2024 సాధారణ ఎన్నికలకు సూచికే | Political Analyst Praveen Rai Article on 5 State Assembly Election Results | Sakshi
Sakshi News home page

2024 సాధారణ ఎన్నికలకు సూచికే

Published Sat, Mar 12 2022 12:29 AM | Last Updated on Sat, Mar 12 2022 12:29 AM

Political Analyst Praveen Rai Article on 5 State Assembly Election Results - Sakshi

- సాక్షికి ప్రత్యేకం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో యూపీ ప్రభుత్వం విజయవంతం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ కారణాల్లో ఒకటి. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్‌ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఎస్పీ విఫలమైంది. ఇక పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. ఈ విజయం ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగిం టిని గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సాను కూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్‌ పోల్స్‌ సరిగ్గానే అంచనా వేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు ఎందుకు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యూపీలో మోడీ–యోగీ హవా!
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయానికి మోడీ–యోగీ ద్వయం కారణ మన్నది నిర్వివాదాంశం. మొత్తం 403 స్థానాల్లో 255 బీజేపీకి దక్కడం, అది కూడా 41 శాతం ఓటుషేరుతో కావడం భారీ విజయం గానే చెప్పుకోవాలి. 2017 ఎన్నికలతో పోలిస్తే 57 సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేసిన అప్నాదళ్‌ (సోనేలాల్‌) పన్నెండు స్థానాలు గెలుచుకోగా, నిర్బల్‌ ఇండియన్‌ శోషిత్‌ హమారా ఆమ్‌ దళ్‌ ఇంకో ఆరు సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల కంటే 73 స్థానాలు ఎక్కువగా, మొత్తం 111 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. సైకిల్‌ గుర్తుకు పడ్డ ఓట్లూ 32 శాతానికి చేరాయి. ఎన్నిక లకు ముందు ఎస్పీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డీ 8, ఎస్‌బీఎస్‌పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 13 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏతావాతా యూపీ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుంది. 

ఈ ఎన్నికలు శాంతి భద్రతలకూ, సమాజ్‌వాదీ గూండా రాజ్యానికీ మధ్య జరుగుతున్నాయన్న బీజేపీ ప్రచారం బాగానే పనిచేసిందని ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి యోగీ అవసరమని భావించిన ఓటర్లు తమ తీర్పును విస్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూలేని విధంగా ఒక పార్టీకి వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశం దక్కింది. అలాగే ‘ఎన్‌సీఆర్‌’ ప్రాంతంలోని నోయిడాను సందర్శించిన వారు యూపీ గద్దెనెక్కలేరన్న గుడ్డి నమ్మకాన్ని కూడా యోగీ ఆదిత్యనాథ్‌ వమ్ము చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో రాణించడానికి పలు కారణా లున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ల చరిష్మాతో పాటు కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ అధి కారంలో ఉండటమూ కలిసొచ్చింది. మోడీ హవా సామాజిక వర్గా లను దాటుకుని అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడేలా చేసింది. అగ్రవర్ణాలు, ఎస్సీలు, చిన్న చిన్న ఓబీసీ వర్గాలతో కలిసి 2014లో సృష్టించుకున్న కూటమి బీజేపీకి దన్నుగా (కొన్ని ప్రాంతాలు మినహా) నిలిచింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో ప్రభుత్వం విజయవంతం కావడం బీజేపీ విజయ కారణాల్లో ఇంకోటి. ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు బీజేపీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్‌ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగు తున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకుందామనుకున్న ఎస్పీ ఈ విషయంలో తీవ్ర భంగపాటుకు గురైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, బీజేపీ సీనియర్‌ నేతలు జాట్‌ నేతలను కలవడం పరిస్థితిని బీజేపీకి కొంత అనుకూలంగా మార్చింది. ఆర్‌ఎల్‌డీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఎక్కువ సీట్లు సాధించ వచ్చునన్న ఎస్పీ అంచనా తప్పింది. వేర్వేరు పార్టీల మధ్య ఓట్ల మార్పిడి కూడా సరిగ్గా జరగలేదు. అయితే, ఎస్పీ కూటమికి దక్కిన అదనపు సీట్లు బీజేపీ వ్యతిరేక పార్టీలతో జాతీయ స్థాయి కూటమి కట్టాలన్న ప్రయత్నంలో జరిగిన మార్పు అనుకోవాలి. 

పంజాబ్‌ను ఊడ్చిన ఆమ్‌ ఆద్మీ
పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చేసిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ స్థానాలు 117లో ఏకంగా 92 గెలుచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్లు 22 శాతమే అయి నప్పటికీ సాధించిన అదనపు సీట్లు మాత్రం 72. కాంగ్రెస్‌ పార్టీ 23 శాతం ఓట్లతో 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్‌ – బీఎస్పీ కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. 

ఆప్‌కు పంజాబ్‌లో దక్కిన అపూర్వ విజయం... ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే. అదే సమయంలో ఈ ఓటు భూస్వామ్యవాద పోకడలతో, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పడ్డది గానూ చూడవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ము లాటలు, వర్గపోరుల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య భగ్గుమన్న విభేదాలు పార్టీ మద్దతుదారులు అనేకులు దూరమమ్యేందుకు కారణమైంది. సిద్ధూను పార్టీ అధ్యక్షుడిగా, దళితుడైన చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చన్నీ, సిద్ధూ ద్వారా రాష్ట్రంలోని 32 శాతం దళిత, 20 శాతం జాట్‌ ఓటర్లను కూడగట్టాలని అనుకున్న కాంగ్రెస్‌ పథకం పూర్తిగా బెడిసికొట్టింది. ఆధిపత్య పోకడలకు పోయే జాట్‌ సిక్కులతో కలిసి ప్రయాణించలేమనుకున్న దళితులు మూకుమ్మడిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు మొగ్గారు. 

అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రచార లోపాలు అన్నీ ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను ప్రకటించిన క్షణం నుంచి ఆ పార్టీకి అనుకూల పవనాలు వీచాయంటే అతిశయోక్తి కాదు. నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, విద్యా వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, మహిళలకు పింఛన్ల వంటి పథకాలు ప్రజలను ఆప్‌కు ఓటేసేలా చేశాయి. 

ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా...
మోడీ హవాతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి విజయం దక్కింది. ఉన్న డెబ్భై స్థానాల్లో 47 కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ మును పటి కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ దక్కించుకున్నా అధికారం మాత్రం అందని మానిపండుగానే మిగిలింది. ముఖ్యమంత్రులను మార్చడం, పార్టీలో అంతర్గత విభేదాల కార ణంగా బీజేపీ మూడు శాతం ఓట్లు, పది సీట్లు కోల్పోయింది. కొత్త ఉద్యోగాల కల్పన, ఏడాది పొడవునా చార్‌ధామ్‌ యాత్రకు ఉయోగపడేలా రహదారుల నిర్మాణం, కర్ణ ప్రయాగ్, రిషికేశ్‌ల మధ్య రైల్వే లైను వంటి బీజేపీ ఎన్నికల హామీలు పని చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ హరీశ్‌ రావత్‌ నేతృత్వంలో తన స్థితిని కొంచెం మెరుగుపరచుకోగలిగింది కానీ, హైకమాండ్‌ నుంచి తగిన మద్దతు లభించకపోవడం; పార్టీలో వర్గాలు, ప్రచారకర్తల లేమి వంటి కారణాలతో ఓటమి పాలైంది.

మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై సీట్లలో విజయం లక్ష్యంగా అరవై స్థానాలున్న అసెంబ్లీకి పోటీ పడింది. దక్కింది 32 స్థానాలు మాత్రమే అయినప్పటికీ... సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, జేడీ(ఎస్‌), ఫార్వర్డ్‌ బ్లాక్‌లతో కూడిన కాంగ్రెస్‌ కూటమికి ఐదు స్థానాలు మాత్రమే లభించాయి. కేంద్రంలో బీజేపీ భాగస్వామి అయిన ఎన్‌పీపీ ఒంటరిగానే పోటీకి దిగి ఏడు స్థానాలు, జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్‌పీఎఫ్‌ ఇంకో ఐదు స్థానాలు గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సుస్థిర, శాంతియుతమైన ప్రభుత్వం అందిం చినందుకుగానూ మణిపూర్‌ ప్రజలు మరోసారి బీజేíపీకి పట్టం కట్టినట్లుగా చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక వర్గాల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకోవడమూ కాషాయ పార్టీకి కలిసివచ్చింది.

నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బహుముఖ పోటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, మహా రాష్ట్రవాదీ గోమాంతక్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూటమి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోయి ఉండటం కలిసి వచ్చింది. మోజారిటీకి ఒక స్థానం తక్కువగా 20 స్థానాలు గెలుచు కుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి 12, ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోగా తృణమూల్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. బీజేపీయేతర పార్టీల్లో అనైక్యత ఫలితాలు ఎలా ఉంటాయో గోవా ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. 

మొత్తమ్మీద చూస్తే భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించడం వెనుక ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోవడం కారణమన్న వాదనలో అంత పస లేదనే చెప్పాలి. మంచి పాలన, వి«ధానాల ఆధారంగానే ఓటర్లు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తుకు సూచికగా చూడవచ్చు. పంజాబ్, గోవాల్లో అధికారాన్ని దక్కించు కోవడంలో విఫలమైన కాంగ్రెస్‌ తన పతనావస్థలో చరమదశకు చేరుకుందని చెప్పాలి. 2024 సాధారణ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సూచిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.


ప్రవీణ్‌ రాయ్‌ 
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement