ఒక పత్రిక ఒక గాలి వార్త రాస్తుంది. చానళ్లు కొన్ని చర్చలు పెడతాయి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ దానిని అందుకుంటుంది. దానిని మరో మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇలా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతు లేదా కుట్రల పర్వం ఇంకెంతకాలం సాగుతుందో చూడాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వస్తున్నన్ని కథనాలు బహుశా మరే సీఎంపైనా వచ్చి ఉండకపోవచ్చు. కరోనా సమయంలో కొంత అప్పు ఎక్కువ చేసి, పేదలను ఆదుకునే చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకోకపోతే... ఇదే మీడియా కానీ, తెలుగుదేశం కానీ నానా గగ్గోలు పెట్టేవి. ప్రతి విషయంలోనూ వ్యతిరేక కథనాలు అల్లడంలో ఒక వర్గం మీడియా తీరు నేడు పరాకాష్ఠకు చేరిందనే చెప్పాలి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వస్తున్నన్ని కథనాలు బహుశా మరే ముఖ్యమంత్రిపైన వచ్చి ఉండకపోవచ్చు. నిజంగానే జగన్ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే వార్తలు ఇవ్వడం ఆక్షేపణీయం కాదు. కానీ నిత్యం ద్వేషం, కసి, తాము కోరుకున్న నేతకు సీఎం పదవి దక్కకపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ ఆయా ఎన్నికలలో దారుణంగా పరాజయం చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ప్రతిదానిని వివాదం చేయడమో, లేక వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమో చేస్తున్నారు. నిజంగానే జర్నలిజం విలువలకు అనుగుణంగా వార్తలు ఇస్తే, దానిని బట్టి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం నేతలు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, వాటిపై అధికారులు కేసు నమోదు చేస్తే వాటిని కక్షపూరితం అని ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని జీఓ ఇచ్చిన వెంటనే అమ్మో.. అలా జరిగిపోతోంది.. ఇలా జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతూ కథనాలు వండి వార్చుతున్నాయి.
కొద్దికాలం క్రితం మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి సంబంధించిన మైనింగ్ లీజులో అక్రమాలు జరిగాయని అధికారులు వంద కోట్ల జరిమానా విధించారు. కానీ దానిని టీడీపీ మీడియా కక్ష అని ప్రచారం చేశాయి. అదే సమయంలో విశాఖలో లాటరైట్ ఖనిజానికి సంబంధించిన లీజు ఇవ్వగానే ఇంకేముంది.. చెట్టుకొట్టేస్తున్నారు.. బాక్సైట్ తవ్వేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. తెలుగుదేశం నేతల బృందం ఒకటి పర్యటించి చాలా అక్రమాలు జరిగినట్లు ఆరోపిం చింది. దీనిపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వివరణ ఇచ్చారు. అది హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఇచ్చారని, గత ప్రభుత్వ హయాంలో ఆరు లీజులు ఇచ్చారని వివిధ కారణాలతో ఐదు నాన్ ఆపరేషనల్ అయ్యాయని ఆయన వివరించారు. దీనిపై నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. అయ్యన్నపాత్రుడు టైమ్‌లో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలు బయటకు వస్తాయని, అందుకే తప్పుడు ఆరోపణలతో వారు ముందస్తు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ మీడియాకు మాత్రం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించలేదట. ఇలా ఉంటుంది వారి శైలి.
మరో ఉదాహరణ చూద్దాం. ఏపీ ప్రభుత్వం 41 వేల కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన వివరాలను సరిగా నమోదు చేయలేదనో, సాంకేతికంగా వేరే పద్ధతి అనుసరించారనో కాగ్ వివరణ కోరింది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవలసిన బాధ్యత మీడియాకు ఉంటుంది కదా. పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ దానిపై అధికారుల వివరణ తీసుకుని, పీఏసీ మీటింగ్‌లో చర్చించిన తర్వాత గవర్నర్ కు ఫిర్యాదు చేసినా, లేదా మీడియాకు చెప్పినా తప్పుకాదు. అదేమీ చేయకుండానే ఆయన ప్రెస్‌కు ప్రకటన ఇచ్చారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ పై ఆరోపణపై ఖండనతో కూడిన వివరణ ఇచ్చారు. మరి ఇదే తెలుగుదేశం హయాంలో ఏభైవేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖాతా నుంచి పీడీ ఖాతాలకు మరల్చి దుర్వినియోగం చేశారని అప్పట్లో బీజేపీ ఎంపీ జేవీఎల్ నరసింహా రావు ఆరోపణలు చేస్తే ఇంతవరకు దానిపై టీడీపీ వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. అలాగే టీడీపీ మీడియా కూడా దానిని కప్పిపుచ్చేయత్నం చేసింది.
రాష్ట్రం అప్పులు చేస్తే అప్పు చేసిందని, కేంద్రం ఏదైనా వివరణ అడిగితే షాక్ ఇచ్చిందని రాయడం పెద్ద ఫ్యాషన్ అయింది. కరోనా సమయంలో కొంత అప్పు ఎక్కువ చేసి, పేదలను ఆదుకునే చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకోకపోతే, ఇదే మీడియా కానీ, తెలుగుదేశం కాని నానా గగ్గోలు పెట్టేవి. ఇతర రాష్ట్రాలలో అసలు అలా పేదలకు ప్రత్యేకంగా ఏదో పథకం ద్వారా ఆర్థిక సాయం అందించకపోయినా, అక్కడ కిక్కురు మనని మీడియా, ఏపీలో మాత్రం ప్రతి విషయంలోను వ్యతిరేక కథనాలు అల్లుతోంది. సుమారు లక్షన్నర మందికి గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇస్తే, వాటిని పట్టించుకోని తెలుగుదేశం కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కానీ, ఉద్యోగాల క్యాలెండర్‌పై ఎంత హడావుడి చేశాయో గమనించాం. ఎక్కడైనా పదిమంది టీడీపీనో, మరోపార్టీ కార్యకర్తలో నిరసన తెలిపితే, మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోయినట్లుగా మొదటి పేజీలలో సచిత్ర కథనాలు ఇచ్చాయి. నిరుద్యోగులకు భృతి ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పి నాలుగేళ్లపాటు ఇవ్వకపోయినా, ఎన్నడైనా ఈ మీడియా ఆ విషయాన్ని గుర్తు చేసిందా?
వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీకి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల మధ్య జరిగిన చాటింగ్ వివరాలు చూస్తే కుట్రల స్వభావం అర్థం అవుతుంది. దీనిలో ఒక వర్గం మీడియా కూడా భాగస్వామి అవుతోందన్న భావన ఏర్పడుతోంది. ఈ విషయాలు బయటకు వచ్చాక టీడీపీతోపాటు వారికి మద్దతు ఇచ్చే మీడియా గప్‌చుప్ అయిపోయిన తీరు అందుకు ఆస్కారం ఇస్తుంది. సీఐడీ ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు ఆశ్చర్యం కలిగించేవే. వేరే పార్టీ ఎంపీని టీడీపీ అధినేత తన పావుగా మార్చుకోవడం, చివరికి సీఎం జగన్ బెయిల్‌ను ఎలా రద్దు చేయించాలన్నదానిపై కలిసి పనిచేయడం ఇవన్నీ కుట్రకోణాన్ని స్పష్టపరుస్తున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. మామూలుగా అయితే న్యాయ వ్యవస్థలో చీమ చిటుక్కుమన్నా, అది కూడా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే పెద్ద ఎత్తున కథనాలు రాసే ఈ మీడియాకు సుజనా చౌదరి దందా వంటివి కనిపించకపోవడం వారి దృష్టిలోపమా? లేక తమవారిపట్ల వల్లమాలిన అభిమానమా?
ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. విశాఖలో కొన్ని ప్రభుత్వ భూములు అమ్మాలనో, తనఖా పెట్టి రుణం తీసుకోవాలనో ఏపీ ప్రభుత్వం భావించింది. దాంతో టీడీపీ మీడియా రెచ్చిపోయి విశాఖ ఫర్ సేల్ అంటూ పిచ్చిగా కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా హడావుడి చేశాయి. కొందరు కోర్టుకువెళ్లి ఆపే యత్నం చేస్తున్నారు. అదే మీడియా హైదరాబాద్‌లో భూములు అమ్ముతుంటే, కాసుల పంట అని రాశాయే కానీ, హైదరాబాద్ ఫర్ సేల్ అని ఎందుకు రాయలేదు. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపజాలమని స్పష్టం చేసింది. మరి దీనికి ఏమి చెబుతారు? ఏపీలో రోడ్లు పాడైపోయాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఒక మీడియా వరుస కథనాలు ఇచ్చింది. రోడ్లు రిపేరు చేయాలని వార్తలు ఇవ్వడం మంచిదే. కానీ ఒక పక్క వర్షాలు కురుస్తుంటే రోడ్ల మరమ్మతులు ఎలా జరుగుతాయో ఆ మీడియా వివరించాలి కదా! దీనిపై సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్య వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు చంద్రబాబు ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు నిజంగానే రోడ్లు వేసి ఉంటే ఇంత త్వరగా పాడైపోయాయంటే అంత నాసిరకంగా వేశారా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒకటికి రెండుసార్లు వార్తలు ఇచ్చారు. బాగానే ఉంది. కాని దానికి కేంద్రాన్ని ప్రశ్నిస్తారా? లేక ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తారా? ఒక పత్రిక ఒక గాలి వార్త రాస్తుంది. చానళ్లు కొన్ని చర్చలు పెడతాయి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ దానిని అందుకుంటుంది. దానిని మరో మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తుంది. ఇలా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతు అనండి, కుట్రల పర్వం అనండి.. ఇంకెంతకాలం సాగుతాయో చూడాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment