ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామర్థ్యాన్ని ఏబీసీడీలకు కుదించేసాయి.
ఈ రోజు చాలా మంది ఆడపిల్లలు కుటుంబ పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకో, ఉన్న దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకో లేక తమ పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు వస్తుందనో ఉన్నత విద్యను ఆధారం చేసుకొని జీవితగమనాన్ని ఉన్నతదిశలో కొనసాగేందుకు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే మగ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్నారు. వీరు కూడా గ్రూప్–2 లేక ఉన్నతోద్యాగాలు ఆశిస్తున్నవారే కావడం మనం గమనించాలి. ఆయా ఉద్యోగాల వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబాలు ఓ మేరకైనా బాగుపడతాయనీ, ఆ ఉద్యోగాలు తమకు వ్యక్తిగత గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయనీ గుండెలనిండా ఆశతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు. అలా ఆశపడటం తప్పేమీకాదు. కానీ ఆయా ఉద్యోగాలకు సెలక్ట్ అవుతున్న వాళ్ళెందరు? అతి కొద్ది మందేనన్నది మనందరికీ తెలుసు.
మిగిలిన వాళ్లందరూ కూడా టీచర్ పోస్టులకోసమో, లేక కండక్టర్ ఉద్యోగాలకోసమో, అదీకాదంటే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమో పోటీపడుతున్నారు. అయితే ఎంఏ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు సెలక్ట్ అవడం లేదు. దానికి కారణం మన విద్యాప్రమాణాలే.యేళ్ళకేళ్ళు చదివేస్తున్నారు. డిగ్రీలు సంపాదించేస్తున్నారు. కానీ ఆ డిగ్రీల ఫలితాలను మాత్రం యువతరం అందుకోలేక పోతోంది. పిల్లలు ఒక మంచి వ్యాసం రాయలేకపోతున్నారు. ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీపుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామరథ్యన్ని ఏబీసీడీలకు కుదించే సాయి. స్వల్ప సమాధానాల పరిధిలో మన పిల్లల మస్తిష్కాలు కుంచించుకుపోతున్నాయి. పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనే తార్కిక జ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు సైతం అరకొరా జ్ఞానాన్ని అందిస్తున్నాయి.
లేదా విద్యార్థులే పరిశోధనాత్మకంగా విషయాన్ని అవగాహన చేసుకునే ఆవశ్యకతను బోధించక పోవడం ఈ పర్యవసానాలకు దారితీస్తోంది. కాబట్టే ఏ పోటీ పరీక్షలనూ ఎదుర్కోలేక, ఉన్నత చదువులు చదివి కూడా ప్రత్యేక శిక్షణ కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. నిజానికి ఓ పిల్లవాడు ఏం ఆశించి ఆ కోర్సు చదువుతున్నాడో, ఆ సబ్జెక్టుని ఏదో వాసన చూపించడం కాకుండా, పరిపూర్ణంగా సబ్జెక్టు వాడి బుర్రలోకెక్కేలా మన యూనివర్సిటీల విద్యాప్రమాణాలు ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి ఆశించిందీ, యూనివర్సిటీ అందించేదీ, బయట సమాజానికి అవసరమైనదీ మూడింటి మధ్యనా సారూప్యత సాధ్యం అవుతుంది. విశ్వవిద్యాలయాలే ఉపాధి కారకాలు కాగలిగినప్పుడు తామరతంపరగా పుట్టుకొచ్చి, పేద విద్యార్థులను పీల్చి పిప్పి చేసే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ల అవసరం ఉండదుగాక ఉండదు.
యూనివర్సిటీ చదువు పిల్లలకు ఉపాధిరంగంలో అడుగిడే సామర్థ్యాన్ని అందివ్వగలగాలి. ఇతర దేశాల్లో విశ్వవిద్యాలయ చదువే ఉద్యోగావసరాలకు కూడా పనికొస్తుంది. అక్కడెక్కడా ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన శిక్షణ లేదు. కానీ మన దేశానికొచ్చేసరికి యూనివర్సిటీ చదువులు వేరు. ఉద్యోగావకాశాలు వేరు. కాబట్టి పిల్లల్లో ఎంఎ చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా సంతృప్తి దొరకడం లేదు. మొత్తంగా విద్య సమాజాభివృద్ధికి దోహదపడే మానవ మేధస్సును తయారుచేయాలి. ఓ పనిముట్టు మాదిరిగానో, రోబో మాదిరిగానో ఏది ఫీడ్ చేస్తే అది మాత్రమే వల్లెవేసే యంత్రంగా తయారు చేయకూడదు. సొంత పరిజ్ఞానాన్నీ, ఆ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ మరింత మెరుగైన ఫలితాలను పొందే సరికొత్త ఆవిష్కరణలకూ ఆ చదువు ఊపిరిపోయాలి. డిగ్రీలు కుప్పలు తెప్పలుగా కుమ్మరించడం వల్ల ఫలితం ఉండదు.
ఉద్యోగాలు రావు, ఏ ఉపయోగాలూ ఉండవు. అలాగే ఎంఎ చదువుకుని కండక్టర్ ఉద్యోగానికో, లేదా కానిస్టేబుల్ ఉద్యోగానికో ఎదురుచూసే పరిస్థితి అక్కర్లేదు. అవకాశాల్లేని వారూ, ఏ పదితోనో సరిపెట్టుకుని టెంత్ సర్టిఫికెట్‌తో సాధించే ఉద్యోగాలకోసం వేటలో పడుతున్న వారు ఒకవైపు ఉంటే, ఉన్నత విద్యనభ్యసించి టెంత్ క్వాలిఫికేషన్‌తో వచ్చే ఉద్యోగాలకోసం ఎదురుచూడటమంటే అది మన వైఫల్యం కాదా అన్నది నా ప్రశ్న. కానిస్టేబుల్ కావాలనుకోవడంలో కానీ, నర్స్ వృత్తి లాంటి సేవాభావం గల వృత్తిని ఎంపిక చేసుకోవడంలో కానీ తప్పేం లేదు. వాటిక్కూడా అంటే, చిన్నా చితకా ఉద్యోగాలకు సైతం గ్రాడ్యుయేట్స్ పోటీ పడే పరిస్థితి ఉంటే ఏం ఉపయోగం? ఉన్నత విద్యనభ్యసించిన వ్యక్తితో పదో తరగతి విద్యార్థి పోటీపడగలడా?
ఇటీవలి కాలంలో పత్రికారంగంలో మంచి అవకాశాలొస్తున్నాయి. అలాగే నూతనంగా అనేక రకాల అవకాశాలు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ ఆ నైపుణ్యం చదువుకునే కాలంలోనే రావాలి. అవసరమైతే ప్రత్యేక శిక్షణలు వాటికి మెరుగులు అద్దాలి. వేరే శిక్షణల కోసం వెంపర్లాడేపని లేకుండానే పిల్లలకు ఆ ఉద్యోగాలు సాధించవచ్చుననే విశ్వాసం కలిగించగలిగితే చాలు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడుతుంది. పిల్లల ఆశయాలు నెరవేరుతాయి.చిన్న ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్స్ ఉద్యోగాల్లో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారిని భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థుల్లో నిరాశ గూడుకట్టుకుంటుంది. కాబట్టి అటు ఓవర్ క్వాలిఫికేషన్ అయినా, అండర్ క్వాలిఫికేషన్ అయినా విద్యారంగానికి సరికాదు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడదు.
చుక్కా రామయ్య
–వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
Comments
Please login to add a commentAdd a comment