ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ స్టైలే వేరు.. ఆయన తన కంచు కంఠంతో సభికులను ఆకట్టుకోవడానికి కొత్త,కొత్త ట్రిక్స్ కూడా వేస్తుంటారు.తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో బీజేపీ సభలో ఆయన చేసిన ప్రసంగం గమనిస్తే తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయన ఈసారి కొత్త డైలాగుతో వచ్చినట్లుగా ఉంది. తెలుగులో నా కుటుంబ సభ్యులారా! అంటూ పలుమార్లు ఉచ్చరించి తను చెప్పదలచుకున్న పాయింట్ చెప్పడం కొత్తదనంగా ఉంది. దీనికి సభికుల నుంచి మంచి స్పందన కూడా కనిపించింది. బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోయిందని భావిస్తున్న తరుణంలో మోదీ చేసిన ప్రయత్నం పరిస్థితిని కొంత మెరుగుపరచవచ్చు.
✍️ఎందుకంటే ఆయన ఏకంగా తెలంగాణకు 13500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను, అభివృద్ది పనులను మంజూరు చేశారు. ములుగు లో గిరిజన యూనివర్శిటీకి ఓకే చేయడమే కాకుండా సెంటిమెంటుగా ఆయన సమ్మక్క-సారలమ్మ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ప్రత్యేకించి నిజామాబాద్ ప్రాంతంలో పసుపుబోర్డు గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఎమ్.పి ధర్మపురి అరవింద్ ను పలుసార్లు రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ విషయమై నిలదీస్తుంటారు.
✍️ఇప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని ఆయన చూపించారు.జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.మరికొద్ది రోజులలో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన కొంత అభివృద్ది,మరికొంత రాజకీయం కలగలిపి ప్రసంగం చేశారు. అయితే ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కాని, ఆయా ప్రత్యర్ది రాజకీయ పార్టీల పేర్లు గాని పెద్దగా ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందని,ఆయన ఆరోపించారు. తెలంగాణలో బిఆర్ఎస్ కారు స్టీరింగ్ ను ఎవరు నడుపుతున్నారో అందరికి తెలుసు అంటూ, కుటుంబ పార్టీలు అని విమర్శలు చేశారు. బీజేపీ సామాన్య ప్రజల కుటుంబాల కోసం పనిచేస్తుంటే, ఈ రెండు పార్టీలు తమ కుటుంబం కోసమే పనిచేస్తున్నాయని ఆయన ద్వజమెత్తారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ లపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు.
✍️కాంగ్రెస్, బిఆర్ఎస్‌లు కరప్షన్, కమిషన్ పార్టీలని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వ్యాఖ్యానిస్తూ అన్ని కీలక పదవులలోను వారి కుటుంబ సభ్యులే ఉంటారని, కేవలం కింది సిబ్బంది మాత్రమే బయటివారిని పెట్టుకుంటారని ఆయన ఎద్దేవ చేశారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద చూపిందని చెప్పడానికి యత్నించారు.రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఇరవైఏడువేల కోట్లు వెచ్చించిందని ఆయన తెలిపారు. కొత్తగా తలపెట్టిన వరంగల్- విజయవాడ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అది పూర్తి అయితే భారీ ఎత్తున పరిశ్రమలు వస్తాయని అన్నారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీని పునరుద్దరించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల రిజర్వేషన్లపై చట్టం చేసిన విషయం గురించి ప్రముఖంగా చెప్పడానికి మోదీ యత్నించారు.
✍️అలాగే రైతులు,తదితర వర్గాల అంశాలను చెప్పి బీజేపీ విధానాలు, తను వారి అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను వివరించడానికి మోదీ కృషి చేశారు. పూర్తి స్థాయిలో కేసీఆర్ పై, బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోయినా, మోదీ తొలుత కేంద్రం చేపట్టబోయే అభివృద్ది పనులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. అలాగని అసలు విమర్శలు చేయకుండా ఉండకుండా రాజకీయంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌పై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి కెటిఆర్ ప్రధాని చేసిన విమర్శలను తిప్పికొడుతూ మోదీ స్పీచ్ మిలియన్ డాలర్ జోక్ అని ఎద్దేవ చేశారు. రైతుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నంత శ్రద్ద మరెవరు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆయన సమర్ధించుకున్నారు. మొత్తం మీద మోదీ తన ప్రసంగం ద్వారా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ను నిలబెట్టే యత్నం చేశారు.ఇంత మాత్రానికే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేం కాని, కాస్తో, కూస్తో బీజేపీ క్యాడర్‌లో కొంత ఆత్మ విశ్వాసం పెరగడానికి మోదీ టూర్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment