అక్షరాన్ని కబళిస్తున్న ఆకలి | Chukka Ramaiah Article On Strengthening School Education In India | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 2:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Chukka Ramaiah Article On Strengthening School Education In India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలోనే కాదు..ప్రపంచంలోనూ విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇంటి దగ్గర నుంచి అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌతోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి వల్లే స్కూలు నుంచి డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందించాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లల కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్రధాన ఎజెండా కావాలి.

ఆ పిల్లవాడు గుర్తొస్తే మెలకువలోనే కాదు కలలో కూడా నేను ఉలిక్కిపడి లేస్తుంటాను. ఇప్పటికీ ఆ పిల్లవాడి ప్రేమ ముందు ఈ దేశ విద్యావిధానం చిన్నబోయినట్టనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం తొర్రూరులో కొంత మంది విద్యార్థులకు శిక్షణనిచ్చాం. శిక్షణ కాలం మధ్యలోనే నవీన్‌ అనే పిల్లవాడు ఇంటికి వెళ్ళొస్తానని అడిగాడు. ఇంకా శిక్షణ పూర్తికాలేదని మేం వారించాం. కానీ ఆ పిల్లవాడు పదే పదే ఇంటికెళతానని అడగసా గాడు. ఇప్పుడు ఇంటికెందుకు అన్నది మా ఎదురు ప్రశ్న. మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. ఇంటి దగ్గర ఆమెకు మందులు లేవు. నాకు ఒక్కరోజు సెలవిస్తే మా ఊళ్ళో కూలిపనికెళ్ళి ఆమ్మకి కొన్ని మందులుకొని ఇచ్చి వస్తానని చెప్పాడు నవీన్‌. అయినా మేం మెత్తబడలేదు. అతను అబద్ధం చెపుతున్నాడనుకున్నాం. లేదా ఇంటిపైన బెంగపెట్టుకున్నాడనుకున్నాం. చివరకు విసుగొచ్చిన నవీన్‌ ‘సార్‌ నన్ను ఇంటికి పంపండి. లేదంటే నాకీ చదువు వొద్దు, శిక్షణా వొద్దు అని తేల్చి చెప్పేశాడు. చివరకు శిక్షణ కాలంలోనే మూడు రోజులపాటు ప్రతిరోజూ సాయంకాలాలు కూలిపనిచేసి వచ్చిన డబ్బుతో వాళ్ళమ్మకి మందులు కొనిపెట్టాడు. ఇది విన్నప్పుడే కాదు, అది తలచుకున్నప్పు డల్లా ఒక అధ్యాపకుడిగా నా మనసు బెంగటిల్లుతుంది.

కుటుంబ నేపథ్యమే అవగాహనా శక్తిని నియంత్రిస్తుంది
చదువు విద్యార్థి అవగాహనాశక్తిపైనే ఆధారపడుతుందా? లేక అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అతని చదువుని ప్రభావితం చేస్తాయా? అంటే కచ్చితంగా విద్యార్థి చదువుకీ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకీ మధ్య మన దేశంలో విడదీయలేని సంబంధం ఉంది. అది ప్రయోగాత్మకంగా రుజువ య్యింది కూడా. ఆమాటకొస్తే అది మన దేశంలోనే కాదు అనేక ఇతర దేశాల్లో సైతం విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకు ఉదాహరణ అమెరి కాలో శ్వేతజాతీయులకీ, ఆఫ్రికన్స్‌కీ ఉన్న తేడా కూడా ఇక్కడే తేటతెల్లం అవుతుంది. అన్ని అవకాశాలూ ఉండి, ఎటువంటి ఆర్థిక సమస్యలూ లేని విద్యార్థి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఇంటిదగ్గర అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌ తోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందిం చాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లవాడి కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్ర«ధాన ఎజెండా కావాలన్నదే నా భావన. 

మిడ్‌ డే మీల్‌ మధ్యాహ్న భోజనం కాదు, రాత్రిది కూడా...
ఎవరైనా ఒక మురికివాడలోని పాఠశాలకు వెళ్ళి మీలో పొద్దున్న ఏదైనా తిని వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అని అడిగితే బహుశా ఒక్కరు కూడా ఎత్తరు. ఎందుకంటే మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే దళిత, అణగారిన వర్గాల పిల్లల్లో ఎక్కువమంది  మధ్యాహ్న భోజనం పైనే ఆధారపడతారు. అసలా మధ్యాహ్న భోజనం కోసమే బడికి వచ్చే పిల్లలు కోకొల్లలు. ఇంకా చెప్పాలంటే మిడ్‌ డే మీల్‌ అనేది మధ్యాహ్న భోజనం కాదు. అది రాత్రి భోజనం కూడా. ఎందుకంటే రాత్రికి ఇంటి దగ్గర ఇంత కూడు దొరుకుతుందన్న భరోసా ఆ పిల్లవాడికుండదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో తలెత్తబోయే పరిణామాలు వాడికా కాన్ఫిడెన్స్‌ ఇవ్వవు. రాత్రి తాగొచ్చే నాన్న ఇంట్లో ఏం రభస చేస్తాడో తెలియదు. చిల్లిగవ్వలేని అమ్మని పొయ్యిమీదకి నాలుగు గింజలెలా వస్తాయోనన్న బెంగ పీడి స్తుంది. రేపటికి ఉపాధి హామీ కూలి దొరుకుతుందా? అన్న మీమాంస పదిహేనేళ్ళు కూడా లేని అక్కది. అందుకే తనకన్నా చిన్నదైన చెల్లికోసం మిగిలిన మధ్యాహ్న భోజనాన్ని బాక్సులో పెట్టుకెళ్ళే పిల్లలున్నారు మన రాష్ట్రంలో. అయితే విద్యార్థుల సామాజిక స్థితిగతులు వారి చదువుపై ఎక్కువగా ప్రభావం చూపుతాయనడానికి న్యూయార్క్‌ ఒక ఉదాహరణ. 

న్యూయార్క్‌లోనూ నిరాశ్రయ విద్యార్థులే
ప్రపంచంలోనే పేరెన్నికగన్న న్యూయార్క్‌లో నివసించే ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఒకరు నిరాశ్రయులే. పేదరికం, నగరంలో నివసించే స్థోమత లేకపోవడంతో అత్యధిక సంఖ్యలో కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా తాత్కాలిక నివాసాల్లోనూ, ఆశ్రమాల్లో తలదాచుకుంటోన్న విద్యార్థుల సంఖ్య వరుసగా మూడో యేట కూడా లక్షమందికి చేరినట్టు తాజా అ«ధ్యయనంలో తేలింది. ఆయా కుటుంబా ల్లోని విద్యార్థులు ప్రభుత్వ షెల్టర్లలో గానీ, స్నేహితులో, బంధువుల ఇళ్ళల్లోనో తలదాచుకుంటున్నట్టు ఇండిపెండెంట్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ రిపోర్టు వెల్లడించింది. పాఠశాల విద్యార్థుల హాజరు శాతాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది. దీన్ని బట్టి 2013–14 విద్యాసంవత్సరంలో షెల్టర్‌ హోమ్స్‌లో నివసించే విద్యార్థుల్లో కేవలం 34 శాతం మందికి మాత్రమే 90 శాతం హాజరు ఉన్నట్టు స్పష్టమైంది. వీరంతా తాముంటున్న ప్రదే శాల నుంచి పాఠశాలకు చేరుకునేందుకు దూర తీరాలకు ప్రయాణిం చాల్సి వస్తోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరవడానికి ఏ అవరోధాలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించేందుకు దాదాపు 100 పాఠశాలల్లో సిబ్బందినీ, అడ్మినిస్ట్రేటర్స్‌నీ వారి కుటుంబాల్లోని ఎంతో మందిని ఈ అధ్యయనంలో ప్రశ్నించడంతో లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడలేని పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

2010–11 నుంచి 2013–14 మధ్యలో తాత్కాలిక నివాసాల్లో తల దాచుకుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగింది. న్యూయార్క్‌ సిటీలో  2010లో 69,244 మంది విద్యార్థులు ఇళ్ళులేక, తాత్కాలిక ఆశ్రయం పొందితే ఆ సంఖ్య ప్రస్తుతం 114,659కి పెరిగిపోయింది. ఇది ఆల్బెనీ జనాభా కంటే ఎక్కువ. మొత్తం అమెరికాలోనే అత్యధికంగా నిరాశ్ర యులైన విద్యార్థులున్న సిటీ న్యూయార్క్‌ సిటీ. గత ఏడాది చికాగోలో నివసిస్తోన్న విద్యార్థుల్లో 5 శాతం మంది ఇళ్ళులేని వారే. 2016 గణాంకాల ప్రకారం లాస్‌ఏంజెల్స్‌లో నివసిస్తోన్న విద్యార్థుల్లో 3 శాతం మంది నిరాశ్రయులే. దాదాపు 1.1 మిలియన్ల మంది న్యూయార్క్‌లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అక్కడ చదివే  144 ప్రభుత్వ పాఠశా లల్లో మూడోవంతు మంది విద్యార్థులు నిరాశ్రయులే.

బ్రాంక్స్‌ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10,804 మంది నిరాశ్రయులైన విద్యా ర్థులున్నారు. బ్రాంక్స్‌ పరిధిలోని కింగ్‌బ్రిడ్స్‌ ఇంటర్‌నేషనల్‌ హైస్కూ ల్‌లో చదువుతున్న విద్యార్థుల్లో 44 శాతం మంది విద్యార్థులు గత నాలుగేళ్ళుగా నిరాశ్రయులుగా ఉంటున్నారు. ఇల్లులేని విద్యార్థుల్లో పాఠ శాల హాజరుశాతం కూడా అతితక్కువగా ఉంటోంది. నిరాశ్రయులైన విద్యార్థులు గత యేడాది మొత్తంలో వివిధ సందర్భాల్లో ఒక నెల రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరు కావాల్సి వచ్చింది. 2015–16 విద్యా సంవ త్సరంలో షెల్టర్‌ హోమ్స్‌లో నివసిస్తోన్న వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే స్టేట్‌ మ్యాథ్స్‌లోనూ, 15 శాతం మంది ఇంగ్లిష్‌లోనూ పాస్‌ అయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

తరచుగా షెల్టర్‌ హోమ్స్‌ నుంచి మారుతూండటంతో పాఠశాలల్లో విద్యార్థులను స్థిరంగా ఉండనివ్వని పరిస్థితికి చేర్చింది. ఈ కారణంగా ఒక్క యేడాదిలో విద్యార్థులు కనీసం మూడు నాలుగు పాఠశాలలకు మారాల్సి వస్తోందని రిపోర్టు వెల్లడించింది. షెల్టర్‌ హోమ్స్‌ నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే కనీసం రెండున్నర గంటలపాటు ప్రయాణిం చాల్సి ఉంటుంది. పొద్దున ఐదు గంటలకు లేచి, ఇంత దూరం ప్రయా ణించి 11 గంటలకు పాఠశాలకు చేరుకోవడంతో దాదాపు సగం క్లాసులను వీరు మిస్సవుతున్నారు. చివరకు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్పుడూ, సబ్‌వేల్లోనే వీరు నిద్రించాల్సిన దయనీయమైన పరిస్థితి. ఇదే విద్యార్థుల గైర్హాజరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. స్థిరనివాసా లున్న వారికంటే, మూడురెట్లు అధికంగా షెల్టర్‌హోమ్స్‌లో నివసిస్తోన్న విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. 

మన దేశంలో ఆ  లెక్కలు కూడా లేవు...
ఇలాంటి పరిశోధనలు జరిగిన దాఖలాలు మనదేశంలో కనిపించవు. ఇదే విషయంపై ఇక్కడ పరిశోధన చేస్తే ప్రపంచం నివ్వెరపోయే అంశాలెన్నో వెలుగులోకి వస్తాయి. లక్షలాది మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల స్థితిగతులు, నిలువనీడే కాదు తిండికి కూడా నోచుకోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు గొప్ప అవగాహనా శక్తి ఉండీ, చదువుపైన మనసు లగ్నం చేయలేని స్థితి ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలో టాయ్‌లెట్‌ సౌకర్యం ఉన్న స్కూళ్లు ఎన్ని అని కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే మరుగు దొడ్డి సౌకర్యంలేని పాఠశాల ఒక్కటి కూడా లేదని రిపోర్టు ఇచ్చింది నాటి ప్రభుత్వం. కానీ వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలల్లో ఈ సదుపాయం వున్నదన్న విషయం తెలీదు.

ఎంతోమంది ఆడపిల్లలు రుతుసమయంలో కనీసం ప్యాడ్‌ మార్చుకునే సదుపాయం కూడా లేక పాఠశాలలకు వెళ్ళడమే మానేస్తున్నారన్నది పరిశోధనలో తేలిన విషయం. ఆడపిల్లల డ్రాపౌట్స్‌ దాదాపు అన్నీ మరుగుదొడ్డి సమస్యతోనేనని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ఒకటి కల్యాణ లక్ష్మి. నిజానికి కల్యాణ లక్ష్మి వల్ల ఆడపిల్లలకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరి శీలన జరిపిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే లక్షరూపాయలకు ఆశపడి ఆడపిల్లలకు 18 ఏళ్ళు కూడా రాకుం డానే పెళ్ళిళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. కనుక తాత్కాలిక పరిష్కారాలూ, క్యాష్‌ పంపిణీ కాదు. విద్యావిధానానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలి. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సైతం కొంత మాత్రమే సమస్యను పరిష్కరించ గలవు. కానీ ఆ పిల్లల మనసుని కలచివేసే ఆయా పిల్లల ఇంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నదని గ్రహించాల్సిన సందర్భమిది.

వ్యాసకర్త : చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement