కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పక్షాలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు జూన్ ఒకటితో పూర్తికాబోతోంది గనుక ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. కేరళ ప్రజలిచ్చే తీర్పు విలక్షణంగా వుంటుంది. ఒకే ఒక్క పార్టీకి అధికారం కట్టబెట్టే సంప్రదాయం అక్కడలేదు. కూటములుగా వెళ్తేనే ఆదరణ లభిస్తుంది. అలాగే వరసగా రెండు దఫాలు అధికారం ఇచ్చే సంప్రదాయం కూడా 80వ దశకం తర్వాత పోయింది. ఆ లెక్క ప్రకారం ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అవకాశం రావాల్సి వుంది. కానీ గతంతో పోలిస్తే 2018నాటి శబరిమల వివాదం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎంతో కొంత పుంజుకుంది.
అందుకే కావొచ్చు... తాము అధికారంలోకొచ్చాక శబరిమలలో 10–50 ఏళ్ల మధ్యనున్న ఆడవాళ్లు ఆలయ ప్రవేశం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అందుకు సంబంధించి ‘అయ్యప్ప భక్తుల(మత సంబంధ ఆచారాల, సంప్రదాయాల, వాడుకల పరిరక్షణ) ముసాయిదా బిల్లును కూడా రూపొందించింది. ఈ ముసాయిదా ప్రకారం ఆలయ ప్రధాన పూజారి ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు ఏమిటన్నది నిర్ణయి స్తారు. వీటిని ఉల్లంఘించినవారు రెండేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వున్న విధి నిషేధాలపై చాన్నాళ్లుగా వివాదం వుంది. ఆ విషయంలో దాఖలైన పిటిషన్లపై 2018లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువరిస్తూ మహిళలకు ఏ కారణం చూపి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించినా అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.
ఒక న్యాయమూర్తి మాత్రం మత విశ్వాసాలను న్యాయస్థానాలు ప్రశ్నించజాలవని, అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ప్రజలు ఆచరిస్తారని... అందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తెలిపారు. ప్రస్తుతం అది ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో వుంది. ఆ తీర్పు ఏవిధంగా వుంటుందో చూడాల్సివుంది. ఈలోగానే కాంగ్రెస్ ఈ ముసాయిదా బిల్లుతో హడావుడి చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తీర్పు భక్తుల మనో భావాలకు అనుగుణంగా వచ్చేలా మెరుగైన వాదనలు వినిపిస్తామని, అది త్వరగా వెలువడేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని చెప్పటం వరకూ ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో వున్న ఒక వ్యవహారంలో చట్టం తీసుకొస్తామని చెప్పటమే కాదు... ముసాయిదాతో సహా సిద్ధమైపోవటం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట.
శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లతోసహా అందరూ స్వాగతించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్, సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు మాత్రమే కాదు... ఆరెస్సెస్ సైతం అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలన్న తీర్పుతో ఏకీ భవించారు. అయితే ఆ తర్వాత బీజేపీ, ఆరెస్సెస్‌లు వెనక్కి తగ్గాయి. అయ్యప్ప భక్తుల మనో భావాలకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్టు ఆ రెండు సంస్థలూ ప్రకటిం చాయి. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా మొదట్లో ఆ తీర్పును సమర్థిస్తు న్నట్టు తెలిపారు. కానీ ఆ తర్వాత పీసీసీ మాత్రం అందుకు విరుద్ధమైన వైఖరి తీసుకుంది. ఆ తీర్పు నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా పాల్గొన్నాయి.
ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించింది. 20 స్థానాల్లో 19 దక్కించుకుంది. సీట్లు రాకపోయినా బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. కానీ నిరుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఎల్‌డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. యధా ప్రకారం బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరిగింది. నగర ప్రాంతాల్లో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకు చెరో మూడు కార్పొరేషన్లు వచ్చాయి. ఈ పరిస్థితే యూడీఎఫ్‌ను కలవరపెడుతోంది. ఎందుకంటే 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక యూడీఎఫ్ కూటమిని ఓడించి ఎల్‌డీఎఫ్ ఘన విజయం సాధించింది.
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ధోరణే కొనసాగింది. అలాగే యూడీఎఫ్ భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్ మణి వర్గం రెండుగా చీలి, బలమైన వర్గం ఎల్‌డీఎఫ్‌లో చేరింది. ఇది కూడా తనకు నష్టం కలిగిస్తుందన్న భయం కాంగ్రెస్‌కు వుంది. ఫలితంగానే ఈ ముసాయిదా బిల్లు బయటికొచ్చింది. హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు పాటు పడుతున్నట్టు కనిపించేందుకు బీజేపీ మొదటినుంచీ ప్రయత్నిస్తోంది. దాన్ని మరింత పెంచుకునేందుకు కావొచ్చు... కేరళలో యూపీ తరహా లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చి హిందూ, క్రైస్తవ మతాల ఆడపిల్లలను రక్షిస్తామంటోంది. కాంగ్రెస్ కూడా దానితో పోటీ పడాలని చూస్తున్నదని శబరిమల బిల్లు తీరు చెబుతోంది.
ఎన్నికల్లో లేవనెత్తడానికి, అధికార పక్షాన్ని విమర్శించడానికి కేరళలో సమస్యలకేమీ కొదవలేదు. అక్కడ యూడీఎఫ్‌ను గతంలో ఇరకాటంలో పడేసిన సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయరే ఎల్‌డీఎఫ్ నేతల ఆసరాతో కొందరికి ప్రభుత్వోద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణలు గుప్పుమంటు న్నాయి. బంగారం స్మగ్లింగ్ కేసు సరేసరి. పాలనాపరంగా వుండే లోటుపాట్లనూ, ఇతరత్రా సమస్య లనూ లేవనెత్తి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తేనే కాంగ్రెస్‌కు, దాని నేతృత్వంలోని యూడీఎఫ్‌కూ భవిష్యత్తు వుంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మెలిగితే ప్రజలు దాన్ని గ్రహించలేనంత తెలివితక్కువవారు కాదు.
Comments
Please login to add a commentAdd a comment