Chukka Ramaiah Article
-
నూతన ఆవిష్కరణ కేంద్రాలుగా తరగతి గదులు...!
సాంకేతిక రంగంలో నేడు వస్తోన్న విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచం రూపు రేఖల్ని మార్చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో మనిషి మేధస్సుతోపాటే అభివృద్ధి చెందిన నూతన సాంకేతిక విప్లవంలో మరమనిషి ఆవిష్కరణ ఓ మహాద్భుతం. మనిషి మేధో వికాసాన్నుంచి ఉద్భవించిన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకారణం చేతైనా మనిషే అందిపుచ్చుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళు తరాలపాటు వెనకబడిపోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ టెక్నా లజీతో అనుసంధానం కాక తప్పని పరిస్థితులు కల్పిం చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో, మానవ వనరుల కొరత ఉన్న దేశాల్లో ఇప్పటికే చాట్ బోట్స్ పేరిట రోబోల వినియోగం పెరిగిపోయింది. ఇది ఒక్క కమ్యూనికేషన్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, జర్నలిజం, హోటల్ మేనేజ్ మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ మరమనిషి ప్రమే యం పెరుగుతోంది. ఈ సవాల్‌ను దీటుగా ఎదు ర్కొని మనిషి మనగలగాలంటే నిరంతర జ్ఞాన సము పార్జన, దాని ఆచరణ తప్పనిసరి. ఈ ప్రక్రియ బాల్య దశ నుంచే మొదలు కావాలి. పాఠశాల స్థాయి నుంచే ఆ ప్రయత్నం ప్రారంభించాలి. బడి చదువే అందుకు వేదిక కావాలి. సాంకేతిక విజ్ఞాన బోధనకు తొలి అడుగు పాఠశాలలోనే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. 21వ శతాబ్దంలో సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు మిగతా రంగాలతో పాటు విద్యారంగాన్నీ తీవ్రంగా కుదిపేస్తున్నాయి. పోస్ట్‌కార్డులు అంతరించి వాట్సాప్, టెలిగ్రామ్‌ల రాకతో సమాచార బట్వాడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా విద్యారంగం లోనూ నేడు అలాంటి మార్పులే రావాల్సిన తప్పని సరి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు కాలానుగు ణంగా తమ విద్యాబోధనా ప్రమాణాలను ఎప్పటిక ప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకెళుతున్నాయి. గతంలో విద్యారంగానికి ఉపా«ధ్యాయుడే కేంద్ర బిందువు. కానీ నేడు విద్యార్థి కేంద్రంగా విద్యాబో ధన జరుగుతోంది. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థి మెదడులోకి ఎక్కించడమే నాడు ప్రధాన లక్ష్యం. ఎంత సమర్థంగా విద్యార్థి ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే అంత గొప్పగా భావించేవారు. అదే ఓ గొప్ప విద్యగా పరిగణించేవారు ఆనాడు. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్ఫర్మేష న్కన్నా ఇన్నోవేషన్ ప్రధానమైంది. కొత్త ఆవిష్కర ణలు చేసే విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా మారింది. విద్యార్థిలో సమాచారం గుర్తు పెట్టుకొనే సామర్థ్యం కన్నా, ఆ సమాచారం ఎంత మేరకు అవగతం చేసుకొనే శక్తి, విశ్లేషించే నైపుణ్యం ఉందో చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచా రాన్ని నేటి సామాజిక పరిస్థితులతో అన్వయించు కొనే సామర్థ్యంతో నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులకే నేడు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల ఈ రోజు విద్యారంగంలో ఉపాధ్యాయుడు సర్వాంత ర్యామి కానేకాదు. తరగతి గదిలో విద్యార్థి నైపుణ్యాభి వృద్ధికి, మేథో వికాసానికి అవసరమైన మెళకువలను బోధించడమే ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యంగా మారింది. విద్యార్థిలో అవగాహన ఎంతగా పెరిగితే అన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ నేడు అన్ని రంగాలనూ శాసిస్తోంది. ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారో వారికే అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీలో వచ్చే మార్పులు విద్యారంగంలో రాక పోయినట్టయితే ఆ విద్య వచ్చే శతాబ్దానికి పనికి రాదు. పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమంలో పలకా బలపం పట్టుకుంటేనే మురిసిపోయేరోజులు పోయి పుట్టడంతోనే సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లను అవలీలగా ఆపరేట్ చేయగలిగిన డిజిటల్ యుగంలో మనమున్నాం. ఈరోజు సెల్‌ఫోన్ ఓ నిత్యావస రంగా మారిపోయింది. దేశంలో సెల్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు తరగతి గదిలో విద్యార్థి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ తీసుకుంటే వాళ్ళకు కోపం వస్తుంది. టెక్నాలజీలో అనునిత్యం వస్తోన్న మార్పుల వల్ల విద్యార్థులు తమను తాము నిత్యం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ సాంకేతిక మార్పులను గమనించి విద్యారంగానికి వాటిని అన్వయించుకోవడంలో విఫలమైతే మాత్రం విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యే ప్రమా దం లేకపోలేదు. విద్యార్థి ఆసక్తిని గమనించి విద్యా వ్యవస్థకు సాంకేతిక సొబగులు అద్దాలి. సమాచార రంగం, డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ రోజు విద్యార్థి అవగాహన పెంచే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ విద్యార్థీ పుట్టుక తోనే మేధావి కాడు. పిల్లవాడికి తగిన వాతావరణ కల్పిస్తేనే రాణించగలరు. అందువల్ల పిల్లల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే నేటి ఉపాధాయుడి ప్రధాన కర్తవ్యం. ఆలోచించే వ్యక్తి దేశానికి వరం. ఒకప్పుడు తరగతిగదిలో పాఠం బోధించిన వెంటనే పిల్లవాడిని ప్రశ్నించేవాళ్ళం. దీంతో పిల్లవాడు అదే సమాచారాన్ని గుర్తుంచుకొని చెప్పగలిగితే మేధావి అని కీర్తించే వాళ్ళం. విద్యార్థి ప్రదర్శించే ఆ నైపు ణ్యంతో ఉపాధ్యాయుడు సంతృప్తి చెందేవాడు. కానీ అది అవగాహన కాదు. అది కేవలం రీకాల్ మాత్రమే. అలాంటి చదువులో విద్యార్థి పాత్రధారి కాలేదు. గురువు బోధించిన పాఠంలో విద్యార్థి శ్రమ లేకపోతే అది కేవలం ఉపరితల జ్ఞానంగానే మిగిలి పోతుంది. అందువల్ల విద్యార్థిని బోధనలో పాత్ర ధారి చేయాలి. అందుకు విద్యార్థి ఉపయోగించే సెల్ ఫోన్‌నే సాధనంగా ఎంచుకొని ఆ టెక్నాలజీతో అతడి ఆలోచనను పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అలాకాకుండా మనం మడికట్టు కొని కూర్చుంటే ఛాదస్తులమవుతాం. దినదినం మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థి అవ గాహనను, ఆలోచనను పెంచేలా కృషి చేయాలి. ఉపాధ్యాయుడి బోధనలు విద్యార్థికి ఆసక్తికరంగా ఉంటే మెదడులో కవాటాలు తెరుచుకుంటాయి. అవి తెరచుకుంటేనే విద్యార్థి ఆలోచనలు మొదలు పెడ తాడు. ఆ ఆలోచనలతోనే కొత్త జ్ఞానం ఉత్పత్తి అవు తుంది. అదే నూతన ఆవిష్కరణలకు కారణమౌ తుంది. క్లాస్రూంలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాల యినప్పుడే విద్యారంగంలో మరో విప్లవం సాధ్యమ వుతుంది. నేటి తరగతి గది ఆవిష్కరణల సృష్టిగానీ, పాత జ్ఞానాన్ని వల్లించే కేంద్రం కారాదు. మర మనిషి విసురుతున్న చాలెంజ్‌లను తరగతి గదులు స్వీకరిం చాలి. 21వ శతాబ్దంలో వచ్చిన సమాచార, సాంకేతిక విప్లవాలకు విద్యారంగాన్ని జోడిస్తే వచ్చే మరో విప్ల వంతో సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. -వ్యాసకర్త : ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ చుక్కారామయ్య -
అక్షరాన్ని కబళిస్తున్న ఆకలి
మన దేశంలోనే కాదు..ప్రపంచంలోనూ విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇంటి దగ్గర నుంచి అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌతోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి వల్లే స్కూలు నుంచి డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందించాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లల కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్రధాన ఎజెండా కావాలి. ఆ పిల్లవాడు గుర్తొస్తే మెలకువలోనే కాదు కలలో కూడా నేను ఉలిక్కిపడి లేస్తుంటాను. ఇప్పటికీ ఆ పిల్లవాడి ప్రేమ ముందు ఈ దేశ విద్యావిధానం చిన్నబోయినట్టనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం తొర్రూరులో కొంత మంది విద్యార్థులకు శిక్షణనిచ్చాం. శిక్షణ కాలం మధ్యలోనే నవీన్ అనే పిల్లవాడు ఇంటికి వెళ్ళొస్తానని అడిగాడు. ఇంకా శిక్షణ పూర్తికాలేదని మేం వారించాం. కానీ ఆ పిల్లవాడు పదే పదే ఇంటికెళతానని అడగసా గాడు. ఇప్పుడు ఇంటికెందుకు అన్నది మా ఎదురు ప్రశ్న. మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. ఇంటి దగ్గర ఆమెకు మందులు లేవు. నాకు ఒక్కరోజు సెలవిస్తే మా ఊళ్ళో కూలిపనికెళ్ళి ఆమ్మకి కొన్ని మందులుకొని ఇచ్చి వస్తానని చెప్పాడు నవీన్. అయినా మేం మెత్తబడలేదు. అతను అబద్ధం చెపుతున్నాడనుకున్నాం. లేదా ఇంటిపైన బెంగపెట్టుకున్నాడనుకున్నాం. చివరకు విసుగొచ్చిన నవీన్ ‘సార్ నన్ను ఇంటికి పంపండి. లేదంటే నాకీ చదువు వొద్దు, శిక్షణా వొద్దు అని తేల్చి చెప్పేశాడు. చివరకు శిక్షణ కాలంలోనే మూడు రోజులపాటు ప్రతిరోజూ సాయంకాలాలు కూలిపనిచేసి వచ్చిన డబ్బుతో వాళ్ళమ్మకి మందులు కొనిపెట్టాడు. ఇది విన్నప్పుడే కాదు, అది తలచుకున్నప్పు డల్లా ఒక అధ్యాపకుడిగా నా మనసు బెంగటిల్లుతుంది. కుటుంబ నేపథ్యమే అవగాహనా శక్తిని నియంత్రిస్తుంది చదువు విద్యార్థి అవగాహనాశక్తిపైనే ఆధారపడుతుందా? లేక అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అతని చదువుని ప్రభావితం చేస్తాయా? అంటే కచ్చితంగా విద్యార్థి చదువుకీ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకీ మధ్య మన దేశంలో విడదీయలేని సంబంధం ఉంది. అది ప్రయోగాత్మకంగా రుజువ య్యింది కూడా. ఆమాటకొస్తే అది మన దేశంలోనే కాదు అనేక ఇతర దేశాల్లో సైతం విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకు ఉదాహరణ అమెరి కాలో శ్వేతజాతీయులకీ, ఆఫ్రికన్స్కీ ఉన్న తేడా కూడా ఇక్కడే తేటతెల్లం అవుతుంది. అన్ని అవకాశాలూ ఉండి, ఎటువంటి ఆర్థిక సమస్యలూ లేని విద్యార్థి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఇంటిదగ్గర అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌ తోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందిం చాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లవాడి కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్ర«ధాన ఎజెండా కావాలన్నదే నా భావన. మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం కాదు, రాత్రిది కూడా... ఎవరైనా ఒక మురికివాడలోని పాఠశాలకు వెళ్ళి మీలో పొద్దున్న ఏదైనా తిని వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అని అడిగితే బహుశా ఒక్కరు కూడా ఎత్తరు. ఎందుకంటే మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే దళిత, అణగారిన వర్గాల పిల్లల్లో ఎక్కువమంది మధ్యాహ్న భోజనం పైనే ఆధారపడతారు. అసలా మధ్యాహ్న భోజనం కోసమే బడికి వచ్చే పిల్లలు కోకొల్లలు. ఇంకా చెప్పాలంటే మిడ్ డే మీల్ అనేది మధ్యాహ్న భోజనం కాదు. అది రాత్రి భోజనం కూడా. ఎందుకంటే రాత్రికి ఇంటి దగ్గర ఇంత కూడు దొరుకుతుందన్న భరోసా ఆ పిల్లవాడికుండదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో తలెత్తబోయే పరిణామాలు వాడికా కాన్ఫిడెన్స్ ఇవ్వవు. రాత్రి తాగొచ్చే నాన్న ఇంట్లో ఏం రభస చేస్తాడో తెలియదు. చిల్లిగవ్వలేని అమ్మని పొయ్యిమీదకి నాలుగు గింజలెలా వస్తాయోనన్న బెంగ పీడి స్తుంది. రేపటికి ఉపాధి హామీ కూలి దొరుకుతుందా? అన్న మీమాంస పదిహేనేళ్ళు కూడా లేని అక్కది. అందుకే తనకన్నా చిన్నదైన చెల్లికోసం మిగిలిన మధ్యాహ్న భోజనాన్ని బాక్సులో పెట్టుకెళ్ళే పిల్లలున్నారు మన రాష్ట్రంలో. అయితే విద్యార్థుల సామాజిక స్థితిగతులు వారి చదువుపై ఎక్కువగా ప్రభావం చూపుతాయనడానికి న్యూయార్క్ ఒక ఉదాహరణ. న్యూయార్క్‌లోనూ నిరాశ్రయ విద్యార్థులే ప్రపంచంలోనే పేరెన్నికగన్న న్యూయార్క్‌లో నివసించే ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఒకరు నిరాశ్రయులే. పేదరికం, నగరంలో నివసించే స్థోమత లేకపోవడంతో అత్యధిక సంఖ్యలో కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా తాత్కాలిక నివాసాల్లోనూ, ఆశ్రమాల్లో తలదాచుకుంటోన్న విద్యార్థుల సంఖ్య వరుసగా మూడో యేట కూడా లక్షమందికి చేరినట్టు తాజా అ«ధ్యయనంలో తేలింది. ఆయా కుటుంబా ల్లోని విద్యార్థులు ప్రభుత్వ షెల్టర్లలో గానీ, స్నేహితులో, బంధువుల ఇళ్ళల్లోనో తలదాచుకుంటున్నట్టు ఇండిపెండెంట్ బడ్జెట్ ఆఫీస్ రిపోర్టు వెల్లడించింది. పాఠశాల విద్యార్థుల హాజరు శాతాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది. దీన్ని బట్టి 2013–14 విద్యాసంవత్సరంలో షెల్టర్ హోమ్స్‌లో నివసించే విద్యార్థుల్లో కేవలం 34 శాతం మందికి మాత్రమే 90 శాతం హాజరు ఉన్నట్టు స్పష్టమైంది. వీరంతా తాముంటున్న ప్రదే శాల నుంచి పాఠశాలకు చేరుకునేందుకు దూర తీరాలకు ప్రయాణిం చాల్సి వస్తోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరవడానికి ఏ అవరోధాలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించేందుకు దాదాపు 100 పాఠశాలల్లో సిబ్బందినీ, అడ్మినిస్ట్రేటర్స్నీ వారి కుటుంబాల్లోని ఎంతో మందిని ఈ అధ్యయనంలో ప్రశ్నించడంతో లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడలేని పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 2010–11 నుంచి 2013–14 మధ్యలో తాత్కాలిక నివాసాల్లో తల దాచుకుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగింది. న్యూయార్క్ సిటీలో 2010లో 69,244 మంది విద్యార్థులు ఇళ్ళులేక, తాత్కాలిక ఆశ్రయం పొందితే ఆ సంఖ్య ప్రస్తుతం 114,659కి పెరిగిపోయింది. ఇది ఆల్బెనీ జనాభా కంటే ఎక్కువ. మొత్తం అమెరికాలోనే అత్యధికంగా నిరాశ్ర యులైన విద్యార్థులున్న సిటీ న్యూయార్క్ సిటీ. గత ఏడాది చికాగోలో నివసిస్తోన్న విద్యార్థుల్లో 5 శాతం మంది ఇళ్ళులేని వారే. 2016 గణాంకాల ప్రకారం లాస్ఏంజెల్స్లో నివసిస్తోన్న విద్యార్థుల్లో 3 శాతం మంది నిరాశ్రయులే. దాదాపు 1.1 మిలియన్ల మంది న్యూయార్క్‌లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అక్కడ చదివే 144 ప్రభుత్వ పాఠశా లల్లో మూడోవంతు మంది విద్యార్థులు నిరాశ్రయులే. బ్రాంక్స్ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10,804 మంది నిరాశ్రయులైన విద్యా ర్థులున్నారు. బ్రాంక్స్ పరిధిలోని కింగ్బ్రిడ్స్ ఇంటర్నేషనల్ హైస్కూ ల్లో చదువుతున్న విద్యార్థుల్లో 44 శాతం మంది విద్యార్థులు గత నాలుగేళ్ళుగా నిరాశ్రయులుగా ఉంటున్నారు. ఇల్లులేని విద్యార్థుల్లో పాఠ శాల హాజరుశాతం కూడా అతితక్కువగా ఉంటోంది. నిరాశ్రయులైన విద్యార్థులు గత యేడాది మొత్తంలో వివిధ సందర్భాల్లో ఒక నెల రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరు కావాల్సి వచ్చింది. 2015–16 విద్యా సంవ త్సరంలో షెల్టర్ హోమ్స్‌లో నివసిస్తోన్న వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే స్టేట్ మ్యాథ్స్‌లోనూ, 15 శాతం మంది ఇంగ్లిష్‌లోనూ పాస్ అయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరచుగా షెల్టర్ హోమ్స్ నుంచి మారుతూండటంతో పాఠశాలల్లో విద్యార్థులను స్థిరంగా ఉండనివ్వని పరిస్థితికి చేర్చింది. ఈ కారణంగా ఒక్క యేడాదిలో విద్యార్థులు కనీసం మూడు నాలుగు పాఠశాలలకు మారాల్సి వస్తోందని రిపోర్టు వెల్లడించింది. షెల్టర్ హోమ్స్ నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే కనీసం రెండున్నర గంటలపాటు ప్రయాణిం చాల్సి ఉంటుంది. పొద్దున ఐదు గంటలకు లేచి, ఇంత దూరం ప్రయా ణించి 11 గంటలకు పాఠశాలకు చేరుకోవడంతో దాదాపు సగం క్లాసులను వీరు మిస్సవుతున్నారు. చివరకు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్పుడూ, సబ్వేల్లోనే వీరు నిద్రించాల్సిన దయనీయమైన పరిస్థితి. ఇదే విద్యార్థుల గైర్హాజరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. స్థిరనివాసా లున్న వారికంటే, మూడురెట్లు అధికంగా షెల్టర్‌హోమ్స్‌లో నివసిస్తోన్న విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. మన దేశంలో ఆ లెక్కలు కూడా లేవు... ఇలాంటి పరిశోధనలు జరిగిన దాఖలాలు మనదేశంలో కనిపించవు. ఇదే విషయంపై ఇక్కడ పరిశోధన చేస్తే ప్రపంచం నివ్వెరపోయే అంశాలెన్నో వెలుగులోకి వస్తాయి. లక్షలాది మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల స్థితిగతులు, నిలువనీడే కాదు తిండికి కూడా నోచుకోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు గొప్ప అవగాహనా శక్తి ఉండీ, చదువుపైన మనసు లగ్నం చేయలేని స్థితి ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలో టాయ్‌లెట్ సౌకర్యం ఉన్న స్కూళ్లు ఎన్ని అని కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే మరుగు దొడ్డి సౌకర్యంలేని పాఠశాల ఒక్కటి కూడా లేదని రిపోర్టు ఇచ్చింది నాటి ప్రభుత్వం. కానీ వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలల్లో ఈ సదుపాయం వున్నదన్న విషయం తెలీదు. ఎంతోమంది ఆడపిల్లలు రుతుసమయంలో కనీసం ప్యాడ్ మార్చుకునే సదుపాయం కూడా లేక పాఠశాలలకు వెళ్ళడమే మానేస్తున్నారన్నది పరిశోధనలో తేలిన విషయం. ఆడపిల్లల డ్రాపౌట్స్ దాదాపు అన్నీ మరుగుదొడ్డి సమస్యతోనేనని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ఒకటి కల్యాణ లక్ష్మి. నిజానికి కల్యాణ లక్ష్మి వల్ల ఆడపిల్లలకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరి శీలన జరిపిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే లక్షరూపాయలకు ఆశపడి ఆడపిల్లలకు 18 ఏళ్ళు కూడా రాకుం డానే పెళ్ళిళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. కనుక తాత్కాలిక పరిష్కారాలూ, క్యాష్ పంపిణీ కాదు. విద్యావిధానానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ సైతం కొంత మాత్రమే సమస్యను పరిష్కరించ గలవు. కానీ ఆ పిల్లల మనసుని కలచివేసే ఆయా పిల్లల ఇంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నదని గ్రహించాల్సిన సందర్భమిది. వ్యాసకర్త : చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ -
ఉపాధినివ్వని చదువులు
ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామర్థ్యాన్ని ఏబీసీడీలకు కుదించేసాయి. ఈ రోజు చాలా మంది ఆడపిల్లలు కుటుంబ పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకో, ఉన్న దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకో లేక తమ పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు వస్తుందనో ఉన్నత విద్యను ఆధారం చేసుకొని జీవితగమనాన్ని ఉన్నతదిశలో కొనసాగేందుకు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే మగ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్నారు. వీరు కూడా గ్రూప్–2 లేక ఉన్నతోద్యాగాలు ఆశిస్తున్నవారే కావడం మనం గమనించాలి. ఆయా ఉద్యోగాల వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబాలు ఓ మేరకైనా బాగుపడతాయనీ, ఆ ఉద్యోగాలు తమకు వ్యక్తిగత గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయనీ గుండెలనిండా ఆశతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు. అలా ఆశపడటం తప్పేమీకాదు. కానీ ఆయా ఉద్యోగాలకు సెలక్ట్ అవుతున్న వాళ్ళెందరు? అతి కొద్ది మందేనన్నది మనందరికీ తెలుసు. మిగిలిన వాళ్లందరూ కూడా టీచర్ పోస్టులకోసమో, లేక కండక్టర్ ఉద్యోగాలకోసమో, అదీకాదంటే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమో పోటీపడుతున్నారు. అయితే ఎంఏ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు సెలక్ట్ అవడం లేదు. దానికి కారణం మన విద్యాప్రమాణాలే.యేళ్ళకేళ్ళు చదివేస్తున్నారు. డిగ్రీలు సంపాదించేస్తున్నారు. కానీ ఆ డిగ్రీల ఫలితాలను మాత్రం యువతరం అందుకోలేక పోతోంది. పిల్లలు ఒక మంచి వ్యాసం రాయలేకపోతున్నారు. ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీపుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామరథ్యన్ని ఏబీసీడీలకు కుదించే సాయి. స్వల్ప సమాధానాల పరిధిలో మన పిల్లల మస్తిష్కాలు కుంచించుకుపోతున్నాయి. పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనే తార్కిక జ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు సైతం అరకొరా జ్ఞానాన్ని అందిస్తున్నాయి. లేదా విద్యార్థులే పరిశోధనాత్మకంగా విషయాన్ని అవగాహన చేసుకునే ఆవశ్యకతను బోధించక పోవడం ఈ పర్యవసానాలకు దారితీస్తోంది. కాబట్టే ఏ పోటీ పరీక్షలనూ ఎదుర్కోలేక, ఉన్నత చదువులు చదివి కూడా ప్రత్యేక శిక్షణ కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. నిజానికి ఓ పిల్లవాడు ఏం ఆశించి ఆ కోర్సు చదువుతున్నాడో, ఆ సబ్జెక్టుని ఏదో వాసన చూపించడం కాకుండా, పరిపూర్ణంగా సబ్జెక్టు వాడి బుర్రలోకెక్కేలా మన యూనివర్సిటీల విద్యాప్రమాణాలు ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి ఆశించిందీ, యూనివర్సిటీ అందించేదీ, బయట సమాజానికి అవసరమైనదీ మూడింటి మధ్యనా సారూప్యత సాధ్యం అవుతుంది. విశ్వవిద్యాలయాలే ఉపాధి కారకాలు కాగలిగినప్పుడు తామరతంపరగా పుట్టుకొచ్చి, పేద విద్యార్థులను పీల్చి పిప్పి చేసే కోచింగ్ ఇనిస్టిట్యూట్ల అవసరం ఉండదుగాక ఉండదు. యూనివర్సిటీ చదువు పిల్లలకు ఉపాధిరంగంలో అడుగిడే సామర్థ్యాన్ని అందివ్వగలగాలి. ఇతర దేశాల్లో విశ్వవిద్యాలయ చదువే ఉద్యోగావసరాలకు కూడా పనికొస్తుంది. అక్కడెక్కడా ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన శిక్షణ లేదు. కానీ మన దేశానికొచ్చేసరికి యూనివర్సిటీ చదువులు వేరు. ఉద్యోగావకాశాలు వేరు. కాబట్టి పిల్లల్లో ఎంఎ చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా సంతృప్తి దొరకడం లేదు. మొత్తంగా విద్య సమాజాభివృద్ధికి దోహదపడే మానవ మేధస్సును తయారుచేయాలి. ఓ పనిముట్టు మాదిరిగానో, రోబో మాదిరిగానో ఏది ఫీడ్ చేస్తే అది మాత్రమే వల్లెవేసే యంత్రంగా తయారు చేయకూడదు. సొంత పరిజ్ఞానాన్నీ, ఆ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ మరింత మెరుగైన ఫలితాలను పొందే సరికొత్త ఆవిష్కరణలకూ ఆ చదువు ఊపిరిపోయాలి. డిగ్రీలు కుప్పలు తెప్పలుగా కుమ్మరించడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగాలు రావు, ఏ ఉపయోగాలూ ఉండవు. అలాగే ఎంఎ చదువుకుని కండక్టర్ ఉద్యోగానికో, లేదా కానిస్టేబుల్ ఉద్యోగానికో ఎదురుచూసే పరిస్థితి అక్కర్లేదు. అవకాశాల్లేని వారూ, ఏ పదితోనో సరిపెట్టుకుని టెంత్ సర్టిఫికెట్తో సాధించే ఉద్యోగాలకోసం వేటలో పడుతున్న వారు ఒకవైపు ఉంటే, ఉన్నత విద్యనభ్యసించి టెంత్ క్వాలిఫికేషన్‌తో వచ్చే ఉద్యోగాలకోసం ఎదురుచూడటమంటే అది మన వైఫల్యం కాదా అన్నది నా ప్రశ్న. కానిస్టేబుల్ కావాలనుకోవడంలో కానీ, నర్స్ వృత్తి లాంటి సేవాభావం గల వృత్తిని ఎంపిక చేసుకోవడంలో కానీ తప్పేం లేదు. వాటిక్కూడా అంటే, చిన్నా చితకా ఉద్యోగాలకు సైతం గ్రాడ్యుయేట్స్ పోటీ పడే పరిస్థితి ఉంటే ఏం ఉపయోగం? ఉన్నత విద్యనభ్యసించిన వ్యక్తితో పదో తరగతి విద్యార్థి పోటీపడగలడా? ఇటీవలి కాలంలో పత్రికారంగంలో మంచి అవకాశాలొస్తున్నాయి. అలాగే నూతనంగా అనేక రకాల అవకాశాలు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ ఆ నైపుణ్యం చదువుకునే కాలంలోనే రావాలి. అవసరమైతే ప్రత్యేక శిక్షణలు వాటికి మెరుగులు అద్దాలి. వేరే శిక్షణల కోసం వెంపర్లాడేపని లేకుండానే పిల్లలకు ఆ ఉద్యోగాలు సాధించవచ్చుననే విశ్వాసం కలిగించగలిగితే చాలు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడుతుంది. పిల్లల ఆశయాలు నెరవేరుతాయి.చిన్న ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్స్ ఉద్యోగాల్లో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారిని భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థుల్లో నిరాశ గూడుకట్టుకుంటుంది. కాబట్టి అటు ఓవర్ క్వాలిఫికేషన్ అయినా, అండర్ క్వాలిఫికేషన్ అయినా విద్యారంగానికి సరికాదు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడదు. చుక్కా రామయ్య –వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
చర్చలు రగిలించిన మానవతామూర్తి
నివాళి సాగర్‌లో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఉపదేశాలకు బదులు విద్యార్థుల్లో ఆలోచనలు రేపే చర్చలు రగిలించేవారు. ప్రతి ప్రిన్సిపాల్ తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పిల్లలు విమర్శిస్తే సంతోషపడతారు. దాని వలన తన గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ వై.వి రెడ్డి (వై. వెంకటరెడ్డి) తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పొగిడితే సంతోషపడతాడు. ఈనాడు తన కుర్చీని పటిష్టంగా చేసింది వారే కదా అంటాడు. తన కన్న ముందున్న ప్రిన్సిపాళ్లను ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆయనను నేను ప్రిన్సిపాల్‌గా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చూశాను. తనతో ఏకీభవించనివాళ్లను వాళ్లముందే విమర్శిస్తాడు. కానీ వారు లేనప్పుడు వారి మంచితనాన్ని పొగుడుతాడు. ఇది చాలామందిలో ఉండదు. మానవత్వానికి ప్రతీక ఆయన. ఆయనే నాగార్జున సాగర్ ఎ.పి.రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి నా తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్. అలాంటి మనిషి విద్యార్థులకే కాదు, నాలాంటి వారికి కూడా ఆదర్శనీయం. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి అది శాశ్వత కీర్తి. బతికున్నప్పుడు వచ్చే కీర్తి నీళ్ల మీద రాతలే. కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా, తమ పనిద్వారా, నడవడిక ద్వారా ప్రత్యేకముద్ర వేస్తారు. తరగతి గది అంటే అది సిలబస్‌కు, పరీక్షలు నిర్వహించటానికి మాత్రమే కేంద్రం కాదు. తరగతి గదిని పరీక్షలతో పాటుగా భవిష్యత్ సమాజంలో విద్యార్ధులు జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సన్నద్ధం చేస్తారు. వై.వి. రెడ్డి నల్గొండ ఎన్.జి. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు సహ అధ్యాపకుడు. ఆయన ప్రతిరోజు దేశంలో, ప్రపంచంలో పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషించి చెప్పేవాడు. వార్తల రూపం వెనుక ఏం జరిగి ఉంటుందని విశ్లేషించి చెప్పేవాడు. పలానా దేశంలో పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల చైతన్యస్థాయి ఏమిటి? ప్రజలు ఇలాంటి సమస్యలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్న అంశాలను నల్గొండ స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మా మదిలో ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. వై.వి. రెడ్డి ప్రతిరోజు విద్యార్థుల అసెంబ్లీలో మాట్లాడే మాటల విశ్లేషణలు విన్నాను. విద్యార్థులకు ఆయన హితోపదేశాలు చేసేవాడు కాదు. విద్యార్థులు ఆలోచించుకోవటానికి అనుగుణమైన చర్చను మాత్రం వారిలో రగిలించేవాడు. సమస్యలకు పరిష్కారం చెప్పేవాడుకాదు. కానీ పిల్లలను పాత్రధారులను చేసేవారు. దాని వల్ల ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈనాడు సైంటిస్టులుగా, పాలనా రంగంలో, వివిధ వృత్తుల్లో ఉన్నతమైన దశలో ఉన్నారు. ఏ సమస్యకైనా, ఏ సవాళ్లకైనా పరిష్కారాలు చెప్పే పాలనాదక్షులయ్యారు. అలా ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో వై.వి. రెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రిన్సిపాలే పరిష్కారం చెబితే అతని గొప్పతనం మాత్రమే బయటపడుతుంది. కానీ అందులో పిల్లలను నిమగ్నం చేస్తే వాళ్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. దాంతో భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. వై.వి. రెడ్డి దీర్ఘదృష్టి కలవాడు. కోదాడ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు.. సమాజానికి కాలేజీకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆచరణ ద్వారా చెప్పగలిగాడు. నాగార్జునసాగర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉండి దేశానికి అవసరమైన పాలనాదక్షులను తయారుచేయటానికి దోహదపడ్డాడు. ఖమ్మంలో ఆయనపైన నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ముద్ర పడింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. సాగర్‌లో డిగ్రీ చదువులో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక ప్రిన్సిపాల్‌ను అంచనా వేయాలంటే ఆయన పనిచేసిన కాలేజీలో లక్ష్యం ఏమేరకు చేరుకోగలిగారో అదే గీటురాయిగా చెప్పవచ్చు. పరిశోధన అంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం నుంచి పరిశోధనాత్మకమైన దృక్కోణం రావాలి. దానికి కావాల్సింది సబ్జెక్టుపైన అవగాహనే. పరిశోధనాత్మక దృక్కోణం ఉన్న టీచర్లను తీసుకోవాలి. అదే కోణంలో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీల్లో అధ్యాపకుల నియామకం జరిగింది. అంతకుముందే డిగ్రీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని తీసుకొన్నారు. ఇలాంటి మనుషులను తీసుకొన్నట్లయితే పరిశోధనకు అవసరమైన విద్యార్థులు తయారవుతారని దూరదృష్టితో ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను నిర్మిం చారు. దీన్ని నిర్వహించే ప్రిన్సిపాళ్లకు కూడా ఈ లక్ష్యంవైపుకు తీసుకుపోయే శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఆనాటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వ్యవస్థ విద్యార్థులను ఆర్ఈసీలకు, పిల్లలను ఐఐటీలకు పంపి సాంకేతిక మానవ సంపదను తయారుచేసేది. అదే విధంగా డిగ్రీల్లో మానవీయశాస్త్రాలు, సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ చేసే మనుషులను తయారుచేసింది. ఆ దారిలో సంస్థను ముందుకు నడిపించే దీక్షాదక్షత, శక్తి వై.వి.రెడ్డికి ఉన్నాయి. ఆయనకు సామాజిక చింతన ఉంది. లక్ష్యంకోసం పట్టు వదలకుండా పనిచేసే ధైర్యం ఉంది. పిల్లలను తీర్చిదిద్దగల నైపుణ్యం ఉంది. కొత్తకోణాలను ఆవిష్కరించగల శక్తి వై.వి. రెడ్డికి ఉంది. అలాంటి ప్రిన్సిపాళ్లకోసం సమాజం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. వై.వి. రెడ్డి వృత్తికి అంకితమైన మహామనిషి. ఆయనకు అధ్యాపకులందరి తరపున స్మృత్యంజలి ఘటిస్తున్నాను. (నేటి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో, రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రంవారిపాలెంలో వై.వి. రెడ్డి సంతాపసభ, ఆయనపై ‘నిలువెత్తు పుస్తకం’ పుస్తకావిష్కరణ ఉంటాయి) - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
అత్యాచారానికి అడ్డుకట్ట ఎలా?
- సందర్భం శాసనాల ద్వారా, దండనల ద్వారా తెచ్చే మార్పు కన్నా సంస్కృతీపరంగా తెచ్చే మార్పు.. మన సమాజంలో అత్యాచారాల వంటి దురాచారాలకు సరైన విరుగుడు అవుతుంది. సమస్య మూలాల్లోకి వెళ్లకపోవడమే అసలు సమస్య. ఇటీవల ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఇరవై మూడేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచార వికృత దాడి జరిగి నట్లు వార్త. తరచూ ఇలాంటి వార్తలు రోజూ మనదేశంలో ఎక్కడో ఒకచోట యథేచ్ఛగా జరు గుతుండడం సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నది. నిర్భయ ఘటన తర్వాత పటిష్టమైన చట్టాన్ని రూపొందించి, అమలు పరుస్తున్నప్పటికీ అలాంటి సంఘటనలే మాటిమాటికీ పున రావృతం కావడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే. పూర్వకాలంలో తమ తమ ఆచార వ్యవహారాలకు సంబంధించిన ‘సంస్కృతి’లో భాగంగా పిల్లలకు చిన్నతనం లోనే పెద్దలు విలువలు నేర్పించేవారు. మనది కుటుంబ వ్యవస్థ బలంగా, పునాదిగా ఉన్న దేశం కాబట్టి ఇంట్లో మగపిల్లలెవరైనా ఆడపిల్లల్ని మాటవరసకు ఆట పట్టించ డానికైనా ప్రయత్నిస్తే పెద్దలు నివారించేవారు. అదే భావన వారు పెరిగి పెద్దయిన తర్వాత కూడా కనబడేది. దురదృష్టవశాత్తు ‘మార్కెట్ వ్యవస్థ’ దేశ సామాజిక స్థితిగతుల్ని నిర్దేశిస్తున్న తరుణంలో - ఇలాంటి సంఘట నలు విరివిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. తాజాగా ఈ విషయానికి సంబంధించి ‘మూవ్ అప్’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. ఇందులో పురుషుల భౌతిక శరీర నిర్మాణాన్ని గురించి, నాడీ వ్యవస్థకు సంబంధించి ఎన్నో విషయాలు రచయిత ప్రస్తావించాడు. ముఖ్యంగా పశుపక్ష్యాదుల తర్వాత మాన వులలో కామవాంఛ బలంగా ఉంటుందని, దాని నియంత్ర ణకు అవసరమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని పొందకపోతే అది ‘పశుప్రవృత్తి’ని ప్రేరేపిస్తుందని, చివరకు ఆ స్థితిలోకి వచ్చిన వారు నా రక్తం చెప్పేదే చేస్తాననే భావనకు వస్తారని, అలాంటి సందర్భాలలోనే ‘రేప్’ లాంటి సంఘటనలు జరు గుతాయని విశ్లేషించాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక తీవ్ర సంఘటన జరిగినప్పుడే అప్పటికప్పుడు స్పందించి ఏదో మొక్కు బడిగా ఒక నిర్ణయాన్ని, చట్టాన్ని తీసుకొని వస్తున్నాం. కానీ సమస్య మూలాల్లోకి వెళ్లడం లేదు. శాస్త్రీయమైన అవగాహన లేదు. విశ్లేషణ లేదు. అందుకే సమస్యల్ని పరిష్కరించలేక పోతున్నాం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ‘‘సెక్స్ ఎడ్యు కేషన్’’ ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తున్నది. విద్యార్థి దశలోనే బాలబాలికలకు శరీర నిర్మాణం, ఎదుగుదల, అంతరాలకు సంబంధించిన ఆరో గ్యపరమైన అవగాహనను కల్పించేందుకు ఈ చర్య దోహద పడుతుంది. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచార ఘటనలు పెచ్చరిల్లిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే ముందు - బాలబాలికలలో, యువతలో సాంస్కృతిక మార్పును తీసుకొని రావాలి. శాసనాల ద్వారా, దండనల ద్వారా తెచ్చే మార్పు కన్నా సంస్కృతీపరంగా తెచ్చే మార్పు.. అత్యాచారాల వంటి దురాచారాలకు సరైన విరుగుడు అవుతుంది. అందుకు ప్రగతిశీలమైన విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలే కాకుండా ప్రజాసంఘాలు కూడా ముందుకు రావాలి. తీవ్ర సమస్యలకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే సామాజిక, సాంస్కృతిక పరి ణామం అవసరం. దీనిని నియంత్రించడం కేవలం విద్యతో మాత్రమే జరుగుతుంది. విద్యతో ఎలా నిరోధించవచ్చు అనేదానికి ‘పాల్ మ్యాక్ లెన్’ ఒక మ్యాపింగ్ సిస్టమ్‌ను రూపొందించాడు. దానిలో మూడు భాగాలు మనం గమనించవచ్చు. మొదటిది కార్టెక్స్ బ్రెయిన్ (ఇౌట్ట్ఛ్ఠ), రెండవది లింబిక్ బ్రెయిన్ (ఔజీఝఛజీఛి), మూడవది రిప్టిలియిన్ బ్రెయిన్ (ఖ్ఛఞ్టజీజ్చీ). మొదటగా కార్టెక్స్లో భాషా సముపార్జన, ఒక నమూనా, సంగ్రహణం మరియు గ్రాహ్యతతో ఒక మానసిక విధానం అనేది రూపొందుతుంది. దీనిని మనం మానవ మెదడులో కీలకమైన భాగంగా కూడా గుర్తించవచ్చు. రెండవదైన లింబిక్ అనేది మానవుని ప్రవర్తనకు, భావో ద్వేగానికి, జ్ఞాపకానికి, ప్రేరేపణకు సహకరిస్తుంది. ఇకపోతే, రిప్టిలియిన్ బ్రెయిన్ అనేది స్వభావసిద్ధమైన దూకుడును నియంత్రిస్తుంది. కాబట్టి మొదటి రెండింటిలో కనుక మనం మార్పును తీసుకువస్తే చివరకు మానవ వికృత బుద్ధిని తగ్గించవచ్చు. పై రెండింటిలో మార్పును తీసుకురావడం కేవలం విద్యతో మాత్రమే జరిగే పని. కేంద్ర ప్రభుత్వం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చిస్తున్న వేళ వీటిని గమనించి దానికి తగిన బుద్ధులను మానవుని వివిధ భాగాలలో కల్పిస్తే మనం అత్యాచార ఘటనలకు స్వస్తి చెప్పేందుకు వీలుంటుంది. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు