‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’ | How Kim North Korea Army Avoid Capture In Ukraine War | Sakshi
Sakshi News home page

‘పట్టుబడితే.. ఆ నరకం కన్నా చావడమే నయం!’

Published Wed, Jan 15 2025 10:41 AM | Last Updated on Wed, Jan 15 2025 10:53 AM

How Kim North Korea Army Avoid Capture In Ukraine War

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కి.. పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాకు చేరువయ్యారు ఆయన. అయితే.. మిత్ర దేశం రష్యా కోసం ఇప్పుడు ఆయన ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తన సైన్యాన్ని బలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు(North Korea Soliders) ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొంటున్నారు. అయితే.. ఇటు ఉకక్రెయిన్‌గానీ, అటు రష్యా గానీ ఆ విషయాన్ని  కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌ సైన్యానికి పట్టుబడడం ఇష్టంలేక తమను తాము పేల్చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు!. తాజాగా..

గత వారం రోజులుగా ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కుర్సుక్‌ రీజియన్‌లో దాడులు జరిపి ప్రత్యర్థి బలగాలను మట్టుబెట్టింది. ఆపై ఉక్రెయిన్‌ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా.. ఉక్రెయిన్‌ సైనికులను చూసి గ్రెనేడ్‌తో తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఈ పేలుడులో ఉక్రెయిన్‌ సైనికులు సురక్షితంగా బయటపడ్డారు.  ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో.. ఉత్తర కొరియా మాస్కోకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సైనికులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు కీవ్‌ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాయి.

యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు పట్టుబడితే.. యుద్ధ ఖైదీగా ఉండిపోవాలి. అంతేకాదు.. యుద్ధ నేరాల్లో ప్యాంగ్‌యాంగ్‌ పాత్ర కూడా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అందుకే పట్టుబడి ఉక్రెయిన్‌లో యుద్ధ ఖైదీలుగా ఉండడం కన్నా.. ఆత్మాహుతికి పాల్పడడం మేలు అని వాళ్లు భావిస్తున్నారు అని కీవ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

‘‘పట్టబడకుండా ప్రాణం తీసుకోవడం.. ఇదే నార్త్‌ కొరియా నేర్పేది’’ అని ఉత్తర కొరియా మాజీ సైనికుడు కిమ్‌(32) చెబుతున్నాడు. రష్యాలో నిర్మాణ ప్రాజెక్టులకు కాపలాగా ఉత్తర కొరియా సైన్యం తరఫు నుంచి వెళ్లి కిమ్‌ ఏడేళ్లపాటు పని చేశాడు. ఆపై 2022లో దక్షిణ కొరియాకు పారిపోయి తన ప్రాణం రక్షించుకున్నాడతను.

‘‘ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే.. ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి. ఇళ్లు, భార్యాపిల్లలు అన్నింటిని వదిలేసుకోవాలి. సైన్యంలో వాళ్లకు బ్రెయిన్‌వాష్‌ చేస్తారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong-Un) కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాల్సి ఉంటుంది’’ అని కిమ్‌ రాయిటర్స్‌ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పట్టుబడి తిరిగి ప్యాంగ్‌యాంగ్‌కు వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నాడతను. ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాల్పడినట్లే. ఆఖరి తూటా దాకా అతని శరీరంలో దిగాల్సిందే.. ఇదే అక్కడి సైన్యంలో అంతా చర్చించుకునేది అని కిమ్‌ తెలిపాడు.

రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తూ వస్తోంది. సుమారు 11,000 వేల మంది సైనికులను ఉత్తర కొరియా మోహరింపజేసిందనేది కీవ్‌ ఆరోపణ. ఇందులో 3 వేల మంది  ఇప్పటికే మరణించినట్లు ప్రకటించింది. అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలను గుర్తించినట్లు తెలిపింది. ‘‘వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారు. చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారు. వాళ్ల సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా భాషలో మాట్లాడుతున్నట్లు బయటపడింది’’ అని కీవ్‌కు చెందిన ఓ సైన్యాధికారి తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ప్యాంగ్యాంగ్‌ వర్గాలు కొట్టిపారేశాయి. మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.

రష్యానే కాల్చిపారేస్తోందా?
ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. ఉత్తర కొరియా పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు వారిని రష్యా కాల్చి చంపేస్తోందని ఆరోపించారాయన. ఈ పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్‌ భద్రతా సర్వీస్‌.. ఎస్‌బీయూ మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపింది. 

‘‘బందీలకు ఉక్రేనియన్, ఇంగ్లిష్, రష్యన్‌ భాషలు రావు. దక్షిణ కొరియా అనువాదకుల సాయంతో వారితో మాట్లాడుతున్నాం’’అని పేర్కొంది. మరోవైపు.. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్‌స్కీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రపంచంలోనే తనది అ‍త్యంత శక్తివంతమైన సైన్యంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) ఆ మధ్య ప్రకటించుకున్నారు. 1950-53 కొరియన్‌ వార్‌ తర్వాత నార్త్‌ కొరియా సైన్యాన్ని రష్యాలో మోహరించడం ఇదే. అలాగే.. వియత్నాం యుద్ధం, సిరియా అంతర్యుద్ధంలోనూ ఉత్తర కొరియా సైన్యం పాలు పంచుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement