Russia Ukraine War Day 14 Live News Updates: మరిన్ని ఆంక్షలు.. రష్యా బలగాల ఉగ్రరూపం - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Crisis: రష్యాకు బిగ్‌ షాక్‌.. పుతిన్‌కు మరో దెబ్బ!

Published Wed, Mar 9 2022 9:33 AM | Last Updated on Wed, Mar 9 2022 9:25 PM

Ukraine Russia War Day 14 Live Updates - Sakshi

Ukraine War Live Updates:

ఉక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యాను మరింతగా రెచ్చగొడుతోంది అమెరికా. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం 14వ రోజు కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రష్యా-ఉక్రెయిన్‌ ప్రజలు. 

పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి..

ఉక్రెయిన్‌లో మారియూపోల్‌ నగరంలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ బాంబు దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందని స్థానిక కౌన్సిల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. 

రష్యా చేతిలో బందీలుగా 4 లక్షల మంది ఉక్రేనియన్లు.. 
► ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్‌లోని మరియూపోల్‌లో 4 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను రష్యా బందించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా 3 వేల మంది నవజాత శిశువులకు సరైన వైద్యం, మెడిసిన్‌ అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రష్యాను ఉక్రెయిన్‌ పౌరులు, పిల్లలపై దాడులు ఆపాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. 

రష్యాకు బిగ్‌ షాక్‌..
► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(WEF) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న అన్ని సంబంధాలను స్తంభింపజేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా ఆంక్షల జాబితాలో ఉన్నవారికి దావోస్‌లో జరిగే వార్షిక సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. 

ప్రమాదంలో చెర్నోబిల్‌ న్యూ క్లియర్‌ ప్లాంట్‌..

► ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్‌ న్యూక్లియర్ ప్లాంట్​కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్‌ బాంబ్‌ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్​కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్​లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్​ను చల్లార్చే వ్యవస్థలపై ప‍్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్​ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్​కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్​కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. 

జెలెన్‌ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా టార్గెట్‌ కాదు..
► రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో రౌండ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చర్చల్లో రెండు దేశాల బృందాలు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదని తెలిపింది. 

దేశాన్ని వీడుతున్న ప్రేయసి.. లవ్‌ ప్రపోజ్‌ చేసిన ఉక్రెయిన్‌ సైనికుడు 
► యుద్ధం కారణంగా దేశాన్ని వీడుతున్న తన ప్రేయసికి ఉక్రెయిన్‌ సైనికుడు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్‌ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. 

సుమీ నుంచి రైళ్లలో భారతీయుల తరలింపు.. 
► ఉక్రెయిన్‌లోని సుమీలో రష‍్యన్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల సాయంతో సుమీ నుంచి భారతీయులను రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట‍్విట్టర్‌ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడమే తమ కర్తవ్యమని ఎంబసీ తెలిపింది.

రష్యా, బెలారస్‌పై ఈయూ మరిన్ని కఠిన ఆంక్షలు 
► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై పలు దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాడుల వేళ రష్యాకు సహకరిస్తున్న కారణంగా బెలారస్‌పై, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌లోని సభ్య దేశాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.  

12వేల మంది రష్యా సైనికులు హతం.. ఉక్రెయిన్‌
► ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది.  రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్స్‌, 48 యుద్ధ విమానాలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది.

మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్‌.. బంగ్లా ప్రధాని 
► ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్‌ గంగా కొనసాగుతోంది. ఆపరేషన్‌ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్‌ ప్రజలు.. ఆపరేషన్‌ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్‌.. అంటూ వ్యాఖ్యలు చేశారు. 

చెర్నోబిల్‌పై ప్రకటన

► ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) చెర్నోబిల్‌ గురించి కీలక ప్రకటన చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్‌ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్‌ ఏజెన్సీకి ఉక్రెయిన్‌ ఒక నివేదిక ఇచ్చింది.

  

మరోసారి రష్యా కాల్పుల విరమణ. బుధవారం కూడా సేఫ్‌ కారిడార్‌ల నుంచి పౌరుల తరలింపునకు అనుమతి. ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు ముమ్మరం. అయినా రష్యా బలగాలు ఉ‍ల్లంఘనలతో దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపణ.

రష్యా చేతిలోకి కీవ్‌!

► మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు.

► రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 14వ రోజుకు చేరుకుంది.  యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. 

► ఒకవైపు నాటో ప్రతికూల ప్రకటన, రష్యాతో సంధి కోసం పిలుపు ఇచ్చినట్లే ఇచ్చి.. యుద్ధం ఆపేదేలేదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని  తమ పౌరులకు పిలుపునిచ్చారు. 

► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది.

► ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్‌లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement