ఇవ్వాళ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఈ యుద్ధానికి కారణం ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని తీసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు. అది ఒక సాకు మాత్రమే. అమెరికా–రష్యాల మధ్య ఉన్న ఆధిపత్య పోరే అసలు హేతువు. నిజానికి ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆగ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరిహద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ హామీతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాని ఏమాత్రం లెక్కచేయకుండా తన ప్రజలను యుద్ధోన్ముఖులను చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరువర్గాల సైనికులనే కాదు ఉక్రె యిన్ పౌరులనూ బలి తీసుకుంటోంది. సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్‌ను విడిచి వెళ్తున్నారు. యుద్ధం వల్ల ఈ రెండు దేశాలు మాత్రమే కాక మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ దెబ్బతింటాయి. అలాగే అంతర్జాతీయ సంబం«ధాలు ఎక్కువగా ప్రభావిత మవుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అతి శక్తిమంతమైన దేశంగా అవతరించింది. తరువాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో జడత్వం, తూర్పు యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థల బాధ్యత, అవినీతి, నిరుద్యోగం లాంటి అనేక కారణాల వల్ల 1991లో పదిహేను స్వతంత్ర దేశాలుగా అది విడిపోయింది. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగా ఎంతో పటిష్ఠపరిచారు. కానీ 2004లో ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియాలు తమ ఆర్థికాభివృద్ధి, సార్వ భౌమాధికారం, సరిహద్దు రక్షణల కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందిన పశ్చిమదేశాల ఆర్థిక కూటమి అయిన యూరోపియన్ యూనియన్‌లోనూ, రక్షణ కూటమి అయిన నాటోలోనూ చేరిపోయాయి. దీంతో నాటో బల గాలు ఆయా దేశాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్య తన భద్రతకు ముప్పు కలిగించేదని రష్యా మొదటి నుంచీ భావి స్తున్నది. కొత్తగా ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాల పొంతన చేరటానికి చేస్తున్న ప్రయత్నాలు రష్యాకు కోపం తెప్పించాయి.
అసలు ఈ సంక్షోభానికి 2010లోనే బీజాలు పడ్డాయి, ఉక్రెయిన్‌లో ఉన్న నౌకాశ్రయాన్ని ఉపయోగించుకునేందుకు అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ రష్యాతో 25 సంవత్సరాలు కొనసాగే ఒప్పందం చేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా రష్యా తన సహజ వాయువును 30 శాతం తక్కువ ధరకు ఉక్రెయిన్‌కు సరఫరా చేయ డానికి అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం ఉక్రెయిన్ ప్రజలకు నచ్చ లేదు. తర్వాత 2013లో ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వ ప్రతిపాదనను తిరస్కరించటం, ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా ఉక్రె యిన్ ప్రజల్లో అతని పట్ల వ్యతిరేకత పెరిగింది. దీంతో విక్టర్ అధ్యక్ష పదవినుండి వైదొలగి రష్యాకి పారిపోయాడు. ఉక్రెయిన్‌లో ఉన్న 70 శాతం ఉక్రైనీ భాష మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్‌లో చేరితే ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ, ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ భావించారు. కానీ మిగతా 30 శాతం రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉక్రెయిన్ రష్యాలో కలవాలనీ, పశ్చిమ దేశాలు తమను బానిసలుగా చూస్తారనీ తలిచారు. ఇదే అదనుగా తీసుకోని రష్యా, 2014లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన క్రిమియాను ఆక్రమించింది. ఆ తర్వాత క్రిమియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి దానిని పూర్తిగా తన భూభాగంలో కలుపుకొంది. అప్పటినుండి ఉక్రెయిన్‌లోని మిగతా రెండు– డోనెట్‌సక్, లుహాన్‌సక్ ప్రాంతాల్లో వేర్పాటువాదులకు రష్యా సహాయం చేస్తోంది.
అయితే 2019లో అధ్యక్షుడైన జెలెన్‌స్కీ ఆధ్వర్యంలో మళ్లీ ఉక్రెయిన్... నాటో సభ్యత్వం విషయం తెరపైకి తీసుకొచ్చింది. నాటోలో ఉక్రెయిన్‌కి సభ్యత్వం లభిస్తే... తన భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అందుకే అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఇదే విషయమై రష్యా కొంత కాలంగా పశ్చిమ దేశాలపైనా ఒత్తిడి తెస్తూనే ఉంది. దానిలో భాగంగానే, రష్యా తన మిత్ర దేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు చేసింది. తర్వాత తన రక్షణ దళాలను ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లో మోహరించి, రష్యన్ భాషను మాట్లాడే ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని హెచ్చరించింది. అయినా అటు అమెరికా, పశ్చిమ దేశాల నుండి కానీ; ఇటు ఉక్రెయిన్ నుండి కానీ నాటో విస్తరణ ఉండబోదని ఎలాంటి హామీ రాలేదు. పైగా ఆర్థిక ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టింది.
అయితే ఉక్రెయిన్ ఆక్రమణ తమ ఉద్దేశం కాదనీ, కేవలం మిలిటరీ ప్రదేశాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యం అనీ పుతిన్ చెప్పుకొచ్చాడు. అమెరికా, పశ్చిమ దేశాలపై ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చుకోలేమని ప్రకటన చేయించటం లేదా ప్రస్తుతం ఉక్రెయిన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి రష్యాకి సన్ని హితమైన ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచి నాటో విస్తరణ జరగ కుండా అడ్డుకోవటం అనే లక్ష్యాలతో రష్యా సైనిక చర్యకు దిగింది.
కానీ ఉక్రెయిన్ మాత్రం మొదటగా రష్యానే 1994లో జరిగిన బుడాపెస్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2014లో క్రిమియాని ఆక్రమించిందని వాదిస్తో్తంది. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ తన దగ్గర ఉన్న అణుశక్తి సంపదను రష్యాకి అప్పజెప్పినందుకు బదులుగా తను ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి రక్షణ కల్పించాలి. ఆ పని చేయకపోగా తమ భూభాగమైన క్రిమియాను రష్యా ఆక్రమిం చిందనీ, ముందు ముందు తమ దేశంలోని మిగతా ప్రాంతాలను కూడా రష్యా ఆక్రమిస్తుందనీ, దాన్ని ఎదుర్కోవాలంటే తమ రక్షణ సామర్థ్యం సరిపోదు కాబట్టి నాటోలో భాగస్వామి కావాలను కుంటున్నామనీ ఉక్రెయిన్ అంటోంది. యూరోపియన్ యూని యన్‌లో చేరితే తమ దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ, అందువల్ల దానిలో చేరాలని భావిస్తున్నట్లూ పేర్కొంది.
వాస్తవానికి ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆ గ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరి హద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. దానితో అమెరికా, పశ్చిమదేశాలు తనకు యుద్ధంలో సహాయం చేస్తాయనీ, ఆర్థిక ఆంక్షలు విధిస్తే రష్యా ప్రపంచంలో ఒంటరి అయిపోతుందనీ ఉక్రెయిన్ అనుకుంది. జరిగిన ఈ తతంగమంతా చూస్తుంటే రష్యా– అమెరికాల మధ్య ఆధిపత్య పోరే ప్రస్తుత యుద్ధానికి అసలు కారణ మని స్పష్టమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రష్యా బాధ్యత ఎంత ఉందో అమెరికాకు కూడా అంతే బాధ్యత ఉంది. అమె రికా ఎప్పుడూ మొదట ఒక దేశాన్ని యుద్ధంలోకి తోసి తను మెల్లగా జారుకుంటుంది. అది అఫ్గానిస్థాన్∙కావొచ్చు లేదా ఉక్రెయిన్ కావొచ్చు... మధ్యలో అనవసరంగా బలయ్యేది అమాయకులైన ప్రజలే అని అర్థం చేసుకోవాలి.
భారత దేశానికి ఉక్రెయిన్, రష్యా రెండూ మంచి మిత్రదేశాలు కాబట్టి రెండు దేశాలతో మాట్లాడి గతంలో జరిగిన ఒప్పందాన్ని గౌరవించేలా ఒప్పించాలి. ఇరువర్గాల మధ్య ఉన్న భద్రతా పరమైన ఆందోళనకు తెరదించేలా... ఆంక్షలు విధించకుండా దౌత్యంతోనే సమస్యని పరిష్కరించుకునేట్లు చేయాలి. ఈ యుద్ధం వలన భారత్ పైన ఆర్థిక ప్రభావం కన్నా వ్యూహాత్మక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రష్యా మొదటినుండీ అన్ని విషయాలలో ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ప్రతి అంతర్జాతీయ వేదికపైనా సమర్థిస్తూ, భద్రతా మండలిలో అనుకూలంగా ఓటువేసి భారత్‌ను సమర్థించుకుంటూ వచ్చింది. ఇప్పటికే భారత్ అంతర్జాతీయ వేదిక పైన రష్యాను ఏకాకిని చేసే విషయంలో ఓటింగుకు దూరంగా ఉండి దానికి అనుకూలంగా వ్యవహరించిందనే చెప్పాలి. రష్యా– ఉక్రెయిన్‌లు తమ సమస్యలను యుద్ధంతో కాక చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి భారత్ తన పలుకుబడిని ఉపయోగించాలి.
డా. నరేష్ సుధావేణి
– వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్;
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment