russia-ukraine War 2022: Ukraine President Volodymyr Zelensky Joins Army - Sakshi
Sakshi News home page

Russia-Ukraine Crisis: అమరేంద్ర బాహుబలిలా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Published Thu, Feb 24 2022 9:05 PM | Last Updated on Fri, Feb 25 2022 4:54 PM

Russia Attack Ukraine President Volodymyr Zelensky Joins Army - Sakshi

‘‘నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడువరు, నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి’’.. నాయకత్వం గురించి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన అద్భుతమైన పలుకులివి. 

Ukrainian President Volodymyr Zelensky: ఉక్రెయిన్‌ పరిస్థితుల్లో సుందరయ్య మాటల్ని అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణాలేవైనా.. తప్పిదం ఎవరిదైనా.. ఫలితం నాలుగు కోట్ల పైగా జనం ఇప్పుడు యుద్ధ భూమిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఈ యుద్ధంలో నేను సైతం అంటూ ముందుకు దూకాడు ఉక్రెయిన్‌ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ Volodymyr Zelenskyy. సరిహద్దు ఉద్రిక్తతల నాటి నుంచే సైనికుల్లో కలిసిపోయి పరిస్థితులను సమీక్షించిన ఆయన.. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం నుంచి కదనరంగంలోకి పూర్తి స్థాయి సైనికుడిగా దూకేశాడు.
 
 

ఒకవైపు ర‌ష్యా ఫైట‌ర్ జెట్లు ఉక్రెయిన్ న‌గ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపిస్తుంటే.. సైనికుడి దుస్తులేసుకున్న జెలెన్‌స్కీ నేరుగా యుద్దంలో పాల్గొంటున్నాడు. అధ్య‌క్ష భ‌వ‌నంలో పిరికిపందలా దాక్కోకుండా వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ(44).. సైనికుల‌తో కలిసి తుపాకీ చేతబట్టిన ఫొటోలు, వీడియోలు కొన్ని ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఓ వైపు బాంబుల వ‌ర్షంతో ర‌ష్యా విరుచుకుప‌డుతున్నా.. నేరుగా యుద్ధ రంగంలోకి దిగిపోయి సైనికుల్లో మనోధైర్యం నింపుతున్న వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. దేశం కోసం పోరాడాల్సి వస్తే ముందుండేది సైనికుడే. కానీ, ఆ సైనికుడి కంటే ముందు తాను ఉంటానంటున్నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.

అగ్రరాజ్యం, పాశ్చాత్య దేశాలు, నాటో దళాలు సహా ఎవరూ సాయం రాని టైంలో.. దేశ పౌరులే ఆయుధాలు చేతబట్టి పోరాడాలని వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఉక్రెయిన్‌ సైన్యం తన పని తాను చేసుకుపోతుందన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. పరిస్థితి చేతులు దాటి పోతుండడంతో పౌరులకు పిలుపు ఇచ్చాడు. ఆపై సైన్యాన్ని వెంట ఉండి నడిపిస్తుండడం, సూచనలు ఇస్తుండడంతో.. సిసలైన నాయకుడంటూ సోషల్‌ మీడియా అభినందిస్తోంది. అలాంటి వ్యక్తిని అమరేంద్ర బాహుబలితో పోల్చడం తప్పేం కాదేమో కదా!.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement