సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను తుపాను ముందటి ప్రశాంతతగా పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీలోని ఎయిమ్స్ మాజీ పల్మనరీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి, పీఎస్‌ఆర్‌ఐ (పుష్పవతి సింఘానియా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్) హాస్పిటల్ ఆఫ్ పల్మనరీ–స్లీప్ మెడిసిన్స్ చైర్మన్ డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మేలో కరోనా సెకండ్‌వేవ్‌కు ముందు ఎలాంటి పరిస్థితులున్నాయో, ఇప్పుడు దాదాపుగా అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు. ఒకరకంగా మనం ఇంకా ‘టైం బాంబు’పైనే కూర్చుని ఉన్నామనే విషయం అందరూ గ్రహించాలని సూచించారు. కొత్త వేరియంట్లు, మ్యూటెంట్లతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
యూఎస్‌లో మాస్క్‌లు తీసేయడంతో పాటు, ప్రయాణాలు, నైట్‌క్లబ్‌లు, పార్టీలు అంటూ విచ్చలవిడిగా వ్యవహరించడంతో ఇప్పుడు అక్కడ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని తెలిపారు. గత కొన్నిరోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులొస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మనదగ్గర కూడా చాలాచోట్ల మాస్క్‌లు పెట్టుకోవడం లేదని, ఇతర జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు. యూఎస్, ఇతర పశ్చిమ దేశాలను చూసైనా మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.
దేశంలో ఇప్పుడు రోజుకు 30–40 వేల మధ్యే కేసులు వస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి ఉందని, మనదగ్గర సెకండ్‌వేవ్ అనేది పూర్తిగా ముగియలేదని స్పష్టం చేశారు. ఫ్లూ లేదా స్వైన్‌ఫ్లూ వంటివి ఎపిడమిక్ నుంచి ఎండమిక్ జోన్‌లోకి వెళతాయని, కానీ కోవిడ్ విషయంలో అలా జరగడం లేదంటున్న డాక్టర్ ఖిల్నానీతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మాస్క్ ధరించడం చాలా ముఖ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలతో మరికొన్ని నెలలు అప్రమత్తంగానే ఉండాలి. మన దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు ప్రయాణాలు, రకరకాల రోజువారీ కార్యకలాపాల కారణంగా భౌతిక దూరం పాటించడం కొంత కష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో సరైన విధంగా, తగిన జాగ్రత్తలతో మాస్క్ ధరించడం అనేది అత్యంత ఆవశ్యకం. కోవిడ్ వైరస్ గాలి ద్వారానే వ్యాప్తి చెందుతున్నందున జాగురూకతతో వ్యవహరించాలి.
ప్రయాణికులను సూపర్ స్ప్రెడర్స్‌గానే పరిగణించాలి
అన్నిరకాల ప్రయాణాలతో ప్రమాదం పొంచి ఉంది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రయాణాలు, హాలీడే ట్రిప్పులు, ఇతర దేశాలకు రాకపోకలు.. ఇలా ఏ ప్రయాణం చేసేవారినైనా ‘సూపర్ స్ప్రెడర్స్’గానే పరిగణించాల్సి ఉంటుంది. కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రానందున అన్నిరకాల ప్రయాణాలపై నియంత్రణలు, ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు అత్యంత అవసరమైతేనే తప్ప ఇతర చోట్లకు ప్రయాణించకూడదనే నిబంధన విధించుకోవాలి.
90% వరకు రక్షణ ఉంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ
మొదట్లో 70 శాతం మందికి ఇమ్యూనిటీ వస్తే సామూహిక రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) లభించినట్టేననే అంచనా వేశారు. కానీ వైరస్ తీవ్రత, వ్యాప్తిని బట్టి ఇది మారుతుందని స్పష్టమైంది. 80, 90 శాతం మందికి రక్షణ ఏర్పడితేనే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణించాలి. ఎవరికైనా రోగనిరోధకశక్తి అనేదే ప్రధానం. అందువల్ల ఎవరికి వారు ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలి. టీకా రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి.
66.70% మందిలో యాంటీబాడీస్
తాజా సీరో సర్వే ప్రకారం దేశంలోని 66.70 శాతం మందిలో యాంటీబాడీస్ ఏర్పడ్డాయి. అదే ఢిల్లీ విషయంలో 79 శాతంగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది. కరోనా ఇన్ఫెక్షన్ సోకాక లేదా వ్యాక్సిన్ వేసుకున్నాక ఏర్పడే యాంటీబాడీస్ ఆరునెలల దాకా ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుదల మొదలవుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం.
ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలి
కొత్త వేరియంట్లు, మ్యూటెంట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది. సెకండ్‌వేవ్‌కు డెల్టా కారణం కాగా, ఏవైనా కొత్త వేరియంట్లు వస్తే ఇమ్యూనిటీ ఏ మేరకు కాపాడుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేంత రోగనిరోధకశక్తి మనలో లేకపోతే ఒక్కసారిగా కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు కారణమౌతాయి. ప్రస్తుతం మనదగ్గరున్న వ్యాక్సిన్లు డెల్టా వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రుజువైంది. కానీ కొత్త వేరియంట్లు వస్తే ఎంతవరకు పనిచేస్తాయన్నది చెప్పలేం. ఏదిఏమైనా కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిం చకుండా నిరోధించేది, నియంత్రించ గలిగేది టీకాలు మాత్రమే. అందువల్ల అత్యధిక శాతం జనాభాకు వ్యాక్సిన్లు వేయడం ఒక్కటే మార్గం. అప్పటిదాకా థర్డ్‌వేవ్ వంటివి వచ్చినా ఎదుర్కొనేలా టీకాల కార్యక్రమంలో వేగం పెరగాలి. ఆక్సిజన్‌తో సహా అన్ని వసతులు, సౌకర్యాలతో ఆసుపత్రులను సర్వసన్నద్ధంగా ఉంచాలి.
థర్డ్‌వేవ్ వస్తుంది కానీ..
థర్డ్‌వేవ్ తప్పకుండా వస్తుంది. అయితే మన సువిశాల దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో భిన్నమైన భౌగోళిక పరిస్థితులున్నాయి. అందువల్ల థర్డ్‌వేవ్ అనేది మొత్తంగా కాకుండా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో కొన్నిచోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ మాటకొస్తే సెకండ్ వేవ్ పూర్తిగా కనుమరుగుకాలేదు. ఢిల్లీ, హరియాణా, యూపీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో రెండోదశ ముగిసింది. ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది.
‘సాక్షి’ఇంటర్వూ్యలో ఎయిమ్స్ మాజీ పల్మనరీ విభాగాధిపతి డాక్టర్ జీసీ ఖిల్నానీ
Comments
Please login to add a commentAdd a comment