చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్‌లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంటా బయటా సమస్యలనూ, విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. అమెరికా నేతృత్వంలో చైనాపై ఆంక్షలు మరింత పెరగడం, ఆసియాలో తన బలమైన పోటీదారైన భారత్‌కు పాశ్చాత్య పెట్టుబడులు తరలిపోతుండటం జిన్‌పింగ్‌కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలు జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీంతో పాలనా విధానాలు, సంస్కరణలపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు.
జీరో–కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్‌లో చైనావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్త డంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. ప్రజానిరసనల తర్వాత జిన్‌పింగ్ తన పాలసీని వదిలేయవలసి వచ్చింది. దీంతో చైనాలో కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల వేవ్స్ ఉద్ధృతంగా వ్యాపించాయి. నూతన సంవత్సర వేళ తాను చేసిన ప్రసంగంలో, తన జీరో–కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్‌పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది. ‘‘ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉండటం సహజం’’ అని పేర్కొన్నారు.
కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. వృద్ధులు, ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు. అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో జిన్‌పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది. దేశీయ శాంతి, సుస్థిరత, పాలనా నిర్వహణ జిన్‌పింగ్‌కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం. దీంతో తన పాలసీలపై విమర్శను అడ్డుకోవడానికి జిన్‌పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది.
ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా, తదితర దేశాలకు చేరువ కావడం కోసం చైనా మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ అనే ఊతపదాన్ని వదిలేసుకున్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు. శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో–కోవిడ్ పాలసీని జిన్‌పింగ్ సమర్థించుకున్నారు. ఇది దేశంలో కేసుల నిష్పత్తిని తగ్గించిందనీ, మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించివేసిందనీ చెప్పారు.
అయితే జి¯Œ పింగ్‌ను దుర్వార్తలు వెంటాడుతున్నాయి. 2022లో చైనా జనాభా 8.5 లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది. వరదలు, కరవుల కారణంగా, మావో అమలుపర్చిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం 1961లో కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. దారిద్య్రాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని 1979లో చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తోంది.
అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ యి ఫుక్సియన్ ప్రకారం, చైనాలో సంతాన సాఫల్య రేటు 1.3 శాతానికి పడిపోయింది. (జనాభా భర్తీ రేటు 2.1 శాతం). దేశం తన సంతాన సాఫల్య రేటును 1.2 శాతం వద్ద స్థిరపర్చగలిగితే చైనా జనాభా 2050 నాటికి 1.07 బిలియన్లకు, 2100 నాటికి 48 కోట్లకు పడిపోతుంది. జనాభా తగ్గి పోవడం అంటే... ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటం, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం, సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం, పొదుపు మొత్తాలు తగ్గిపోవడం, వీటికి మించి వస్తూ త్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రజల కొను గోలు శక్తి సన్నగిల్లిపోవడం, ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం.
పైగా దేశ వస్తూత్పత్తి రంగం, వ్యవసాయం, శ్రమశక్తి, సామగ్రి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలను దింపాలని చైనా పథకరచన చేసింది. అయితే ఇప్పటికే ప్రతి 10 వేలమంది ప్రజలకు 322 రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు. ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్–2022 ప్రకారం రోబోల వినియోగంలో అమె రికాను చైనా అధిగమించడమే కాక, ప్రపంచంలో రోబోల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది.
నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలకు సంబంధించిన వార్తలు కూడా జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీనికి తోడు చైనాను ‘కనీవినీ ఎరుగని వ్యూహాత్మక సవాలు’గా అభివర్ణించిన జపాన్ 2027 నాటికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 2 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. అంతేకాక చైనాకు, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ కొత్త క్షిపణులు, మానవ రహిత వ్యవస్థలకు చెందిన టెక్నాలజీలు, సైబర్ స్పేస్, అంతరిక్షం, ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్, కృత్రిమ మేథ వంటి ఎదురుదాడి సామర్థ్యాలను మిక్కుటంగా సేకరించనుంది.
2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 26 లక్షల డాలర్లకు చేరుకుంటుందనీ, 2025 నాటికి చైనా నుంచి 25 శాతం అమెరికన్ సెల్‌ఫోన్ల ఉత్పత్తిని భారత్‌కు తరలించాలనీ అమెరికా సెల్‌ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకటించిన అంచనాలు జిన్‌పింగ్‌కి సంతోషం కలిగించవు. ఆసియా ప్రాంతంలో భారత్ పురోగతిని అడ్డుకుని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని చైనా ఇప్పటికే లక్ష్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపర్చడానికి భారత్ – అమెరికా పొత్తు పెట్టుకోవడం మరో ఉదాహరణగా జిన్‌పింగ్ అభిప్రాయ పడవచ్చు.
ఈ అన్ని పరిణామాల వెలుగులో అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా జిన్‌పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు. మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత, ద్రవ్యవ్యవస్థ, పర్యావరణ మార్పు తదితర మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు సమ్మతి తెలియజేశారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న విమర్శలను కూడా తీవ్ర పద జాలంతో తిప్పికొట్టే ధోరణిని జిన్‌పింగ్ మంత్రులు ఇప్పుడు పక్కన పెట్టేశారు. తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ, ఫ్రా¯Œ ్స, ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా చైనా తహతహలాడుతోంది.
గ్లోబల్ పెట్టుబడికీ, మార్కెట్ సంస్కరణలకూ తలుపులు తెరిచి మార్పునకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు వెలువరించడంలో భాగంగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని, తన పూర్వ ఆర్థిక సలహాదారు అయిన లియూ హేని చైనా అధ్యక్షుడు పంపించారు. పాశ్చాత్య బడా కంపె నీలకు లియూ హే సుపరిచితుడు కావడం విశేషం. అయితే 2022 అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ సందర్భంగా లియూ హేని పోలిట్ బ్యూరో పదవి నుంచి జిన్‌పింగ్ తొలగించడం విశేషం.
అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అవలంబించిన లోపభూయిష్ఠ విధానాల కారణంగా అమెరికా, పలు యూరోపియన్, ఆసియా దేశాల, కంపెనీల విశ్వాసం దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడే ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్‌పింగ్ విధానాల్లో వెనుకడుగు వేస్తున్నారనీ, తన వైఖరిని మార్చుకుంటున్నారనీ విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి. జిన్‌పింగ్ దూకుడునూ, ఆధిపత్యాన్నీ ప్రతిఘ టించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా ఇవి గతంలోనే నిర్ణయించుకున్నాయన్నది గమనార్హం.
యోగేశ్ గుప్తా
వ్యాసకర్త మాజీ రాయబారి
(‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment