తయారైందంటే శూద్ర, ఓబీసీ, ఆదివాసీ ప్రజలు అక్కడి భద్రలోక్‌ కమ్యూనిస్టు నేతలను నమ్మలేని దశకు చేరుకున్నారు.

కులం అనేది దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టు భద్రలోక్‌ జీవులకు సంపూర్ణంగా ఒక విచిత్రమైన, పరాయి సంస్థగానే ఉండిపోయింది. అసలు కులం అనేది ఉనికిలోనే లేదు అని వారు నటించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వర్గ అస్తిత్వ రాజకీయాల కంటే కుల అస్తిత్వమే పరివర్తనా పాత్రను పోషిస్తోంది. ఇవి రెండూ కూడా ఎన్నికల్లో జన సమీకరణ సాధనాలుగా ఉంటున్నాయి. అలాగే సామాజిక, ఆర్థిక స్తబ్ధతను అధిగమించే సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఇది కమ్యూనిస్టు భద్రలోక్‌ మేధావులకు ఏమాత్రమూ తెలీని విషయం కాదు. కానీ, వారి నాయకత్వ స్థాయిని, స్థితిని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ వాస్తవాన్ని దాచిపెట్టాలని వీరు కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇలా వాస్తవాన్ని మరుగునపర్చి ఆటలాడిన కారణంగానే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అంతరించిపోయింది. అదే కేరళలో ఈళవ కుల నేతల ఊర్ధ్వ ప్రస్థానం పార్టీని సైతం కాపాడుకోగలిగింది.

తమిళనాడులో ద్రవిడ ఉద్యమం కానీ, ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ కానీ, వైఎస్సార్‌సీపీ కానీ దళితులను, రిజర్వుడ్‌ శూద్ర కులాలను తెలివిగా ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్టీలన్నీ కమ్మ, వెలమ, రెడ్డి వంటి అన్‌ రిజర్వుడ్‌ శూద్ర కులాల నేతల నేతృత్వంలో ఉంటున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆరెస్సెస్, బీజేపీని సైతం నిలువరిం చాయి. అయితే బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ స్వయంగా భద్రలోక్‌ పార్టీ కావడంతో ఆరెస్సెస్, బీజేపీలు అక్కడ దళితులను, శూద్రులను గణనీయంగా సమీకరించగలుగుతున్నాయి. కానీ కేరళలో ఇదే ఆరెస్సెస్, బీజేపీలు నాయర్లు లేక దళితుల్లో కొందరిని తప్ప, రిజర్వుడ్‌ శూద్రుల (ఓబీసీలు) నుంచి నేతలను కొనలేకపోతున్నాయి.

కేరళలో నాయర్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, వెలమ వంటి శూద్ర కులాలు దక్షిణభారత దేశంలో దిగువ శూద్రులకు, దళితులకు అధికారం పంచిపెట్టకపోయి ఉంటే బీజేపీ ఈ దిగువ శూద్ర, దళిత కులాలను చక్కగా ఉపయోగించుకునేది. దీంతో బీజేపీకి ఇక వేరు మార్గం లేక రాష్ట్ర విభాగాలకు గాను అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాపులను సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్‌ ఈళవ కులం నుంచి రాకపోయి ఉంటే (ఆ రాష్ట్రంలో ఈ కులస్తులు మొత్తం జనాభాలో 24 శాతంగా ఉన్నారు), ప్రధాని నరేంద్రమోదీ ఈళవ కులనేతల్లో ఎవరో ఒకరికి సీఎం పదవిని ప్రతిపాదించి అధికారం కైవసం చేసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది కేరళలో సాధ్యం కాదు.

పశ్చిమబెంగాల్లో కూడా మహిస్యాలు, సద్‌గోపులు, దళితులు వంటి చోటోలోక్‌ నేతలను సమీకరించడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు జూదక్రీడను ఆడుతూ వస్తున్నాయి (మహిస్యాలు అంటే బెంగాల్‌లో రెడ్డి లేక కమ్మ కుల స్థాయికి సంబంధించిన వారని చెప్పుకోవచ్చు. కానీ వీరిని పాలక కులాలుగా అవతరించడానికి ఇంతవరకు బెంగాల్‌ పార్టీలు అనుమతించలేదు). కమ్యూనిస్టు భద్రలోక్‌ నేతలు ఇప్పుడు రహస్య స్థావరాలను వెతుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కానీ కేరళలో మాత్రం కమ్యూనిస్టు బ్రాహ్మణిజాన్ని తుంచివేసి ముస్లింలను, ఓబీసీలను, దళితులను సమీకరిం చడం ద్వారా పినరయి విజయన్‌ అటు కేరళను, ఇటు దేశాన్ని కూడా కాపాడబోతున్నారు.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌ 
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement