
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు.. దేశీయ శాసనాలకే అతీతంగా ఉంటున్నాయా? రాజకీయ పక్షపాత వైఖరితో ఆయా దేశాల్లో పాలకపక్షంవైపు మొగ్గు చూపుతూ పాక్షికతకు ప్రాధాన్యత ఇస్తున్నాయా? దేశంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ సందేహాలకు ఆస్కారమిస్తున్నాయి. కర్ణాటకలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభుత్వాలకే కాకుండా, కొన్ని కమ్యూనిటీలకు కూడా అనుకూలంగా ఉంటోందా అనేది చర్చనీయాంశమైంది. భారత చట్టాలను అతిక్రమించి సోషల్ మీడియా వేదికలు సొంత నిబంధనలను అమలు చేస్తున్నాయా అనే సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. దేశీయ చట్టాలకు అతీతంగా కాకుండా, ఇవి ఇకనుంచైనా జవాబుదారీతనంతో, నిష్పాక్షికతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి.
అమెరికా ఎన్నికలు తీవ్రమైన చర్చలకు, వివాదాలకు, పెడబొబ్బలకు, దూకుడుతనానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. మీడియా పూర్తిగా పక్షపాత వైఖ రిని చేపట్టడమే దీనికి కారణం. అలాంటి మీడియా రిపోర్టులలో ఒకటి ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ బైడెన్ ప్రచార యుద్ధ పర్వంలోకి భారతదేశాన్ని, భారతీయులను కూడా లాగాలని ప్రయత్నించింది. మొదటిది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు కొత్తగా రూపొందుతున్న రద్దు సంస్కృతి (క్యాన్సిల్ కల్చర్) ప్రతిపాదకులు అతి సులభంగా బలం పుంజుకుంటున్నారన్నది వాస్తవం. విషయాన్ని పర్యవేక్షించడంలో సోషల్ మీడియా వేదికలకు తమవైన నియమనిబంధనలు ఉండవచ్చు. అది వారి హక్కు కూడా కావచ్చు. అయితే వీరి హక్కు, వీరి నియమనిబంధనలు ప్రత్యేకించి ప్రజాస్వామిక వ్యవస్థలు ఉన్న సార్వభౌమాధికార దేశాలు రూపొందించుకున్న శాసనాలనే అధిగమించేలా ఉండకూడదు.
ఉదాహరణకు, భారత్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న శాసనవ్యవస్థ రాజ్యాంగపరమైన, న్యాయ స్మృతులపై ఆధారపడింది. తన భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీల నియమ నిబంధనలన్నింటినీ ఇది తోసిపుచ్చుతుంది. తమ వ్యాపార కార్యకలాపాలను ఇక్కడ నిర్వహించాలంటే ఈ వేదికలన్నీ భారతీయ చట్టానికి అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా విషయ పర్యవేక్షణ, నిర్వహణ విషయంలో కూడా భారత చట్టాలకు లోబడి ఉండాలి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన ఒక కథనం. ఫేస్‌బుక్ లోని కొందరు ఉద్యోగులు రాజకీయ పక్షపాత బుద్దితో బీజేపీకి అసాధారణ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించింది. నిర్దిష్టంగా తాము ఎంపిక చేసుకున్న అభిప్రాయాలను మాత్రమే తమ వేదికపై ప్రాధాన్యత ఇస్తూపోవడాన్నే కేన్సిల్ కల్చర్ అంటున్నారు. అంటే తమ వేదికలో దేన్ని అనుమతించాలి. దేన్ని అనుమతించకూడదు అనే విషయంలో ప్లాట్‌ఫామ్ స్వయం ప్రకటిత పరిపూర్ణ హక్కును కలిగి ఉంటుంది. తమకు అవసరం లేని అంశాలను వెలుగులోకి తీసుకురాకుండా తోసిపుచ్చుతుంది లేదా రద్దు చేస్తుందన్నమాట.
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ల అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికలు పరస్పరం తలపడటానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ ఫేస్ బుక్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణ తీవ్రస్థాయిలో చర్చలు రేపింది. అయితే ఇది భారత్‌తో ఫేస్‌బుక్ ఇతర వేదికలను ఉపయోగిస్తున్న భారతీయులతో ముడిపడి ఉన్నందున భారతీయ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చిద్దాం. అదే సమయంలో సోషల్ మీడియా జవాబుదారీతనం, సమ్మతిపై చుట్టుముడుతున్న మూడు కీలక ప్రశ్నలపై దృష్టి పెడదాం.
మొదటిది, ఆన్‌లైన్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి భారత్‌లో ఉన్న ఏకాభిప్రాయం ఏమిటి? అది ఖచ్చితంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ కోరుకుంటున్న ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఉండదు. భారత రాజ్యాంగం తన పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. బాహ్య సంస్థ కాకుండా ప్రభుత్వం లేదా రాజ్య వ్యవస్థ మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించవచ్చు. భారత సౌర్వభౌమాధికారం, ప్రభుత్వ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, సామాజిక శాంతి, న్యాయస్థానాల ఉల్లంఘన, పరువునష్టం, హింసకు పురికొల్పడం వంటి సందర్భాల్లో మాత్రమే వాక్ స్వేచ్ఛపై హేతుబద్ధమైన ఆంక్షలు ఉంటాయని ఆర్టికల్ 19(2) నిర్వచిస్తోంది.
ఈ ఆంక్షలను వాటి అన్వయంపై ఆధారపడి తొలగించడంలో లేక విధించే విషయంలో భారత న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 19(2)కు మార్గదర్సకత్వం వహించే నిర్దిష్ట నిర్వచనాలు ఏవీ లేవనే. భారత న్యాయ స్మృతిని ఉల్లంఘించకుంటే తప్ప, అన్ని రకాల ప్రసంగాలు చేయడంలో ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. దృక్పథాలు, శాసన పరిధులూ కాలాన్ని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు, డీహెచ్ లారెన్స్ రచన లేడీ చాటర్లీస్ లవర్ నవలను ఒకప్పుడు న్యాయస్థానాలు అశ్లీలంగా భావించాయి. కానీ ఇదే నవలను ఇప్పుడు యూనివర్సిటీ పాఠ్యపుస్తకాల్లో భాగం చేశాయి. భారత రిపబ్లిక్ తొలి సంవత్సరాల్లో తప్పితే, ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసే ప్రసంగాలపై మన దేశంలో ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. సుప్రీంకోర్టు హిందుత్వపై ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రసంగాలను మరింత విస్తరించింది. విద్వేష ప్రసంగం అంటే వివిధ సామాజిక బృందాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రసంగం అనీ, హింసాత్మక ప్రసంగం అంటే ప్రజల మధ్య తక్షణం హింసను పురికొల్పేలా చేసే ప్రసంగం అని సుప్రీంకోర్టు నిర్వచించింది. ఈ రెండు రకాల హింసలతో వ్యవహరించడంలో వేర్వేరు చట్టాలను కూడా తీసుకొచ్చారు.
ఇప్పుడు వాక్ స్వేచ్చకు సంబంధించిన కొన్ని తాజా ఉదాహరణలపై సోషల్ మీడియా స్పందనలు, దాని పర్యవసనాలను కూడా చూశాం. గతవారం కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి బంధువు పి. నవీన్ ఒక పోస్టకు ప్రతిగా స్పందించి పెట్టిన మరో పోస్టు బీభత్సం సృష్టించింది. దాన్ని ఇస్లాం వ్యతిరేకంగా భావించిన గుంపు ఒక్కసారిగా గుమికూడి ఆ శాసనసభ్యుడి ఇంటిని, మరో రెండు పోలీసు స్టేషన్లను ధ్వంసం చేసింది. పోలీసు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫేస్‌బుక్ తన కంటెంటును పర్యవేక్షించడంలో పక్షపాతాన్ని ప్రదర్శించిందని వాదిస్తున్నారు. అంతా ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు నవీన్ రెచ్చగొట్టే స్పందనను తొలగించింది. ఇక్కడ కూడా ఫేస్ బుక్ వంచనతోనే వ్యవహరించింది. నవీన్ పోస్టుకు కారణమైన తొలి పోస్టును మాత్రం అలాగే ఉంచేసింది. అంటే భారత్‌లో కూడా ఫేస్ బుక్ ఒక ప్రత్యేక కమ్యూనిటీపట్ల పక్షపాత దృష్టితో ఉంటోందని భావించవచ్చా? ఇక్కడే జవాబుదారీతనం సమస్య ఎదురవుతుంది.
అలాగే గతవారం జేఎన్‌యూ ప్రొఫెసర్, సుపరిచితుడైన ఆనంద్ రంగనాథన్ ఖురాన్ నుంచి ఒక సూక్తిని పోస్ట్ చేయగా దాన్ని ట్విట్టర్ తొలగించేసింది. కారణం. అల్లాను, ఆయన దూతను దూషించిన వారిని శిక్షించాలని ఆ సూక్తిలో ఉంది. బెంగళూరు అలజడుల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. జాతి, మతం, లింగపరంగా, జెండర్ గుర్తింపుపరంగా, వయస్సుపరంగా, వైకల్యంపరంగా లేదా తీవ్ర వ్యాధుల పరంగా ఇతర ప్రజలను బెదిరిస్తూ, వేధిస్తూ హింసకు పాల్ప డకూడదు, రెచ్చగొట్టకూడదు అనే తమ ప్లాట్ ఫామ్ నియమాలను ఉల్లంఘించినందునే ఆయన ట్వీట్‌ను తొలగించామని ట్విట్టర్ పేర్కొంది. భారత మీడియాలో రాతపరంగా గానీ, మాట పూర్వకంగా గానీ స్వేచ్ఛగా చేసే వ్యక్తీకరణల పట్ల న్యాయపరమైన నిబంధన అంటూ ఏదీ లేనందున ఆ ప్రాతిపదికన ట్విట్టర్ ఎలా చర్య తీసుకుంటుందనేది ప్రశ్న. ఈ విషయంలో భారత చట్టాలను ట్విట్టర్ అతిక్రమించినట్లే లెక్క.
ఇక రెండో ప్రశ్న ఏమిటంటే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వర్తించే చట్టం ఏమిటన్నదే. మాతృసంస్థ భారత చట్టాలపై ఆధారపడి ఉందా, లేక మాతృసంస్థ లేక ఇతరప్రాంతాల్లో పనిచేస్తున్న కంపెనీ రూపొందించుకున్న సొంత శాసనంపై ఆధారపడి వ్యవహరిస్తుందా అన్నది కీలకమవుతుంది. భారత శాసనాలను పక్కన బెట్టి ఫేస్ బుక్ వ్యవహరిస్తోందా లేక ప్రపంచవ్యాప్తంగా తాను రూపొందించుకున్న సొంత శాసనం ఆధారంగా వ్యవహారాలు నడుపుతోందా అనేది ముందుగా తేల్చాలి. ఈ అస్పష్టత పునాదిపైనే సోషల్ మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. దీనివల్లే ఈ వేదికలు రాజకీయ నాయకులకు లోబడిపోతూ వారి క్రీడల్లో భాగమైపోతూ వస్తున్నాయి.
ఇక మూడవ ప్రశ్న.. విద్వేష ప్రసంగం వైపు మొగ్గు చూపినప్పుడు వ్యక్తి, సంస్థ లేదా ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. విద్వేష ప్రసంగానికి పాల్పడిన వ్యక్తిపైనా లేదా అతడు/ఆమె పనిచేస్తున్న సంస్థపైనా ఎవరిపై చర్య తీసుకోవాలి. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో స్పష్టత లేదు. ఇలాంటి ఘటనల పరిష్కారానికి ఒక నిర్దిష్ట చట్రం లేనంతవరకు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు కంటెంట్ ప్లాట్‌ఫామ్‌ల ఆంక్షలకు గురువుతూనే ఉంటారు. ఇది ఒక్కోసారి దేశ శాసనాలకు వ్యతిరేకంగా కూడా వెళుతుంది. ఉదాహరణకు ప్రతిపక్ష నేత ఖాతాను ట్విట్టర్ నిషేధిస్తే దానిపై సెన్సార్‌షిప్ విధించాలని గగ్గోలు మొదలవుతుంది. మరోవైపు, ఒక పాలకపక్ష నేత ఖాతాను నిషేధించినట్లయితే తీవ్ర ఒత్తిడితో చేసిన చర్యగా భావించవచ్చు.
సమీర్ శరణ్
వ్యాసకర్త ప్రెసిడెంట్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment