ఈ ప్రశ్నలకు బదులేది? | Kommineni Srinivasa Rao Article On Nimmagadda Ramesh Kumar Decisions | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలకు బదులేది?

Published Wed, Feb 3 2021 12:53 AM | Last Updated on Wed, Feb 3 2021 3:49 AM

Kommineni Srinivasa Rao Article On Nimmagadda Ramesh Kumar Decisions - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాల్లో తాపత్రయపడుతున్నారు. కానీ ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి కమిషనర్‌ ఆయనే కావచ్చు. ప్రజాస్వామ్యబద్ధం అని చెబుతూనే ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బలవంతపు ఎన్నికలను ఆపడం సరేగానీ ఏకగ్రీవాలే జరగకూడదన్న చందంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో కేంద్రానికి లేఖ ఎలా రాశారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలకు ఆయనిచ్చే జవాబేమిటి? ఆయన వ్యవహార శైలితో వైఎస్సార్‌సీపీ ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారన్నది వాస్తవం.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వ్యవ హారం రోజుకో మలుపు తిరుగుతున్నట్లుగా కథ నడుస్తోంది. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు, వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్రమైందని చెప్పాలి. రెండు వ్యవస్థల మధ్య ఈ ఘర్షణ మంచిది కాదు. అయినా కొన్ని సార్లు ఇది తప్పకపోవచ్చు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం అవుతాయి.

నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహార శైలితో వైఎస్సార్‌సీపీ కొంత ఇబ్బంది పడుతున్న మాట నిజం. చీటికి మాటికి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం, ముఖ్యమైన అధికారులను బదిలీ చేశాననీ, అభిశంసించా ననీ ప్రకటనలు చేయడం, తన సొంత యాప్‌లు తయారు చేయడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం... ఇలాంటివన్నిటిని చేస్తున్న నిమ్మ గడ్డపై ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయ విమర్శలు చేయక తప్పని పరిస్థితి. అది మంచి పరిణామం అని ఎవరూ అనరు. కానీ ఆ అవ కాశం ఇవ్వడం నిమ్మగడ్డ తప్పు కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాలలో తాపత్రయ పడుతున్నారు. చివరికి తన హృదయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటూనే, ఆ తర్వాత పరిణామాలలో వచ్చిన కేసులలో తాను సాక్షినని కూడా వెల్లడించ డంలో వ్యూహం కనబడుతుంది. నిజానికి ఈ విషయాలు ప్రస్తావించ వలసిన అవసరం లేదు. అయినా ఆయన మాట్లాడారు.

మీడియా సమావేశంలో తను చెప్పదలిచింది చెప్పి, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మ గడ్డే కావచ్చు. అందులోనే ఆయన ప్రధాన బలహీనత కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో నిష్పక్షపాతంగా లేరేమోనన్న అనుమానం కలగడా నికి ఈ విషయం సరిపోతుంది. నిజం చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం లేదట. అదే అబద్ధం ఆడాలంటే చాలా ఆలోచన చేయాలట. ఎందుకంటే ఎప్పుడు ఏ అబద్ధం ఆడారో గుర్తుకు తెచ్చుకుని మరీ మాట్లాడాలి కాబట్టి అని ఒక నానుడి. నిమ్మగడ్డ అబద్ధాలు ఆడుతున్నా రని చెప్పడం లేదు కానీ, కొన్ని నిజాలు చెప్పలేకపోతున్నారన్నది వాస్తవం. తాను ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని చెబుతూనే ఏకగ్రీవ ఎన్నికలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బలవంతపు ఎన్నికలను ఆపడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో అసలు ఏకగ్రీవాలు జరగకూడదన్న చందంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏకగ్రీ వంగా ఎన్నికలు జరిగే గ్రామాలకు రివార్డులు ప్రకటిస్తే దాన్ని ఆయన తప్పు పట్టడంలో దురుద్దేశం కనిపిస్తోంది. పైగా ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలపై షాడో టీమ్‌లను పెడతామని కూడా బెదిరిస్తున్నారు. 

కొందరు అధికారులను భయపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్న ట్లుగా ఉంది. అన్నిసార్లు ఆయనదే పైచేయి కాదనడానికి ఉదాహరణ సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ బదిలీ తంతే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో గొడవ ఎందుకులే అని వారిద్దరిని ముందుగానే బదిలీ చేస్తే, ఆయన దాన్ని తోసిపుచ్చారు. ఆ తర్వాత వారిని అభిశంసించి ఎన్నికల విధులకు అర్హత లేదని ప్రకటిం చారు. కనీసం వివరణ అడగకుండా, కక్షపూరితంగా, ద్వేషంతో వ్యవ హరించారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? నిజం గానే వారు అనర్హులు అయివుంటే ప్రభుత్వం బదిలీ చేసినప్పుడు ఓకే చేస్తే సరిపోయేది కదా. వారిని కావాలని అవమానించి, చివరికి తాను అప్రతిష్ట పాలయ్యారు. ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన ఆదేశా లను తోసిపుచ్చింది. అసలు ఆ అధికారం ఈసీకి లేదని తేల్చింది. దాంతో వారిద్దరూ ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫ రెన్స్‌లో పాల్గొనడం అంటే ఎన్నికల కమిషనర్‌ చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లే కదా. దీనిపై ఆయన సరైన వివరణ ఇవ్వగలిగారా? 

ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాలలో కక్షలు వద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఎన్నికల ద్వారా ఏదో నాయకత్వం వచ్చేస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని కొత్త వాదన తెచ్చారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగినా, రిజర్వేషన్ల ప్రకారం ఎవరి పద వులు వారికే ఉంటాయి. ప్రజలకు ఆ విషయం తెలియదని కమిషనర్‌ ఉద్దేశం అనుకోవాలి. ఆయా జిల్లాలలో పర్యటిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారో అర్థం చేసుకో వచ్చు. ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే ఆయన నిష్పా క్షికతను అంగీకరించవచ్చు. 2018లో జరపవలసిన పంచాయతీ ఎన్ని కలను ఇప్పటివరకు ఆయన ఎందుకు జరపలేదు? చంద్రబాబు ప్రభు త్వాన్ని ఈ విషయంపై ఎందుకు కనీసం సంప్రదించలేదన్న ప్రశ్నకు సమాధానం వస్తుందా? అప్పుడు గ్రామ స్వరాజ్యం, ప్రజాస్వామ్యం మంట గలిసినా, రాజ్యాంగం అమలు కాకపోయినా ఫర్వాలేదా? వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎన్నికలు ఆరంభించి ప్రభుత్వంతో ఒక్క మాట చెప్పకుండా వాయిదా వేయడంలో ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వగలరా? 

రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో విమర్శలు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ ఎలా రాశారు? ముందు తాను ఆ లేఖ రాయలేదనీ, ఆ తర్వాత తానే రాశాననీ ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే అలా చెప్పారన్న ఆరోపణలకు రమేష్‌ కుమార్‌ ఇచ్చే జవాబు ఏమిటి? పార్క్‌ హయత్‌ హోటల్‌లో బీజేపీ నేతలను ఎందుకు కలిశారు? ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం తగ్గించడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఇవ్వడం, ఆ పరిణా మాలపై ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్లకు ఇచ్చిన కోట్ల రూపా యల ఫీజు ఎలా చెల్లించగలిగారు? కరోనా కేసులు లేనప్పుడు ప్రభు త్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసి, తదుపరి కరోనా కేసులు ఇప్పటికీ వందల సంఖ్యలో వస్తుంటే, వ్యాక్సినేషన్‌ జరుగు తున్న తరుణంలో ఎన్నికలు పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?

గత మార్చిలో మండల జెడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోగా, ఇప్పుడు వాటిని కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిపించడంలో ఉన్న కుట్ర ఏమిటి? తన పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తున్నందున, ఇప్పుడైతేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని, ఎన్నికల కోడ్‌ పేరుతో ప్రభుత్వాన్ని కదలకుండా చేయ వచ్చన్న ఉద్దేశం ఉందా, లేదా? అలా కాకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ ఆపాలనీ, రేషన్‌ సరుకులు ఇళ్లకు చేరే కార్యక్రమం చేపట్టవద్దనీ లాంటి ఆదేశాలు ఎందుకు ఇస్తారు? అలాగే వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పవలసిన అగత్యం ఏమిటి? వారి సేవలు వాడుకుంటే అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు లాభం కలుగుతుందని భావించడం కాదా?

పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తే దానిపై ఎందుకు కామెంట్‌ చేయలేదు? ఒక యాప్‌ పేరుతో ఎందుకు కొత్త హడావుడి చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలనీ; మంత్రులు బొత్స ,పెద్దిరెడ్డి విమర్శలు చేయకుండా నిలువరించాలనీ చెబుతున్న రమేష్, తాను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదనీ, ఏ పార్టీ తప్పు చేసినా చర్య తీసు కుంటాననీ ఎందుకు అనడం లేదు? పైగా గవర్నర్‌ను ప్రతిపక్షాలు కలి శాయనీ, వారు చేసిన ఫిర్యాదులను ప్రామాణికంగా తీసుకుంటాననీ పరోక్షంగా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధికార పార్టీ తప్పులు చేయవచ్చు. అలాగే ప్రతిపక్షాలూ చేస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం సాధారణంగా జరిగేదే.

కానీ ప్రతిపక్ష ఆరోప ణలకు వెంటనే స్పందిస్తున్న తీరు అనుమానాలకు తావివ్వదా? వైసీపీ నేతలు చేసిన విమర్శలకు నేరుగా సమాధానాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు? కడపలో వ్యూహాత్మకంగా వైఎస్సార్‌ని పొగిడిన రమేష్‌ కుమార్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి కేంద్రానికి రాసిన లేఖలో చేసిన ఆరోపణలు ఒక కమిషనర్‌ హోదాకు తగినట్లుగా ఉన్నాయా? సీబీఐ కేసుల గురించి ప్రస్తావించడం అంటే రాజకీయాలు మాట్లాడి నట్లు కాదా? తాను ఎలాంటి పనిచేసినా, అది రాజ్యాంగబద్ధం; ఎదు టివారు విమర్శలు చేస్తే అది హద్దులు దాటడమా? గవర్నర్‌ వైసీపీ ప్రముఖులపై చర్య తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరించ వచ్చా? కమిషనర్‌లో ఇన్ని బలహీనతలు ఉన్నా తనకు రాజ్యాంగ పరి రక్షణ ఉందని, న్యాయ వ్యవస్థలో తనకు పట్టు ఉందని భావించి ఇష్టా రాజ్యంగా నడిస్తే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా? రమేష్‌ కుమార్‌ నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి సిద్ధ మైతే అది ఆచరణలో చూపించాలి. నీతులు ఎదుటివారికే కానీ తమకు కాదన్నట్లు ఎవరు వ్యవహరించినా ప్రజలు వాస్తవాలు అర్థం  చేసుకుం టారన్నది వాస్తవం.

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement