జన విశ్వాసమే మోదీ ఆయుధం | Ram Madhav Article On Narendra Modi Government | Sakshi
Sakshi News home page

జన విశ్వాసమే మోదీ ఆయుధం

Published Wed, Apr 22 2020 12:08 AM | Last Updated on Wed, Apr 22 2020 12:08 AM

Ram Madhav Article On Narendra Modi Government - Sakshi

కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. మోదీ ప్రజల్లో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్‌ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశారు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం.

హంగేరి దేశ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌–19)పై తన పోరాటానికి పార్లమెంట్‌ ఆటంకపరుస్తున్నదని భావించారు. పార్లమెంటులో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకుని అత్యవసర అధికారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశం లేని ఉత్తర్వుల ద్వారా హంగేరిని పాలిం చవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్థనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అనువుగా తీసుకుని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కిం చుకుని నియంతలుగా మారుతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయిక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్‌లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవడం తప్పలేదు. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణ నుండి స్వయంగా తప్పించుకోవడానికే ఈ చర్య తీసుకున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్‌లో లాక్‌డౌన్‌ ఉల్లం ఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు.

స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగి ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింప చేసుకోవడం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్‌ హాంకాక్‌ సాధారణంగా బ్రిటన్‌ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు. ఫిలిప్పైన్స్‌ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయ్‌ లాండ్‌ ప్రధానమంత్రి ప్రయూత్‌ చాన్‌ ఓచ్‌లు విశేష అధికారాలు కల్పించుకున్నారు. ఇటలీ, స్పెయిన్‌ దేశాలు వేలాది ప్రజ లను వేరువేరుగా ఉంచడానికి, క్వారంటైన్‌ చేయడానికి సైన్యంపై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబనాన్, మలేసియా, పెరూ మొదలైన దేశాలు ఆంక్షలను అమలు చేయడం కోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకురావలసి వచ్చింది. జర్మనీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసి వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇరవై వేలమంది సైనికులతో ‘కరోనా స్పందన సమూహాన్ని’ ఏర్పర్చింది. 

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బంధించే విశేషాధికారం కల్పించుకోవడానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నం చేసినా, అమెరికన్‌ కాంగ్రెస్‌ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుగారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్‌డౌన్‌ విషయంలో సర్వాధికారాలు ఉండ టంవల్ల దేశాధ్యక్షుడు ట్రంప్‌ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి. అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారతదేశంలో జరుగుతున్న దానితో పోల్చి చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారాల కోసమో అడుగలేదు. సెన్సార్షిప్‌ విధించడమో లేక విచారణ లేకుండా నిర్బంధించే చర్యలకో దిగలేదు. ప్రచార మాధ్యమాల గొంతు నొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది.

మోదీ సైన్యం సాయం తీసుకోవాలని అనుకోలేదు. ప్రజల ప్రాథమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్‌డౌన్‌ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీకి ఎవరో సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితిగా వర్ణించిన పరిస్థితుల్లో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడగలిగారు. కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం) ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు) జనతా జనార్దన్‌ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కరోనాపై తన పోరాట సమూహమని పేర్కొన్నారు.

దేశంలో సగం రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతనూ ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వసనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ సుయేమోల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. ‘ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజలచే’ ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుం టాం కానీ చాలా దేశాల్లో ప్రజలచేత విషయాలు నిర్వహించడం అనేది అరుదు. కానీ మోదీ దాన్ని మార్చివేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశాడు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. స్వచ్ఛ భారత్‌ పేరున పారిశుధ్యం కోసం చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుంచి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువగా క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనబరిచారు.

ఫ్రాన్సిన్‌ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచేత పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పర్చిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధపాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు. మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్టంగా కనబరిచారు. తబ్లిగీ జమాత్‌ మర్కజ్‌ అనే మతవర్గం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు తమతమ ప్రాంతాలకు తరలిపోవడం వంటి రెచ్చగొట్టడానికి ఆస్కారం ఉన్న సంఘటనలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లం ఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్యపద్ధతి నమూనాను మార్చుకోలేదు. మోదీ ప్రజల్లో సహజ సిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్‌ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది.

మోదీ విశ్వ మహమ్మారి కరోనాపై పోరును మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్లమంది ప్రజలను పాత్రధారులను చేశారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్ధతిని అవలంబిస్తూ ‘మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం’ అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు.
(వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం)


రాం మాధవ్‌ 
వ్యాసకర్త బీజేపీ ప్రధాన కార్యదర్శి,
ఇండియా ఫౌండేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement