Kerala Assembly election
-
నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ/కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎవరిదో? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
కమ్యూనిస్టుల అడ్డాగా కేరళ.. ఎలా?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందస్తు పోల్ సర్వేలు ఒక విషయాన్ని తేల్చేశాయి. కేరళలో పినరయి విజయన్ రెండోసారి సీపీఎం తరపున ముఖ్యమంత్రిగా కానున్నారని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ పశ్చిమ బెంగాల్లో అదే సీపీఎం కనీస వార్తల్లో కూడా నిలవలేకపోయింది. కారణం కింది కులాల నేతలను నాయకత్వ స్థానాల్లోకి రాకుండా బెంగాలీ భద్రలోక్ కమ్యూనిస్టు నేతలు దశాబ్దాలుగా అడ్డుకున్నారు. కేరళలో అగ్ర కులాల నేతృత్వాన్ని పక్కకు తోసి పినరయి విజయన్ లాంటి దిగువ కులాలకు చెందిన వారు నాయకత్వ స్థానాల్లోకి రావడంతో ఇక్కడ సీపీఎం పీఠం చెక్కు చెదరలేదు. ఇందువల్లే బీజేపీ ఆటలు బెంగాల్లో చెల్లుతున్నట్లుగా, కేరళలో చెల్లడం లేదు. కేరళలో ఒకే దశ ఎన్నికలు పరిసమాప్తమై, పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాసం రాస్తున్నాను. అనేక ముందస్తు పోల్ సర్వేలు చెబుతున్నట్లుగా కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ ఎన్నికల చరిత్రలో రెండోసారి తిరిగి అధికారంలోకి రానున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికల అంకగణితంలో సీపీఎం కనీసం వార్తల్లో కూడా లేకుండా పోయింది. బెంగాల్లో ఆ పార్టీ పని దాదాపుగా ముగిసిపోయినట్లుగానే కనిపిస్తోంది. కేరళలో సీపీఎం నాయకత్వం మొదటగా బ్రాహ్మణుడి (ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్) పరమై 1957లో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్రంలోని శూద్రకులాల్లో అగ్రగామిగా ఉంటున్న నాయర్ల పరమైంది. ఇప్పుడు ఈళవ కులానికి చెందిన పినరయి విజయన్‌కి రెండోసారి కూడా సీఎం పదవి దక్కనుంది. ఈయన ఒకప్పుడు అంటరానిదిగా భావించిన కల్లుగీత కార్మికుల కమ్యూనిటీకి చెందినవారు. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త నారాయణ గురు ఈ కులానికి చెందినవారే. బెంగాల్ దళితుల్లా కాకుండా, కేరళ దళితులు ఇటీవలి కాలంలో సంస్కర్త అయ్యంకళి ప్రభావంతో బాగా సంఘటితం అయ్యారు. ఇప్పటికీ వీరు కమ్యూనిస్టు మద్దతుదారులుగానే ఉంటున్నారు. అదే పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుంచి మూడు భద్రలోక్ కులాలైన బ్రాహ్మణులు, కాయస్థులు, బైద్యాస్ నియంత్రణలో నడిచేది. మిగిలిన శూద్రులు, నామ శూద్ర (దళిత్) కులాలను భద్రలోక్ మేధావులు చోటోలోక్ (నిమ్న కుల ప్రజలు)గా ముద్రవేసి చూసేవారు. పార్టీ శ్రేణులలో వీరు ఎన్నటికీ నాయకులు కావడానికి అనుమతించేవారు కాదు. కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు వ్యవసాయ, చేతి వృత్తుల ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ మూలాల్లో ఏ పాత్రా పోషించనప్పటికీ, కింది కులాల వారిని శ్రామికుల స్థాయిలోనే ఉంచడానికి మార్క్సిస్ట్ పదజాలాన్ని ఉపయోగిస్తూ పోయేవారు. చివరకు శూద్రులను, దళితులను రిజర్వేషన్ ఉపయోగించుకుని మధ్య తరగతి దిగువ స్థాయి మేధావులుగా రూపాంతరం చెందడానికి కూడా భద్రలోక్ నేతలు అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఇదే శూద్ర, నిమ్నకులాల ప్రజలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు సంఘటితం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సద్గోప్ (ఇతర రాష్ట్రాల్లో యాదవులకు సమానమైన) కులానికి చెందినవారు. ఈ కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు పశ్చిమబెంగాల్లో 27 శాతం జనాభాగా ఉన్న ముస్లింలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులుగా ఎదగడానికి అనుమతించలేదు. కమ్యూనిస్టు పార్టీ భద్రలోక్ ఆలోచనా తత్వంనుంచి బయటపడి ఉంటే, ఒక ముస్లిం నేత ఇప్పటికే కమ్యూనిస్టుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. అలా కాకూడదనే ఉద్దేశంతోటే భద్రలోక్ నేతలు తమ కమ్యూనిస్టు లౌకికవాద ముసుగులో శూద్రులను, దళితులను, ముస్లింలను అణిచిపారేశారు. మరోవైపున కేరళ ప్రయోగం దీనికి విరుద్ధంగా నడిచింది. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలోని ఈళవ కుల నేతలు తమ నాయకత్వ స్థానాలను బలోపేతం చేసుకున్నారు. పార్టీలోని బ్రాహ్మణులు, నాయర్లు.. శూద్రులను దళిత కార్యకర్తలను అగ్రశ్రేణి నేతలుగా కాకుండా నిరోధించారు కానీ నారాయణ గురు, అయ్యంకళి సంస్కరణ ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన వీరు నాయకత్వ స్థానాల్లోకి ఎగబాకి వచ్చారు. కేఆర్ గౌరి అమ్మ, వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్ క్రమంగా కమ్యూనిస్టు పార్టీలోని బ్రాహ్మణ, నాయర్ల ఆధిపత్యాన్ని తొలగించి నాయకత్వ స్థానాలను చేజిక్కించుకున్నారు. కేరళలో సీపీఎం పొలిట్ బ్యూరో ప్రధానంగా బెంగాల్ భద్రలోక్, కేరళ నాయర్ల ఆధిపత్యంలో నిండి ఉండేది. దేశంలో కానీ, అంతకు మించి పార్టీ శ్రేణుల్లో కానీ కుల చైతన్య ధోరణులు ఆవిర్భవించడాన్ని సైతం వీరు అడ్డుకునేవారు. అయితే కేరళ ఓబీసీలు, దళిత్ నేతలు కుల అంధత్వంలో ఉండిపోయిన కేంద్ర భద్రలోక్ నాయకత్వాన్ని అడ్డుకుని హుందాగానే కేంద్ర స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు పినరయి విజయన్ పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైన రీతిలో కెప్టెన్‌గా అవతరించారు. కింది కులాల ప్రజలు, దళితులు అలాంటి మార్గంలో పయనించడానికి బెంగాల్లో, త్రిపురలో కూడా అక్కడి పార్టీ నాయకత్వం అనుమతించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తయారైందంటే శూద్ర, ఓబీసీ, ఆదివాసీ ప్రజలు అక్కడి భద్రలోక్ కమ్యూనిస్టు నేతలను నమ్మలేని దశకు చేరుకున్నారు. కులం అనేది దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టు భద్రలోక్ జీవులకు సంపూర్ణంగా ఒక విచిత్రమైన, పరాయి సంస్థగానే ఉండిపోయింది. అసలు కులం అనేది ఉనికిలోనే లేదు అని వారు నటించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వర్గ అస్తిత్వ రాజకీయాల కంటే కుల అస్తిత్వమే పరివర్తనా పాత్రను పోషిస్తోంది. ఇవి రెండూ కూడా ఎన్నికల్లో జన సమీకరణ సాధనాలుగా ఉంటున్నాయి. అలాగే సామాజిక, ఆర్థిక స్తబ్ధతను అధిగమించే సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఇది కమ్యూనిస్టు భద్రలోక్ మేధావులకు ఏమాత్రమూ తెలీని విషయం కాదు. కానీ, వారి నాయకత్వ స్థాయిని, స్థితిని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ వాస్తవాన్ని దాచిపెట్టాలని వీరు కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇలా వాస్తవాన్ని మరుగునపర్చి ఆటలాడిన కారణంగానే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అంతరించిపోయింది. అదే కేరళలో ఈళవ కుల నేతల ఊర్ధ్వ ప్రస్థానం పార్టీని సైతం కాపాడుకోగలిగింది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం కానీ, ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం, టీఆర్ఎస్ కానీ, వైఎస్సార్సీపీ కానీ దళితులను, రిజర్వుడ్ శూద్ర కులాలను తెలివిగా ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్టీలన్నీ కమ్మ, వెలమ, రెడ్డి వంటి అన్ రిజర్వుడ్ శూద్ర కులాల నేతల నేతృత్వంలో ఉంటున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆరెస్సెస్, బీజేపీని సైతం నిలువరిం చాయి. అయితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్వయంగా భద్రలోక్ పార్టీ కావడంతో ఆరెస్సెస్, బీజేపీలు అక్కడ దళితులను, శూద్రులను గణనీయంగా సమీకరించగలుగుతున్నాయి. కానీ కేరళలో ఇదే ఆరెస్సెస్, బీజేపీలు నాయర్లు లేక దళితుల్లో కొందరిని తప్ప, రిజర్వుడ్ శూద్రుల (ఓబీసీలు) నుంచి నేతలను కొనలేకపోతున్నాయి. కేరళలో నాయర్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, వెలమ వంటి శూద్ర కులాలు దక్షిణభారత దేశంలో దిగువ శూద్రులకు, దళితులకు అధికారం పంచిపెట్టకపోయి ఉంటే బీజేపీ ఈ దిగువ శూద్ర, దళిత కులాలను చక్కగా ఉపయోగించుకునేది. దీంతో బీజేపీకి ఇక వేరు మార్గం లేక రాష్ట్ర విభాగాలకు గాను అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాపులను సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ ఈళవ కులం నుంచి రాకపోయి ఉంటే (ఆ రాష్ట్రంలో ఈ కులస్తులు మొత్తం జనాభాలో 24 శాతంగా ఉన్నారు), ప్రధాని నరేంద్రమోదీ ఈళవ కులనేతల్లో ఎవరో ఒకరికి సీఎం పదవిని ప్రతిపాదించి అధికారం కైవసం చేసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది కేరళలో సాధ్యం కాదు. పశ్చిమబెంగాల్లో కూడా మహిస్యాలు, సద్గోపులు, దళితులు వంటి చోటోలోక్ నేతలను సమీకరించడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు జూదక్రీడను ఆడుతూ వస్తున్నాయి (మహిస్యాలు అంటే బెంగాల్లో రెడ్డి లేక కమ్మ కుల స్థాయికి సంబంధించిన వారని చెప్పుకోవచ్చు. కానీ వీరిని పాలక కులాలుగా అవతరించడానికి ఇంతవరకు బెంగాల్ పార్టీలు అనుమతించలేదు). కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు ఇప్పుడు రహస్య స్థావరాలను వెతుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కానీ కేరళలో మాత్రం కమ్యూనిస్టు బ్రాహ్మణిజాన్ని తుంచివేసి ముస్లింలను, ఓబీసీలను, దళితులను సమీకరిం చడం ద్వారా పినరయి విజయన్ అటు కేరళను, ఇటు దేశాన్ని కూడా కాపాడబోతున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
5 రాష్ట్రాల ఎన్నికలు: నేడే కీలక పోలింగ్
సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1980వ దశకం నుంచి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి ఎల్డీఎఫ్ మళ్లీ గెలిస్తే అది కొత్త చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో సర్వం సిద్ధం తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే– బీజేపీ, మక్కల్ నీదిమయ్యం–ఐజేకే, ఎస్ఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం–డీఎండీకే, ఎస్డీపీఐ పార్టీలు కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఇక నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తోంది. 3,998 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో భద్రత కల్పించారు. ఐదు చోట్ల ఎన్నికల రద్దుకు పట్టు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు, ఆయన తనయుడు బరిలోకి దిగిన చేపాక్కం–ట్రిప్లికేన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీ చేస్తున్న కాట్పాడి, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఏవీ వేలు(తిరువణ్ణామలై), కేఎన్ నెహ్రు (తిరుచ్చి పశ్చిమం) నియోజకవర్గాల్లో నగదు పంపిణీ జరిగిందని అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే నేత, మంత్రి జయకుమార్ నేతృత్వంలోని బృందం ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహును కలిసి ఫిర్యాదు చేసింది. చిన్నమ్మ ఓటు గల్లంతు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు ఓటు హక్కు లేకుండా పోయింది. 2017లో ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇలవరసిలతో సహా 12 మంది పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలోనే ఉండేవారు. ప్రసుత్తం అందరి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చేయడంతోనే ఆ చిరునామాలో ఉన్న పేర్లన్నింటినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. శశికళకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది రాజచెందూర్ పాండియన్ ఈసీకి విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచార పర్వానికి తెర
చెన్నై/తిరువనంతపురం/గువాహటి/కోల్‌కతా: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ నెల 6న(మంగళవారం) జరిగే ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్, సినీ నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేరళలో చివరి రోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఆదివారం భారీ సభలు జరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ ఉత్తర కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్ కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజు కనిపించని హడావుడి పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమొక్రటిక్ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతోంది. అస్సాంలో మూడో దశ ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, నెగ్గాలని కాంగ్రెస్ కూటమి ఆరాట పడుతోంది. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. -
కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్నికల్లో భాగంగా బీజేపీ 112 మంది అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. కేరళ లో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరణ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ మంజేశ్వర్, కోన్నీ ఇరు నియోజకవర్గాలనుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇ. శ్రీధరణ్ పాలక్కాడ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయనున్నారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా, అందులో 115 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. దీనిలో భాగంగా 112 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ జాబితాను బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.కేరళలో కేవలం అధికార పార్టీ ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న, ఈ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదకడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. గత వారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి సి చాకో పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్ థామస్ బిజెపిలో చేరారు. మాజీ రాష్ట్ర బిజెపి చీఫ్ కుమ్మనం రాజశేఖరఖ్ నెమోమ్ నుంచి, మాజీ కేంద్రమంత్రి కేజె ఆల్ఫోన్స్ కంజీరప్పల్లి నుంచి, సురేష్ గోపి త్రిస్సూర్ నుంచి, డాక్టర్ అబ్దుల్ సలామ్ తిరూర్ నుంచి, మాజీ డిజీపీ జాకబ్ థామస్ ఇరింజలకుడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఏప్రిల్ 6న మొత్తం 14 జిల్లాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగనుండగా మే2వ తేదీన ఫలితాలు రానున్నాయి. (చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?) -
మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?
దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాంక్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. మరి తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? శ్రీధరన్‌కి వయోపరిమితి అడ్డు రాదు. బీజేపీ వయోపరిమితి ఆంక్షలను చాలా సందర్భాల్లో సడలించేసింది. వామపక్షాలు మాత్రమే ఇప్పటికీ ఈ వయోపరిమితి నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం మన దేశంలోని రాజకీయ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని తమకు తాముగా ఉల్లంఘిస్తుంటాయి. దేశంలో అనేక సంక్లిష్టమైన బ్రిడ్జిలను, ప్రత్యేకించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన మాజీ రైల్వే అధికారి, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కానీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వయస్సు ఆయనకు అడ్డంకేమీ కాలేదు. ఆయన వేసిన అడుగు సాహసోపేతమైనది కాబట్టే కొనియాడదగినది. కేరళలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటం, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ చాలా దూరంలో ఉంటున్న నేపథ్యంలో శ్రీధరన్ నిర్ణయం అసాధారణమైందనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అశ్వమేధ యజ్ఞం ప్రకారం బీజేపీకి కేరళలో అధికారం చేజిక్కించుకోవడం చాలా కీలకమైన విషయం. దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాం క్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. కాబట్టి ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవులు చేపట్టడంపై తనకు ఆసక్తి లేదని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి వెనుకాడబోనని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంతవరకు అంతా బాగుంది. ఎందుకంటే తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? కానీ ఇక్కడ ఒక అవరోధం ఉంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు, ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్నికల్లో గెలుపు సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు 75 ఏళ్లు దాటిన బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో చేరే అర్హత ఉండబోదని అప్పట్లో వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేవారికి అప్పట్లో వయోపరిమితిని పెట్టలేదు. కాబట్టే తమకు నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిపదవులు లభించబోవనే స్పష్టమైన అవగాహనతోటే లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను నాటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత అడ్వాణీ, జోషీలు తమ నియోజకవర్గాలలో గెలిచి అయిదేళ్లపాటు పార్లమెంటులో నిస్సారమైన జీవితం గడిపారు. తర్వాత 2019లో రిటైర్ అయ్యారు. వారిని తర్వాక బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యులను చేసిపడేశారు. అయితే ఈ మండల్ ఇంతవరకు ఒక్కసారికూడా భేటీకాలేదనుకోండి. రాజకీయాల్లో వీరి అద్భుతమైన ప్రయాణం చివరకు వారి సుప్రసిద్ధ శిష్యుడి (నరేంద్రమోదీ) చేతిలోనే ముగిసిపోయింది. అంటే అక్బర్/బైరాం ఖాన్ కథ మరోసారి ఇక్కడ పునరావృతమైంది. అయితే బైరాం ఖాన్ లాగా అడ్వాణీ, జోషీలు ఢిల్లీనుంచి బహిష్కరణకు గురి కాలేదు. పూర్తి సదుపాయాలతో, సంపూర్ణ భద్రతతో వీరు ప్రభుత్వ వసతి గృహంలో ఢిల్లీలో నివసించడానికి వీరిని అనుమతించారు. ఆ తర్వాత వారి గురించి నేను వినలేదు. ఇటీవలకాలంలో వారిని నేను కలిసిందీ లేదు. కానీ వారు ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నట్లు ఆశిస్తాను. ఇప్పుడు శ్రీధరన్ వద్దకు వద్దాం. ఏదేమైనప్పటికీ ఆయన ఒక అసాధారణమైన వృత్తినిపుణులు. ఆయన రాజకీయ జీవితంలోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టారు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి గురించి అయనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈ నియమానికి కూడా ఇప్పటికే కొన్ని మినహాయిం పులు ఏర్పడ్డాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంపిక చేసినప్పుడు ఆ నిబంధనను బీజేపీ పాటించలేదు. ఆయన 75 ఏళ్లకు మించిన వయస్సులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆయన నియామకం మాత్రం తప్పనిసరైంది. ఎందుకంటే కర్ణాటకలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు బేజీపీలో ఎవరూ లేరు. కొంతమంది అయితే ఈ నియమం కేంద్ర స్థాయిలోనే కానీ రాష్ట్రాల్లో వర్తించదని బలహీనమైన వాదనను తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే నరేంద్రమోదీ ఇంకా బీజేపీకి యజమాని కాకముందు, వామపక్షాలకు మల్లే రాజ్యసభకు ఎంపికయ్యే బీజేపీ సభ్యులను రెండుసార్లకు మాత్రమే పరిమితం చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. అరుణ్ షౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి బీజేపీ ప్రముఖులను మూడోసారి చట్టసభలోకి అడుగు పెట్టకుండా చేయడానికి ఉపయోగపడింది. కానీ పరిస్థితులు మారిపోయాక, పాలకుల వంతు వచ్చినప్పుడు, ఈ నియమం మళ్లీ మారింది. అప్పటికే చట్టసభల్లో ఉన్నవారికి మూడోసారి, నాలుగోసారి కూడా అవకాశం కల్పిం చారు. దివంగత సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా లేటు వయసులో ఈ జాబితాలో భాగమయ్యారన్నది వాస్తవం. కాబట్టి నియమాలు, వాటి పాటింపు గురించి చాలానే మాట్లాడుకున్నాం. కాబట్టి శ్రీధరన్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది. వయోపరిమితి ఆయనకు అడ్డు రాదు. దీంతో పోలిస్తే వామపక్షాలు ఇప్పటికీ ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాజ్యసభలో అసాధారణమైన పనితీరు ప్రదర్శించిన ప్రముఖ వామపక్ష నేతలు కూడా రెండు సార్లు చట్టసభకు ఎన్నికయ్యాక పల్లెత్తు మాటనకుండా రాజ్యసభ నుంచి తప్పుకుని తమతమ పార్టీల నిర్ణయాన్ని గౌరవించారు. సీతారాం ఏచూరి కూడా ఇప్పుడు అదే వరసలో ఉంటున్నారు. వామపక్షాలు ఈ నియమాన్ని తమకు తాముగా రూపొందించుకోవడమే కాకుండా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నందుకు వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అంతేకానీ మీ ముఖం నాకు చూపించండి, మీకు వయోపరిమితి నిబంధనను చూపిస్తాను అనే రకంగా ఉండే బీజేపీ నినాదాన్ని వామపక్షాల ఆచరణతో పోల్చి చూద్దాం మరి. అయితే బీజేపీ ఏదైనా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈ 75 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురాలేదు. ఒకే ఒక వ్యక్తి ఆదేశంలో ఇది ఇలా ముందుకొచ్చింది. ఆ సమయంలో నూతన పాలకుల అధికార బలాన్ని అడ్డుకోలేని పలువురు సీనియర్ నేతలకు రంగంనుంచి తప్పించుకోవడానికి ఈ వయోపరిమితి చాలా సులభమైన మార్గంగా ఉపయోగపడేది. ఈ నియమంతో వ్యవహరించడం చాలా సులభం. ఇప్పుడు ఈ నియమం లక్ష్యం నెరవేరిది. ఎందుకంటే మనుషుల కోసమే నియమాలు తయారవుతాయి కానీ నియమాల కోసం మనుషులు తయారు కారు కదా.. అమెరికాలో దేశాధ్యక్షుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు కాదు. అందుచేతనే చాలామంది అమెరికా అధ్యక్షులు చాలా తక్కువ వయస్సులోనే అధ్యక్ష పదవిని చేపట్టేవారు. వారితో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 78 సంవత్సరాల వయస్సులో గద్దెనెక్కడం ప్రత్యేక విషయమే అనుకోండి. భారత్‌లో, అలాంటి పదవీ కాల పరిమితులు లేదు. పదవి, ఆఫీసులో పనిచేసే కాలం విషయంలో మనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ మనకు కూడా అలాంటి పరిమితులు విధిస్తేనే బావుం టుందా? నేనయితే కచ్చితంగా చెప్పలేను. ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి విషయాలను ప్రజలకు వదిలేయకూడదా? అయితే ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం ఆ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని ఉల్లంఘిస్తుంటాయి. ఇకపోతే శ్రీధరన్ విషయానికి వస్తే, వయసుతో సహా ఆయన్ని వెనక్కు లాగే అవకాశాలు లేవు. కాబట్టి కేరళ ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇది జరగాలంటే వారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంటుంది మరి. వ్యాసకర్త బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (ఎన్డీటీవీ సౌజన్యంతో...) -
కేరళ ఎన్నికలు; ఓట్ల ‘ముసాయిదా’
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పక్షాలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు జూన్ ఒకటితో పూర్తికాబోతోంది గనుక ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. కేరళ ప్రజలిచ్చే తీర్పు విలక్షణంగా వుంటుంది. ఒకే ఒక్క పార్టీకి అధికారం కట్టబెట్టే సంప్రదాయం అక్కడలేదు. కూటములుగా వెళ్తేనే ఆదరణ లభిస్తుంది. అలాగే వరసగా రెండు దఫాలు అధికారం ఇచ్చే సంప్రదాయం కూడా 80వ దశకం తర్వాత పోయింది. ఆ లెక్క ప్రకారం ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అవకాశం రావాల్సి వుంది. కానీ గతంతో పోలిస్తే 2018నాటి శబరిమల వివాదం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎంతో కొంత పుంజుకుంది. అందుకే కావొచ్చు... తాము అధికారంలోకొచ్చాక శబరిమలలో 10–50 ఏళ్ల మధ్యనున్న ఆడవాళ్లు ఆలయ ప్రవేశం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అందుకు సంబంధించి ‘అయ్యప్ప భక్తుల(మత సంబంధ ఆచారాల, సంప్రదాయాల, వాడుకల పరిరక్షణ) ముసాయిదా బిల్లును కూడా రూపొందించింది. ఈ ముసాయిదా ప్రకారం ఆలయ ప్రధాన పూజారి ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు ఏమిటన్నది నిర్ణయి స్తారు. వీటిని ఉల్లంఘించినవారు రెండేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వున్న విధి నిషేధాలపై చాన్నాళ్లుగా వివాదం వుంది. ఆ విషయంలో దాఖలైన పిటిషన్లపై 2018లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువరిస్తూ మహిళలకు ఏ కారణం చూపి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించినా అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం మత విశ్వాసాలను న్యాయస్థానాలు ప్రశ్నించజాలవని, అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ప్రజలు ఆచరిస్తారని... అందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తెలిపారు. ప్రస్తుతం అది ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో వుంది. ఆ తీర్పు ఏవిధంగా వుంటుందో చూడాల్సివుంది. ఈలోగానే కాంగ్రెస్ ఈ ముసాయిదా బిల్లుతో హడావుడి చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తీర్పు భక్తుల మనో భావాలకు అనుగుణంగా వచ్చేలా మెరుగైన వాదనలు వినిపిస్తామని, అది త్వరగా వెలువడేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని చెప్పటం వరకూ ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో వున్న ఒక వ్యవహారంలో చట్టం తీసుకొస్తామని చెప్పటమే కాదు... ముసాయిదాతో సహా సిద్ధమైపోవటం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట. శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు బీజేపీ, కాంగ్రెస్లతోసహా అందరూ స్వాగతించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్, సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు మాత్రమే కాదు... ఆరెస్సెస్ సైతం అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలన్న తీర్పుతో ఏకీ భవించారు. అయితే ఆ తర్వాత బీజేపీ, ఆరెస్సెస్‌లు వెనక్కి తగ్గాయి. అయ్యప్ప భక్తుల మనో భావాలకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్టు ఆ రెండు సంస్థలూ ప్రకటిం చాయి. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా మొదట్లో ఆ తీర్పును సమర్థిస్తు న్నట్టు తెలిపారు. కానీ ఆ తర్వాత పీసీసీ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరి తీసుకుంది. ఆ తీర్పు నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా పాల్గొన్నాయి. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించింది. 20 స్థానాల్లో 19 దక్కించుకుంది. సీట్లు రాకపోయినా బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. కానీ నిరుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. యధా ప్రకారం బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరిగింది. నగర ప్రాంతాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు చెరో మూడు కార్పొరేషన్లు వచ్చాయి. ఈ పరిస్థితే యూడీఎఫ్‌ను కలవరపెడుతోంది. ఎందుకంటే 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక యూడీఎఫ్ కూటమిని ఓడించి ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ధోరణే కొనసాగింది. అలాగే యూడీఎఫ్ భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్ మణి వర్గం రెండుగా చీలి, బలమైన వర్గం ఎల్డీఎఫ్లో చేరింది. ఇది కూడా తనకు నష్టం కలిగిస్తుందన్న భయం కాంగ్రెస్‌కు వుంది. ఫలితంగానే ఈ ముసాయిదా బిల్లు బయటికొచ్చింది. హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు పాటు పడుతున్నట్టు కనిపించేందుకు బీజేపీ మొదటినుంచీ ప్రయత్నిస్తోంది. దాన్ని మరింత పెంచుకునేందుకు కావొచ్చు... కేరళలో యూపీ తరహా లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చి హిందూ, క్రైస్తవ మతాల ఆడపిల్లలను రక్షిస్తామంటోంది. కాంగ్రెస్ కూడా దానితో పోటీ పడాలని చూస్తున్నదని శబరిమల బిల్లు తీరు చెబుతోంది. ఎన్నికల్లో లేవనెత్తడానికి, అధికార పక్షాన్ని విమర్శించడానికి కేరళలో సమస్యలకేమీ కొదవలేదు. అక్కడ యూడీఎఫ్‌ను గతంలో ఇరకాటంలో పడేసిన సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయరే ఎల్డీఎఫ్ నేతల ఆసరాతో కొందరికి ప్రభుత్వోద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణలు గుప్పుమంటు న్నాయి. బంగారం స్మగ్లింగ్ కేసు సరేసరి. పాలనాపరంగా వుండే లోటుపాట్లనూ, ఇతరత్రా సమస్య లనూ లేవనెత్తి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తేనే కాంగ్రెస్‌కు, దాని నేతృత్వంలోని యూడీఎఫ్‌కూ భవిష్యత్తు వుంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మెలిగితే ప్రజలు దాన్ని గ్రహించలేనంత తెలివితక్కువవారు కాదు. -
ప్రతిపక్షంలో పడతులు సున్నా!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. 140 స్థానాలున్న కేరళ శాసనసభలో కేవలం 8 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరంతా ఎల్డీఎఫ్ కు చెందినవారే కావడం విశేషం. అధికారం కోల్పోయిన యూడీఎఫ్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా పోవడం గమనార్హం. ఊమెన్ చాంది ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళా ఎమ్మెల్యే పీకే జయలక్ష్మి ఓడిపోయారు. మే 16న జరిగిన తాజా ఎన్నికల్లో 109 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సీపీఎం నుంచి ఐషా పొట్టి, కేకే శైలజ, మెర్కికుట్టి అమ్మ, వీణా జార్జి, యు ప్రతిభ హరి గెలుపొందారు. సీపీఐ నుంచి ఈఎస్ బీజీ మోల్, గీతా గోపి, సీకే ఆశ విజయం సాధించారు. గత అసెంబ్లీలో అధికార పక్షం నుంచి ఒకరు, విపక్షం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో నామినేషన్ల సందడి
చెన్నై: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 29 చివరితేదీ కాగా, ఏప్రిల్ 30న పరిశీలిస్తారు. మే 2 వరకూ ఉపసంహరించుకోవచ్చు. మే 16న ఎన్నికలు నిర్వహించి, 19న ఓట్లను లెక్కిస్తారు. తమిళనాడులో 234 స్థానాల్లో 5.6 కోట్ల మంది ఓటేయనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, 9,48,717 మంది ఓటర్లున్నారు. కేరళలో 2.5 కోట్ల మం ఓటర్లుండగా 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో 122 నామినేషన్లు దాఖలయ్యాయి. బెంగాల్లో సీపీఎం కార్యకర్తల హత్య కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా లోద్నాలో ఎన్నికల తర్వాత జరిగిన హింసలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలు మరణించారు. ఎస్.కె.ఫజల్ హక్యూ, దుఖిరాం దాల్లు గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు హత్య చేశారు.