ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా? | Gul Panag Article On Health Care System | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా?

Published Mon, Apr 26 2021 3:15 AM | Last Updated on Mon, Apr 26 2021 3:15 AM

Gul Panag Article On Health Care System - Sakshi

వైద్యం పేరిట ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఇది పోవాలంటే, మెరుగైన వైద్యం ప్రజలకు అందాలంటే దేశంలోని ప్రతి జిల్లాలోనూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రెఫరల్‌ ఆసుపత్రిని తప్పకుండా నెలకొల్పాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ప్రైవేట్‌ ఆసుపత్రుల అవసరం సామాన్యులకు ఉండదు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లలో పెంపొందాలి.

కులం, తెగ, జెండర్, నేపథ్యంతో పనిలేకుండా ఏ భారతీయుడినైనా సరే వారికీ వారి కుటుంబానికి ప్రప్రథమంగా కావలసింది ఏమిటి అని అడిగితే పదిమందిలో కనీసం ఎనిమిదిమంది మంచి ఆరోగ్యం, దాంతోపాటు సంతోషం కావాలని కోరుకుంటారు. అయితే ఒక పోలింగ్‌ బూత్‌లోని ఏ వ్యక్తినైనా పట్టుకుని అభ్యర్థిని ఎంచుకోవడంలో అతడి లేక ఆమె ప్రధమ ప్రాధాన్యత ఏది అని అడిగారనుకోండి.. ఆరోగ్య సంరక్షణను కల్పించే అభ్యర్థి తమకు కావాలనే సమాధానం వారినుంచి కలికానిక్కూడా వినిపించదు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పగూలిపోవడానికి మన ఓటర్లలోని ఈ నిర్లిప్తతే ప్రధాన కారణం.

తాము ఎన్నుకుంటున్న ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఉండాలని మన ఓటర్లు అస్సలు ఆలోచించడం లేదు. మరిన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఉన్న ఆస్పత్రులను నవీకరించి మెరుగుపర్చడం అనేది జరగకపోతే, అభివృద్ధి కావాలంటే ఓటు వేయండని రాజకీయ పార్టీల, నేతలు చెప్పే దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? ఒకసారి అభివృద్ధి లేక వికాస్‌ అనే భావనను ఎవరికీ అర్థం కాని అమూర్త భావనగా మార్చేశాక, మన రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడంలో మీడియా సైతం బ్రహ్మాండంగా తనవంతు పాత్ర పోషిస్తోంది.

పంజాబ్,  హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకేసి చూద్దాం. ఈ మూడు రాష్ట్రాలకు చండీగడ్‌ లోని పీజీఐ ఆసుపత్రి మాత్రమే ఏకైక దిక్కుగా ఉంటోంది. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటోంది. చండీగఢ్‌ లోని పీజీఐ ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న భయానక గాథలు ఎన్నో ఎన్నెన్నో. ఒకవేళ ప్రాణాలు నిలుపుకుని వారు ఆసుపత్రిలోకి అడుగుపెడితే చికిత్సకోసం గంటలపాటు ఆసుపత్రి ప్రాంగణంలో వేచి చూడక తప్పదు. 

దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. దేశంలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిమ్స్, పీజీఐ వంటి రిఫరల్‌ ఆసుపత్రులు తమ సామర్థ్యానికి మించి రోగులకు సేవలందిస్తూ అలిసిపోతున్నాయి. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలో కలికానిక్కూడా లేదు కాబట్టే.. ఇలాంటి రిఫరల్‌ ఆసుపత్రులపై ఇంత అలవిమాలిన భారం పడుతోంది. చాలా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అందువల్లనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కనీస అవసరాలకు కూడా దూరమైపోయాయి. దేశ స్థూల దేశీయోత్పత్తిపై, ఆర్థిక వ్యవస్థపై పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే అంశం ఇప్పటికే చాలాసార్లు వెల్లడవుతూవచ్చింది. ఇలాంటి దుష్ప్రభావం బారిన పడకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు తమ పౌరులకు ఏదో ఒక రూపంలో రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అదే భారతదేశం విషయానికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు తీవ్ర వ్యాధికి, అస్వస్థతకు గురైతే సంవత్సరాలుగా పొదుపు చేస్తూ వచ్చిన మొత్తాలు కరిగిపోతాయి. 

ఈవిధంగా ఆరోగ్య సంబంధిత వ్యయం కారణంగానే ప్రతి సంవత్సరమూ దేశ జనాభాలో 3.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి పడిపోతున్నారని మీడియా వార్తలు చెబుతున్నాయి. తమ ప్రియతముల, ఆప్తుల వైద్య ఖర్చులు భరించడానికి సమస్తాన్ని అమ్ముకుంటున్న, తాకట్టుపెడుతున్న కుటుంబాల గాధలు ఒకటీ రెండూ కాదు. చాలావరకు ఇలాంటి  గాథలు విషాదాంతాలుగానే ముగిసిపోతుంటాయి. ఆస్తుల్ని కరగదీసినా కుటుంబం వ్యాధుల పాలైన తన ప్రియతములను కోల్పోతూనే ఉంటుంది.

దేశంలోని పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బారినపడి ఘోరంగా నలుగుతున్న బాధితుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ప్రైవేట్‌ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందని ద్రాక్షపండుగానే ఉంటున్నాయి. పైగా అత్యుత్తమమైన టయర్‌ 1 ఆసుపత్రులు వీరికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అనివార్యంగా వీరు ప్రమాణాలు లేని, నాసిరకం సామగ్రితో కునారిల్లుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగి కుటుంబాలనుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రుల చుట్టూ ఉంటున్న ల్యాబ్‌లు డాక్టర్ల తరపున సేవలందించే అటెండెంట్లతో నిండి పచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రయోగశాలలు అందించే కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్న వైద్యపుంగవులు అయినదానికి కానిదానికి టెస్టుల మీద టెస్టులు రాస్తూ రోగులను ఇలాంటి ల్యాబ్‌ల బారిన పడేస్తున్నారు.

కోవిడ్‌–19 సంక్షోభం వైద్యులు, ల్యాబ్‌లు వంటి ఈ తరహా పరాన్న జీవుల పంట పండిస్తున్నట్లుంది. భారత్‌ నిజమైన గ్లోబల్‌ లీడర్‌గా ఆవిర్భవించాలంటే ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఉచిత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అనేది ఏ రకంగానూ ఉచితంగా లభిస్తోందని చెప్పడానికి లేదు. దాన్ని ఇకనుంచి మనం ప్రీ–పెయిడ్‌ (ముందస్తుగా చెల్లించిన) ఆరోగ్య సంరక్షణ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ప్రతి పైసానూ మనం ఏదో ఒకరకంగా పన్నుల నుంచే చెల్లిస్తున్నామని గ్రహించి తీరాలి. చివరకు అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కునే కూలీ సైతం దానిపై పరోక్షంగా పన్ను చెల్లిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను పిండుకుంటున్న ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదార్లకు కనీసమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాల్సి ఉంటుంది.

దేశంలో నెలకొల్పిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చాలావరకు రాజ కీయ కుటుంబాల ప్రత్యక్ష యాజమాన్యంలో ఉంటున్నాయి లేక వారు అనుమతించిన వారి యాజమాన్యంలో ఉంటున్నాయి. ఈ ఆసుపత్రులకు ఉచితంగా భూమిని అప్పగిస్తున్నారు. రాజకీయ నేతల సమ్మతి లేనిదే దేశంలో నిజమైన వాణిజ్య సంస్థలు సైతం ఇలాంటి రాయితీలను ఒక్కదాన్నైనా పొందలేవు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి రాజకీయ వర్గానికి ఈ భారీ స్థాయి రాయితీలే అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ఈ ప్రైవేట్‌ ఆసుపత్రులను ఉపయోగించుకునేది ఎవరు? పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య సంస్థలు (పీజీఐ) దేశంలో 1950, 60లలో ఉనికిలోకి రాగా, అప్పటినుంచి దేశ జనాభా ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వైద్య అవసరాలు తీరాలంటే కనీసం జిల్లాకు ఒక పీజీఐ స్థాయి రెఫరల్‌ ఆసుపత్రిని తప్పక నిర్మించాల్సి ఉంది. రెండు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉచిత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పన రాజకీయ పార్టీలకు ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను మేనిఫెస్టోల్లో పొందుపర్చేవారికే ఓటువేసేలాగా మన ఓటర్లు కుల, తెగ పరమైన రాజకీయాలకు అతీతంగా పరిణితి చూపాల్సిఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లకు కలిగినప్పుడు రాజకీయ పార్టీలనుంచీ జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేయగలుగుతారు. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పగూలిపోవడానికి బాధ్యులెవరో కూడా గ్రహించి వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఓటర్లు డిమాండ్‌ చేయాలి. 


గుల్‌ పనాగ్‌ 
వ్యాసకర్త రచయిత్రి, నటి, వాణిజ్యవేత్త  
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement