
భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్‌లా చంద్రబాబు మార్చకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేది! అందుకే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖలో అసమానాభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ప్రభుత్వానికి పాడి ఆవులా ఉందని అనుకోవాలి. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఒక్క హైదరాబాద్ నగరం ద్వారానే వచ్చే కొద్ది నెలల్లో ప్రభుత్వానికి సుమారు 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని పత్రికలు ఈ మొత్తం 30 వేల కోట్లకుపైగానే ఉంటుందని కథనాలు ఇస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలలో కచ్చితంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పలేకపోయినా, భారీగానే ప్రభుత్వానికి ఆర్జన రానుందని అర్థం అవుతుంది. ప్రధానంగా అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ బాగా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.5 లక్షల దరఖాస్తులు ఎల్.ఆర్.ఎస్.కోసం వచ్చాయి. వీటిలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో లక్షకు పైగా ఒక్కోచోట నుంచి వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. ప్రభుత్వం తొలుత పదివేల కోట్ల రూపాయల ఆదాయం దీనిద్వారా వస్తుందని అనుకుంటే, అంతా సజావుగా జరిగితే ఈ పద్దులో ఇరవైవేల కోట్ల రూపాయల పైగానే రావచ్చని చెబుతున్నారు. ఇక ఖాళీ స్థలాలపై పన్ను, రిజిస్ట్రేషన్ విలువల పెంపు వంటివి స్థూలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం రింగ్ రోడ్లకు అత్యంత సమీపాన కోకాపేట వంటి ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఇప్పటికే 2,700 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ భూముల అమ్మకంపై ప్రతిపక్షం విమర్శలు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైనా పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వాటిని ఖండించింది. అది వేరే కథ. హైదరాబాద్ వంటి రాజధాని తెలంగాణకు ఖజానా వంటిదని చెప్పాలి. ఎందుకంటే వాణిజ్య పన్నుల రూపేణా, మద్యం షాపుల ఎక్సైజ్ ఆదాయం ద్వారా, తాజాగా భూముల రెగ్యులరైజేషన్ , రిజిస్ట్రేషన్ వంటి వాటిని ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పడూ చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయినట్లో కాదో కాని, హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆయన చెప్పింది చాలావరకు కరెక్టు అని అంగీకరించాలి. ఉమ్మడి ఏపీకి రాజధానిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఏపీ, తెలంగాణలోని హైదరాబాదేతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. అనేక మంది రకరకాల వ్యాపారాలు చేపట్టారు. దానికి తోడు ఐటీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం కలిసి వచ్చింది. దేశంలో ఇలా నాలుగువైపులా విస్తరించే నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కోకాపేట వంటి చోట్ల ఎకరం అరవైకోట్ల వరకు వెళ్లిందని అనుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ భూములు ఇలా అమ్మేస్తే భావితరాలకు, వారి అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి. భూముల అమ్మకం కేసీఆర్‌తోనే మొదలు కాలేదు. హైకోర్టు కూడా ఈ భూముల అమ్మకాన్ని ఆపలేదు. ఆక్రమణలకు గురయ్యేకన్నా అమ్మడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనలు వాస్తవరూపం దాల్చి ఒక్కసారిగా ముప్పైవేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరితే ప్రభుత్వం పంట పండినట్లే అనుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో పడిపోయిన ఆదాయాన్ని ఈ రకంగా సమకూర్చుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అదృష్టంగా అనుకోవచ్చు.
ఇది హైదరాబాద్ కథ అయితే ఏపీలో అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల డబ్బు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అప్పట్లో సంకల్పించారు. వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్‌లా మార్చారు. దానివల్ల ప్రభుత్వంకన్నా ప్రైవేటు వ్యక్తులకే అధికంగా మేలు కలిగింది. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఒక మాట చెప్పేవారు. రైతుల నుంచి సమీకరించిన భూములలో ప్లాట్లు వేసి, మౌలిక వసతులు సమకూర్చి, ప్రభుత్వ అవసరాలకు వాడుకోగా ప్రభుత్వం అమ్ముకోవడానికి మిగిలేది పెద్దగా ఉండదని అనేవారు. పైగా అటవీభూములతో సహా సుమారు ఏభైవేల ఎకరాల మేర విస్తీర్ణం అభివృద్ధి కావాలంటే పాతిక, ముప్పై ఏళ్లు పట్టవచ్చన్నది ఒక అభిప్రాయం. చంద్రబాబు ఈ రియల్ ఎస్టేట్ మోడల్‌లో కాకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసి అమ్మే విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేదేమో! చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించి, ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేస్తే, మిగిలిన రాష్ట్రం అంతా అన్యాయం అవుతుందని భావించి మూడు రాజధానులను ప్రతిపాదించింది.
వీటిలో తెలివైనది విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవడం. కోర్టుల ద్వారా ఇతరత్రా అడ్డంకులు రాకపోతే, విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అటు విజయనగరం శ్రీకాకుళం వైపు, ఇటు అనకాపల్లి, తుని వైపు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ భూములు కూడా గణనీయంగానే ఉన్నాయి. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు. అక్కడకు ఇప్పటికే ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిస్తే, హైదరాబాద్ మాదిరే అది కూడా ఏపీకి మంచి ఆదాయ వనరు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే పలు పరిశ్రమలు ఉన్నాయి. ఐటీతో సహా వివిధ రంగాల పరిశ్రమలు అక్కడకు వస్తే నగరం ఊపు అందుకుంటుంది. అయితే హైదరాబాద్‌లో అంతా కేంద్రీకరణ అవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఒక వైపు కోకాపేటలో భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగిందని సంతోషించే పరిస్థితి అయితే, మరో వైపు కాస్త భారీ వర్షాలు వస్తే వందల కాలనీలు వరదనీటిలో నానే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధనిక ప్రాంతాలు పెరుగుతున్నాయని అనుకునే లోపే పేదవాడలు కూడా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో కోకాపేట తదితర ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. విశాఖలో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు.
హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం ఏపీకి పెద్ద లోటే కావచ్చు కానీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ–గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు వంటి నగరాలు ఉండటం కూడా ఉపయుక్తమే. కాకపోతే వాటిని సరైన దిశలో అభివృద్ధి చేసుకోగలిగితే ఏపీ కూడా హైదరాబాద్‌లాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అప్పట్లో అంతా ఒకేచోట కేంద్రీకరించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు, ఇతరులు పదేపదే అడ్డుపడుతున్నారు. ఏపీలో ఉన్న నగరాలకు కొన్ని బలాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే తమిళనాడులో మాదిరి ఆయా నగరాలకు గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు చెన్నై రాజధాని అయినా, కోయంబత్తూరు, సేలం, మదురై తదితర నగరాలు బాగా వృద్ధి చెందాయి. ఒక్కో నగరం ఒక్కో రంగంలో విశిష్టత పొందింది. ఈ అనుభవాలను అధ్యయనం చేసి ఏపీలోని నగరాలను కూడా తీర్చిదిద్దాలి. కాని విశాఖ అభివృద్ధికే ప్రతిపక్షం అడ్డుపడుతోంది. న్యాయ వ్యవస్థ ద్వారానో, మరో రకంగానో ప్రతి విషయంలో ఆటంకాలను సృష్టిస్తోంది. వీటన్నిటిని అధిగమించి జగన్ ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంది.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment