అస్సాం రాష్ట్రం కామరూప్ జిల్లాలోని చేగ్యాన్‌లో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది
సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1980వ దశకం నుంచి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి ఎల్డీఎఫ్ మళ్లీ గెలిస్తే అది కొత్త చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తమిళనాడులో సర్వం సిద్ధం
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే– బీజేపీ, మక్కల్ నీదిమయ్యం–ఐజేకే, ఎస్‌ఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం–డీఎండీకే, ఎస్‌డీపీఐ పార్టీలు కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఇక నామ్ తమిళర్ కట్చి ఒంటరిగా పోటీ చేస్తోంది. 3,998 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో భద్రత కల్పించారు.
ఐదు చోట్ల ఎన్నికల రద్దుకు పట్టు
డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు, ఆయన తనయుడు బరిలోకి దిగిన చేపాక్కం–ట్రిప్లికేన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పోటీ చేస్తున్న కాట్పాడి, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఏవీ వేలు(తిరువణ్ణామలై), కేఎన్ నెహ్రు (తిరుచ్చి పశ్చిమం) నియోజకవర్గాల్లో నగదు పంపిణీ జరిగిందని అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే నేత, మంత్రి జయకుమార్ నేతృత్వంలోని బృందం ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహును కలిసి ఫిర్యాదు చేసింది.
చిన్నమ్మ ఓటు గల్లంతు
దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళకు ఓటు హక్కు లేకుండా పోయింది. 2017లో ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇలవరసిలతో సహా 12 మంది పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలోనే ఉండేవారు. ప్రసుత్తం అందరి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చేయడంతోనే ఆ చిరునామాలో ఉన్న పేర్లన్నింటినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. శశికళకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది రాజచెందూర్ పాండియన్ ఈసీకి విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం.
Comments
Please login to add a commentAdd a comment