రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ అంశంలో వెనుకబడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! మరాఠాలు మహారాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం వరకూ ఉండే వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గం. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చాలావరకు మరాఠాలు కొన్ని ఇతర వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన సామాజిక వర్గానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 16 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. 1992 నాటి మండల్ కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అన్నీ 50 శాతం వరకూ ఉండాల్సి ఉండగా.. మరాఠాలకు దీనికంటే ఎక్కువగా కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అసాధారణ పరిస్థితులేవీ చూపించలేదని ఐదుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. అయితే కోర్టు కుల–వర్ణ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరాఠాల్లాంటి వ్యవసాయాధారిత సామాజిక వర్గాల విషయంలోనూ ఈ కుల – వర్ణ వ్యవస్థ సమానత్వ సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది.
కేంద్రంలో భారతీయ జనతాపార్టీ 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ తాము ఇంకా అసమానత బాధితులుగానే మిగిలి ఉన్నామన్న విషయం మరాఠాలకు ఇప్పటికే బోధపడి ఉంటుంది. అఖిల భారత సర్వీసుల్లో కానీ, రాష్ట్ర సర్వీసుల్లో కానీ వీరు శూద్రేతర అగ్రవర్ణాలైన ద్విజులతో వీరు పోటీ పడే పరిస్థితి లేదు. సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాల్లో ఇవి ముఖ్యమైనవి. మరాఠాల మాదిరిగానే భారత్‌లో వ్యవసాయాధారిత శూద్రులైన జాట్‌లు, గుజ్జర్లు, పటేల్స్, రెడ్లు, కమ్మలు, నాయర్లు 1992లో వెనుకబడిన కులాల జాబితాలో చేరే నిర్ణయం తీసుకోలేదు. కానీ చారిత్రకంగా సంస్కృత, పార్శీ, ఇంగ్లిషు విద్యాభ్యాసాన్ని చాలాకాలంగా కలిగి ఉన్న బ్రాహ్మణులు, కాయస్తులు, ఖాత్రీలు, క్షత్రియులు, బనియాలతో తాము పోటీ పడలేమని ఇప్పుడు వీరిలో చాలామంది గ్రహిస్తున్నారు.
మహారాష్ట్రలో హిందూత్వ ఉద్యమం వైపు జన సామాన్యం ఆకర్షితమయ్యేలా చేయగలిగిన మరాఠాలు ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ అధికారం చేపడితే ఢిల్లీలో తమకు అధికార ఫలాలు కొన్నైనా దక్కుతాయని ఆశపడినా.. వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. ఢిల్లీ, అధికారం, తమకింకా దూరంగానే ఉందని మరాఠాలు అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. తమ ప్రాభవమంతా మహారాష్ట్రకే పరిమితమని మరాఠాలు మాత్రమే కాదు... మండల్ జాబితాలోకి చేరిన పలు వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాలూ స్పష్టమైన అంచనాకు వచ్చాయి.
మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడిపోక ముందు ఉన్న స్టేట్ ఆఫ్ బాంబే నుంచి బ్రాహ్మణులు, బనియాలు జాతీయ నేతలు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు చాలామంది జాతీయ స్థాయికి చేరినా మరాఠాలకు మాత్రం ఢిల్లీ అధికారంలో తమ వంతు భాగం దక్కలేదు. శూద్రుల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాటిదార్ సామాజిక వర్గం నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగినా మరాఠాలు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కాకుండా ఆ తరువాత కూడా తమ వర్గం నుంచి ఎవరినీ ఎదగకుండా ద్విజులు అడ్డుకున్నారని ఇప్పుడు మరాఠాలు భావిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యాపారాలకు, స్థానికంగానే అధికారాలకు తమను పరిమితం చేసి హిందూ సమైక్యత పేరుతో తమను మైనార్టీలపై కండబలం చూపించే సాధనాలుగా ఆర్‌ఎస్‌ఎస్ వాడుకుంటోందన్నది కూడా వీరి అంతరంగం.
ఇంగ్లిషు విద్యాభ్యాసమున్న ఉన్నతస్థాయి జాతీయ నేతలు, మేధావులను తయారు చేసుకోవడంలోనూ మరాఠాలు అంతగా విజయం సాధించలేదు. విద్యాభ్యాసం పరంగా వీరందరూ వెనుకబడి ఉన్నారన్నది దీని ద్వారా తేటతెల్లమవుతుంది. చారిత్రకంగానూ శూద్రులు సంస్కృతం చదివేందుకు రాసేందుకు అడ్డంకులు ఉండేవన్నది తెలిసిందే. ముస్లింల పాలనలో పార్శీ విద్యాభ్యాసం విషయంలోనూ ఇదే తంతు కొనసాగింది. అలాగే ఆధునిక ఇంగ్లిషు విద్యకూ మరాఠాలూ దూరంగానే ఉండిపోయారు. ప్రాంతీయ శూద్రులందరిలోనూ ఈ చట్రం నుంచి తప్పించుకోగలిగిన అదృష్టవంతులు కేరళకు చెందిన నాయర్లు మాత్రమే!
సుప్రీం ఆలోచన మారాలి...
సమానత్వమన్న భావనను ముందుకు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ తాలూకూ చరిత్ర మొత్తాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శూద్రుల్లోని కొన్ని వర్ణాల వారు ఇప్పటికీ ద్విజుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఆలిండియా సర్వీసుల్లో వారితో సమానంగా ఎందుకు పోటీ పడలేక పోతున్నారన్నది ఇది మాత్రమే వివరించగలదు. చరిత్ర శూద్రులపై మోపిన అతిపెద్ద భారం ఇది. వారందరూ వ్యవసాయం, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారన్న విషయాన్ని దేశ ఉన్నత న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఎలా అర్థం చేసుకోవాలి?
భారత సుప్రీంకోర్టు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చేసిన తప్పులే చేయరాదు. వారు భూ యజమానులను మాత్రమే గుర్తిం చారు కానీ.. అక్షరానికి ఉన్న శక్తిని గుర్తించలేకపోయారు. భారత్‌లో శూద్రులకు కొంత భూమి, శ్రమశక్తి ఉన్నప్పటికీ అక్షర శక్తి మాత్రం లేకుండా పోయింది. బ్రిటిష్ పాలనలో బ్రాహ్మణ జమీందారులు శూద్రుల జీవితం మొత్తాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉండే వారంటే అతిశయోక్తి కాదు. ఈ రకమైన శక్తి దేశంలోని ఏ ఇతర కులానికీ లేదు. భూమి కలిగి ఉన్న మరాఠాలు కూడా ఈ రకమైన శక్తి కోసం ఆలోచన కూడా చేయలేకపోయారు. ఈ చారిత్రక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానమైనా ఆహారోత్పత్తిలో కీలకమైన కులాల భవిష్యత్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది.
రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంగ్లిషు, ఇంగ్లిషు మీడియం విద్యాభ్యాసం విషయాల్లో. అన్ని కేంద్ర, న్యాయ, మీడియా సర్వీసుల్లో అక్షరానికి ఉన్న శక్తి ద్విజులను సానుకూల స్థితిలో నిలబెట్టింది. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. కుల వర్ణ వ్యవస్థలను రూపుమాపడం ఇప్పుడు ద్విజులకు మాత్రమే కాదు.. హిందువుల్లోని అన్ని కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీల చేతుల్లోనే ఉంది. శూద్రులు, దళితులకు ఆధ్యాత్మిక, సామాజిక న్యాయం కల్పించాల్సిన బాధ్యత కూడా వీరిదే. కానీ దురదృష్టవశాత్తూ వీరు ఈ దిశగా పనిచేయడం లేదు.
సుప్రీంకోర్టు చట్టపరంగా అమలు చేయగల తీర్పులు ఎన్నో ఇచ్చినప్పటికీ కులాధారిత జనగణనకు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకు? ఇదే జరిగితే ప్రతి సంస్థలోనూ కులాల ప్రాతినిథ్యం ఎలా ఉండాలన్న స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది కాబట్టి! న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది!
ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment