మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందించడం ద్వారా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసాన్ని పొందలేవు. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్ది నెలల పాటు ర్యాలీలను నిర్వహించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులూ పోటీపడేలా రాజకీయాలను మార్చేశాయి. సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే ప్రతిపక్షాలకు ప్రయోజనకరం.
భారతదేశ రాజకీయ పరిదృశ్యాన్ని బీజేపీ ఎంతగా మార్చివేసిందనే అంశాన్ని ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు మరోసారి చర్చకు పెట్టాయి. ఎన్నికల ఫలితాలను ఇస్లామోఫోబియా అనే యధాలాప నిర్ధారణతో తేల్చి పడేయడం కంటే ఆ ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే అందరికీ ప్రయోజన కరం. ఇస్లామోఫోబియా అనే భావన అనేక వర్ణనలు, వ్యూహాలతో కలిసి ఉంటుందని మనం అర్థం చేసు కోవాలి. ఇలాంటివన్నీ ఏకకాలంలో ప్రభావం కలిగిస్తుంటాయి. బీజేపీ దీర్ఘకాలంగా మనగలుగుతుండటానికి కారణం– సామాజిక, సాంస్కృతిక అంశాలు, రాజకీయాలను కలగలపడమే. మెజారిటీ వాదాన్ని ఎత్తిపట్టడం, నిర్మొహమాటంగా ముస్లింల పట్ల మినహా యింపులు కలిగి ఉండటం కొనసాగిస్తున్నప్పటికీ, దేశంలో సాంస్కృ తిక అంశాల గురించి ఆలోచించే సమర్థత కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే అని ఒప్పుకోవాలి.
సామాజిక రంగాన్ని చర్చించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏదన్నది ప్రతిపక్షాల ముందు ప్రశ్నగా నిలుస్తోంది. సంస్కృతి గురించిన చర్చను పక్కన పెట్టడం లేదా దానితో ఆటాడటం పైనే లౌకిక పార్టీలు సతమతమవుతున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీనే కావచ్చు, కానీ సంస్కృతిపరమైన, మతపరమైన వ్యత్యాసాల విష యంలో ఏం చేయాలని తాను కోరుకుంటోందో దాన్ని చేయగల స్థానంలో ఆ పార్టీ ఉంది. తన సాంస్కృతిక ప్రతీకాత్మత ద్వారా ఒక లోతైన అర్థాన్ని ఆ పార్టీ ప్రతిపాదిస్తోంది. మతపరమైన ద్వేష భావా నికి బీజేపీ ప్రజల నుంచి ఆమోదం పొందగలగడంలో వారి ఉనికికి సంబంధించిన భావన పనిచేస్తోంది. ఇలాంటి సానుకూలత ప్రతిపక్షా నికి అసలు లేదు.
ముజఫర్ నగర్ దాడుల విషయంలో సమాజ్ వాదీ పార్టీ మౌనం పాటించింది. కాంగ్రెస్ కూడా దీనికి భిన్నంగా లేదు. ప్రతిపక్షం ఇక్కడినుంచే ప్రారంభం కావలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను పొందడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రతిపక్షం చర్చకు పెట్టాలి. వివిధ సామాజిక బృందాలను అవి ఏకం చేయాలి. క్రాస్ కల్చరల్ చర్చలను నిర్వహించి, ఉద్రిక్తతలను తగ్గించాల్సి ఉంది. రెడీ మేడ్‌గా అందుబాటులో ఉండదు కాబట్టి ఒక కొత్త దార్శనికతను ప్రతిపక్షాలు నిర్మించాల్సి ఉంది. భారత్‌లో రాజ్యాంగపరమైన నీతి అనేది ఉనికిలో లేదు కాబట్టి, దాన్ని నిర్మించాల్సి ఉందని అంబేడ్కర్ ఏనాడో సూచించారు. సౌభ్రాతృత్వం అనేది రాజ్యాంగపరమైన సూత్రంగా ఉండదని ఆయన చెప్పారు. నిర్దిష్ట వాస్తవికత నుంచి చేయ వలసిన అలాంటి నిఖార్సయిన పరిశీలనలు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించడానికి ప్రారంభ బిందువుగా ఉంటాయి.
హిందూ–ముస్లిం సంబంధాలు ఎలా ఉండాలి? రాబోయే దశా బ్దాల్లో కులాంతర సంబంధాలు ఎలా ఉండాలి? సామాజిక అంత రాలు, దురభిప్రాయాలను పట్టించుకోకుండా రాజకీయ పొత్తులతో అతుకులేసే రోజులు పోయాయి. ఇది బీజేపీ విజయంలోనే కాకుండా, మజ్లిస్, బీఎస్పీ పార్టీల పరాజయంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఆహ్వానించదగిన మార్పు. మతపరమైన వాక్చాతుర్యం రెడీమేడ్‌గా ఎవరికీ అందుబాటులో ఉండదు. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు దాన్ని నిర్మించాయి.
కోవిడ్–19 మహమ్మారిని అదుపు చేయడంలో బీజేపీ ప్రదర్శిం చిన నిర్లక్ష్యాన్ని మనం తప్పుపట్టవచ్చు. కానీ అఖిలేశ్ యాదవ్ కూడా దీనికి భిన్నంగా లేరు మరి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పుడు అఖిలేశ్ కనిపించకపోవడం కూడా వ్యతిరేక భావనలను కలిగించింది. తాము విజయం సాధించడానికి ఇతరుల వైఫల్యాలను ఏకరువు పెట్టడం ఒక్కటే మార్గం కాదు. ఏం చేసినా తాము పడి ఉంటామనే భావనను ప్రజలు సవాలు చేస్తున్నారు. మారుతున్న మనోభావాలకు ప్రతిస్పం దించడం ద్వారా బీజేపీ ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యా మ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందిం చడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసాన్ని పొందలేరు. పశ్చాత్తాపానికి చెందిన నిజమైన చర్యగా, నీళ్లు నిండిన కళ్లతో ప్రతిపక్షాలు జనం ముందుకు రావాలి. తాము పశ్చాత్తాపపడుతున్న ఉద్దేశాన్ని ప్రదర్శి స్తూనే వారు నేరుగా ప్రజలముందు స్పందించాలి. ప్రతిపక్షాలు ఇక్కడ పొందిన వైఫల్యమే పాలకపక్షం విజయంగా మారిపోయింది.
ఎన్నికలు సమీపిస్తుండగా కొద్దినెలల పాటు ర్యాలీలను నిర్వ హించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులు పోటీపడేలా రాజకీయాల యాంటె న్నాను మార్చిపడేశాయి. ఫలితాలకు అతీతంగా నిజాయితీగా పని చేయడానికి ఇప్పుడు ఇదే కొలమానమైపోయింది. ప్రజల దృష్టిలో కష్టించి పనిచేసేవారికే విలువ ఉంటుంది. అనియత రంగంలో పని చేసేవారే మనదేశంలో ఎక్కువమంది కాబట్టి రాజకీయాల్లో విరామం లేకుండా పనిచేసేవారిని సులభంగా గుర్తిస్తారు. ఒక్క మమతా బెనర్జీ తప్ప ఉత్తరాదిన ప్రతిపక్షాల్లో ఏ ఒక్క నాయకుడూ ప్రజల దృష్టిలో ఇలాంటి ఇమేజ్‌కి దగ్గర కాలేకపోయారు. సామాన్య ప్రజలతో మమేకం కావడం గొప్ప సెంటిమెంటును కలిగిస్తుంది. ప్రజల రోజువారీ జీవితాలను స్పృశించకుండా, సంవత్సరంపాటు ప్రజలతో మమేకం కాకుండా ఉండివుంటే బీజేపీకి ఇంత చక్కటి విజయాలు లభ్య మయ్యేవి కాదు.
కులమత ప్రాతిపదికనే బీజేపీ రాజకీయం చేస్తోందన్నది వాస్తవమే కావచ్చు గానీ కుల మతాలకు అతీతంగా బీజేపీ ఈ దఫా ఎన్నికల్లో స్వరం పెంచడం దానిపట్ల సానుకూలతను పెంచింది. అయితే కులనిర్మూలన వంటి గంభీర పదాల జోలికి వెళ్ళకుండా ఆధిపత్య రాజకీయాల నుంచి బయటపడాలని చెబుతూ వచ్చింది. ఒక పార్టీకి, వ్యక్తికి మేలు చేసే తరహా కుల రాజకీయాలు తాను చేయ లేనని బీజేపీ గట్టిగా చెప్పింది. చరణ్‌జీత్ సింగ్ చన్నీ, మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు ఈ ఎన్నికల్లో ఎందుకు వెనుక బడ్డారంటే తమది ఫలానా కులమనీ, మతమనీ ముద్ర వేయించు కుంటే నడిచే రాజకీయాలకు ఇప్పుడు కాలం కాదు. సామాజిక న్యాయం కుల ప్రాతినిధ్యంతో ఇక సిద్ధించదు. అలా ఎవరైనా చెబితే జనం నమ్మే పరిస్థితి పోయింది. మన సమాజం అంతరాలతో కూడిన అసమానతల సమాజం అని డాక్టర్ అంబేడ్కర్ మనకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. వీళ్ల కోసం పనిచేయడమే, వీరికి మేలు చేకూర్చడమే నిజమైన మార్పునకు దారితీస్తుంది.
తాజా అసెంబ్లీ ఎన్నికలను ఆర్థిక కష్టాలపై సంస్కృతి విజ యంగా భావించలేం. దానికి బదులుగా ఆర్థిక అవసరాలు సాంస్కృ తిక సులోచనాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సాంస్కృతిక విలువల పునాదిపైనే తన ఆర్థిక కార్యక్రమాలను తీసుకొచ్చింది. బీజేపీ ఉజ్వల పేరుతో పథకం ప్రకటించిందిగానీ సిలిండర్‌ని రీఫిల్ చేసుకోవాల్సిన బాధ్యతను లబ్ధిదారులపైనే పెట్టింది.
విమర్శనాత్మక చింతనాపరుడు రేమాండ్స్ విలియమ్స్ ఒక విష యాన్ని స్పష్టంగా చెప్పారు. సమాజంలో నిజమైన మార్పును తీసు కొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇన్నాళ్లుగా మన ప్రతిపక్షాలు చేస్తూ వచ్చింది– నిరాశాజీవులకు నచ్చచెబుతూ రావడమే! ఊరకే బాధల గురించి ట్వీట్ చేయడం, నరేంద్ర మోదీ తప్పుల గురించి ఊదరగొట్టడం అనేవి ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించిపెట్టవు. మెజారిటీ ప్రజల్లోని నిరాశకు మార్గాన్ని చూపిస్తూనే, జాతీయ భంగిమను ప్రదర్శించడం ద్వారా మోదీ ఏకకాలంలో అటు పాలకుడిగానూ, ఇటు ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. అదే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి అసలు కారణం!
అజయ్ గుడవర్తి
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, జేఎన్‌యూ, ఢిల్లీ
(‘ద వైర్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment