mid -day lunch scheme
-
జనం కష్టాలు తెలిసిన నేత: జగన్
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి బడుగుజీవులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. సామాజిక పింఛన్లు రూ.2,250, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.3వేలకు పెంచుతూ తొలిసంతకం చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న అమ్మలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, గుడిపాల(చిత్తూరు): మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 65 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు 80మంది ఉన్నారు. వారికి గౌరవ వేతనం రూ.3వేలకు పెంచడంతో ఆర్థికంగా ఎంతో ఆసరా కానుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరాటంకంగా విద్యాభ్యాసం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కార్మికులు గత ప్రభుత్వాన్ని కోరారు. అయితే సర్కార్ వారి మొరను పెడచెవిన పెట్టింది. వారి ఆకాంక్షను నిర్లక్ష్యం చేసింది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో రాష్ట్రసారధ్య బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వెయ్యి గౌరవవేతనాన్ని రూ.3 వేల పెంచడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్ తండ్రిబాటలోనే సువర్ణ పాలన సాగిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జనం కష్టాలు తెలిసిన నేత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా గౌరవ వేతనం రూ.3వేలు చేశారు. గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కాని ఇవ్వలేదు. ఇప్పుడు సమాజంలో మాకు కూడా గౌరవంగా చెప్పుకునే వేతనం ఇస్తున్నారు. –లక్ష్మీ, నరహరిపేట, గుడిపాల మాట నిలబెట్టుకున్నారు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి,వంట ఏజెన్సీల కష్టాలను గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.3వేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజల సమక్షంలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. –విజయ, నరహరిపేట, గుడిపాల మా నమ్మకం నిజమైంది మా కష్టాలు తీర్చే నాయకులు ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని ఎప్పటినుంచో నమ్మకం పెంచుకున్నాం. ఆయన సీఎం అయిన వెంటనే వృద్ధులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పెంచారు. వంట ఏజెన్సీలకు కూడా ఇచ్చినహామీ నెరవేర్చారు. ఆయనకు రుణపడి ఉంటాం. –మునెమ్మ, గుడిపాల ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో సక్రమంగా గౌరవ వేతనం వచ్చేది కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వంట ఏజెన్సీల కష్టాలు చూసి గౌరవవేతనం రూ.3వేలు చేశారు. మమ్మల్ని గుర్తించి ఇంతమేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈశ్వరమ్మ, గుడిపాల -
ఇరుకు గదులతో ‘వంట’కు తంటా!
సాక్షి, మదనాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ఆరుబయట కట్టెలపొయ్యిపై వండుతుండంతో విద్యార్థుల కళ్లు మండుతున్నాయి. చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక వంటగదులు కట్టించాలని, సిలిండర్లు సరఫరా చేయాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. మండలంలో ఇదీ పరిస్థితి.. మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు 4జిల్లా పరిషత్ పాఠశాలలు, 1 యూపీఎస్ పాఠశాల, 1 కస్తూర్బాగాందీ బాలికాల పాఠశాల, 1 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు ఉన్నాయి. మొత్తం 2110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆచరణలో సమగ్రంగా అమలు చేయడం లేదు. ఆరు బయటే వంట.. ప్రధానంగా మదనాపురం మండల కేంద్రంతో పాటు దుప్పల్లి ద్వాకరనగరం ,నర్సింగపురం కరివెన, తదితర గ్రామాల్లో వంట గదులు చిన్న గా ఉండటం తో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వంట చేసే సమయం లో వంట చెరుకు వలన వచ్చె పొగ బయటకు పోక పోవడంతో ఆగది పోగతో కమ్ముకుంటుందని చెబుతున్నారు.దీంతో తాము గదుల్లో వంట చేయడం లేదని నిర్మాణ సమయంలో సరిౖయెన పారదర్శకాలు పాటించ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక బయట వంట చేసి కొన్ని సమయాల్లో ఆరు బయటనే అన్నము వడ్డిస్తున్నామని పలువరు అంటున్నారు. కుక్కల స్వైరవిహారం పాఠశాల లో ప్రహరీ లేని చోట మదనాపురం పీఎస్ సంతబజార్, గోపన్‌పేట పీఎస్, కరివెన పీఎస్, గోవిందహళ్లీ పీఎస్, బౌసింగ్తండాపీఎస్, పెద్దతండా పీఎస్ తదితర పాఠశాలల్లో మధ్యాహన భోజన సమయంలో పందులు, కుక్కలు సైర విహారం చేస్తాయి. ఈ విషయమై విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఆరు బయట వంట చేయకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించా లని విద్యావంతులు కోరుతున్నారు. -
అక్షరాన్ని కబళిస్తున్న ఆకలి
మన దేశంలోనే కాదు..ప్రపంచంలోనూ విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇంటి దగ్గర నుంచి అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌతోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి వల్లే స్కూలు నుంచి డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందించాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లల కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్రధాన ఎజెండా కావాలి. ఆ పిల్లవాడు గుర్తొస్తే మెలకువలోనే కాదు కలలో కూడా నేను ఉలిక్కిపడి లేస్తుంటాను. ఇప్పటికీ ఆ పిల్లవాడి ప్రేమ ముందు ఈ దేశ విద్యావిధానం చిన్నబోయినట్టనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం తొర్రూరులో కొంత మంది విద్యార్థులకు శిక్షణనిచ్చాం. శిక్షణ కాలం మధ్యలోనే నవీన్ అనే పిల్లవాడు ఇంటికి వెళ్ళొస్తానని అడిగాడు. ఇంకా శిక్షణ పూర్తికాలేదని మేం వారించాం. కానీ ఆ పిల్లవాడు పదే పదే ఇంటికెళతానని అడగసా గాడు. ఇప్పుడు ఇంటికెందుకు అన్నది మా ఎదురు ప్రశ్న. మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. ఇంటి దగ్గర ఆమెకు మందులు లేవు. నాకు ఒక్కరోజు సెలవిస్తే మా ఊళ్ళో కూలిపనికెళ్ళి ఆమ్మకి కొన్ని మందులుకొని ఇచ్చి వస్తానని చెప్పాడు నవీన్. అయినా మేం మెత్తబడలేదు. అతను అబద్ధం చెపుతున్నాడనుకున్నాం. లేదా ఇంటిపైన బెంగపెట్టుకున్నాడనుకున్నాం. చివరకు విసుగొచ్చిన నవీన్ ‘సార్ నన్ను ఇంటికి పంపండి. లేదంటే నాకీ చదువు వొద్దు, శిక్షణా వొద్దు అని తేల్చి చెప్పేశాడు. చివరకు శిక్షణ కాలంలోనే మూడు రోజులపాటు ప్రతిరోజూ సాయంకాలాలు కూలిపనిచేసి వచ్చిన డబ్బుతో వాళ్ళమ్మకి మందులు కొనిపెట్టాడు. ఇది విన్నప్పుడే కాదు, అది తలచుకున్నప్పు డల్లా ఒక అధ్యాపకుడిగా నా మనసు బెంగటిల్లుతుంది. కుటుంబ నేపథ్యమే అవగాహనా శక్తిని నియంత్రిస్తుంది చదువు విద్యార్థి అవగాహనాశక్తిపైనే ఆధారపడుతుందా? లేక అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అతని చదువుని ప్రభావితం చేస్తాయా? అంటే కచ్చితంగా విద్యార్థి చదువుకీ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకీ మధ్య మన దేశంలో విడదీయలేని సంబంధం ఉంది. అది ప్రయోగాత్మకంగా రుజువ య్యింది కూడా. ఆమాటకొస్తే అది మన దేశంలోనే కాదు అనేక ఇతర దేశాల్లో సైతం విద్యార్థుల సామాజిక, ఆర్థిక నేపథ్యం వారి చదువుపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకు ఉదాహరణ అమెరి కాలో శ్వేతజాతీయులకీ, ఆఫ్రికన్స్కీ ఉన్న తేడా కూడా ఇక్కడే తేటతెల్లం అవుతుంది. అన్ని అవకాశాలూ ఉండి, ఎటువంటి ఆర్థిక సమస్యలూ లేని విద్యార్థి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఇంటిదగ్గర అనేక సమస్యలుండి, కటిక పేదరికం, ఆకలి వేదనతో సతమతమౌ తోన్న విద్యార్థికి తరగతి గదిలో బోధించేది ఏం అర్థం అవుతుంది? అందువల్ల కావాల్సింది విద్యార్థి తరగతి గదుల్లోనో, లేక వారికి అందిం చాల్సిన వసతుల్లోనో మెరుగైన పరిస్థితులు కల్పించడమొక్కటే కాదు. పిల్లవాడి కుటుంబ నేపథ్యాన్ని మార్చడమొక్కటే ఈ రోజు భారతదేశ విద్యావిధానం ముందున్న ప్ర«ధాన ఎజెండా కావాలన్నదే నా భావన. మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం కాదు, రాత్రిది కూడా... ఎవరైనా ఒక మురికివాడలోని పాఠశాలకు వెళ్ళి మీలో పొద్దున్న ఏదైనా తిని వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అని అడిగితే బహుశా ఒక్కరు కూడా ఎత్తరు. ఎందుకంటే మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే దళిత, అణగారిన వర్గాల పిల్లల్లో ఎక్కువమంది మధ్యాహ్న భోజనం పైనే ఆధారపడతారు. అసలా మధ్యాహ్న భోజనం కోసమే బడికి వచ్చే పిల్లలు కోకొల్లలు. ఇంకా చెప్పాలంటే మిడ్ డే మీల్ అనేది మధ్యాహ్న భోజనం కాదు. అది రాత్రి భోజనం కూడా. ఎందుకంటే రాత్రికి ఇంటి దగ్గర ఇంత కూడు దొరుకుతుందన్న భరోసా ఆ పిల్లవాడికుండదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో తలెత్తబోయే పరిణామాలు వాడికా కాన్ఫిడెన్స్ ఇవ్వవు. రాత్రి తాగొచ్చే నాన్న ఇంట్లో ఏం రభస చేస్తాడో తెలియదు. చిల్లిగవ్వలేని అమ్మని పొయ్యిమీదకి నాలుగు గింజలెలా వస్తాయోనన్న బెంగ పీడి స్తుంది. రేపటికి ఉపాధి హామీ కూలి దొరుకుతుందా? అన్న మీమాంస పదిహేనేళ్ళు కూడా లేని అక్కది. అందుకే తనకన్నా చిన్నదైన చెల్లికోసం మిగిలిన మధ్యాహ్న భోజనాన్ని బాక్సులో పెట్టుకెళ్ళే పిల్లలున్నారు మన రాష్ట్రంలో. అయితే విద్యార్థుల సామాజిక స్థితిగతులు వారి చదువుపై ఎక్కువగా ప్రభావం చూపుతాయనడానికి న్యూయార్క్ ఒక ఉదాహరణ. న్యూయార్క్‌లోనూ నిరాశ్రయ విద్యార్థులే ప్రపంచంలోనే పేరెన్నికగన్న న్యూయార్క్‌లో నివసించే ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఒకరు నిరాశ్రయులే. పేదరికం, నగరంలో నివసించే స్థోమత లేకపోవడంతో అత్యధిక సంఖ్యలో కుటుంబాలకు నిలువనీడ లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా తాత్కాలిక నివాసాల్లోనూ, ఆశ్రమాల్లో తలదాచుకుంటోన్న విద్యార్థుల సంఖ్య వరుసగా మూడో యేట కూడా లక్షమందికి చేరినట్టు తాజా అ«ధ్యయనంలో తేలింది. ఆయా కుటుంబా ల్లోని విద్యార్థులు ప్రభుత్వ షెల్టర్లలో గానీ, స్నేహితులో, బంధువుల ఇళ్ళల్లోనో తలదాచుకుంటున్నట్టు ఇండిపెండెంట్ బడ్జెట్ ఆఫీస్ రిపోర్టు వెల్లడించింది. పాఠశాల విద్యార్థుల హాజరు శాతాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది. దీన్ని బట్టి 2013–14 విద్యాసంవత్సరంలో షెల్టర్ హోమ్స్‌లో నివసించే విద్యార్థుల్లో కేవలం 34 శాతం మందికి మాత్రమే 90 శాతం హాజరు ఉన్నట్టు స్పష్టమైంది. వీరంతా తాముంటున్న ప్రదే శాల నుంచి పాఠశాలకు చేరుకునేందుకు దూర తీరాలకు ప్రయాణిం చాల్సి వస్తోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరవడానికి ఏ అవరోధాలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించేందుకు దాదాపు 100 పాఠశాలల్లో సిబ్బందినీ, అడ్మినిస్ట్రేటర్స్నీ వారి కుటుంబాల్లోని ఎంతో మందిని ఈ అధ్యయనంలో ప్రశ్నించడంతో లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు నిలువనీడలేని పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 2010–11 నుంచి 2013–14 మధ్యలో తాత్కాలిక నివాసాల్లో తల దాచుకుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగింది. న్యూయార్క్ సిటీలో 2010లో 69,244 మంది విద్యార్థులు ఇళ్ళులేక, తాత్కాలిక ఆశ్రయం పొందితే ఆ సంఖ్య ప్రస్తుతం 114,659కి పెరిగిపోయింది. ఇది ఆల్బెనీ జనాభా కంటే ఎక్కువ. మొత్తం అమెరికాలోనే అత్యధికంగా నిరాశ్ర యులైన విద్యార్థులున్న సిటీ న్యూయార్క్ సిటీ. గత ఏడాది చికాగోలో నివసిస్తోన్న విద్యార్థుల్లో 5 శాతం మంది ఇళ్ళులేని వారే. 2016 గణాంకాల ప్రకారం లాస్ఏంజెల్స్లో నివసిస్తోన్న విద్యార్థుల్లో 3 శాతం మంది నిరాశ్రయులే. దాదాపు 1.1 మిలియన్ల మంది న్యూయార్క్‌లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అక్కడ చదివే 144 ప్రభుత్వ పాఠశా లల్లో మూడోవంతు మంది విద్యార్థులు నిరాశ్రయులే. బ్రాంక్స్ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10,804 మంది నిరాశ్రయులైన విద్యా ర్థులున్నారు. బ్రాంక్స్ పరిధిలోని కింగ్బ్రిడ్స్ ఇంటర్నేషనల్ హైస్కూ ల్లో చదువుతున్న విద్యార్థుల్లో 44 శాతం మంది విద్యార్థులు గత నాలుగేళ్ళుగా నిరాశ్రయులుగా ఉంటున్నారు. ఇల్లులేని విద్యార్థుల్లో పాఠ శాల హాజరుశాతం కూడా అతితక్కువగా ఉంటోంది. నిరాశ్రయులైన విద్యార్థులు గత యేడాది మొత్తంలో వివిధ సందర్భాల్లో ఒక నెల రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరు కావాల్సి వచ్చింది. 2015–16 విద్యా సంవ త్సరంలో షెల్టర్ హోమ్స్‌లో నివసిస్తోన్న వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే స్టేట్ మ్యాథ్స్‌లోనూ, 15 శాతం మంది ఇంగ్లిష్‌లోనూ పాస్ అయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరచుగా షెల్టర్ హోమ్స్ నుంచి మారుతూండటంతో పాఠశాలల్లో విద్యార్థులను స్థిరంగా ఉండనివ్వని పరిస్థితికి చేర్చింది. ఈ కారణంగా ఒక్క యేడాదిలో విద్యార్థులు కనీసం మూడు నాలుగు పాఠశాలలకు మారాల్సి వస్తోందని రిపోర్టు వెల్లడించింది. షెల్టర్ హోమ్స్ నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే కనీసం రెండున్నర గంటలపాటు ప్రయాణిం చాల్సి ఉంటుంది. పొద్దున ఐదు గంటలకు లేచి, ఇంత దూరం ప్రయా ణించి 11 గంటలకు పాఠశాలకు చేరుకోవడంతో దాదాపు సగం క్లాసులను వీరు మిస్సవుతున్నారు. చివరకు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్పుడూ, సబ్వేల్లోనే వీరు నిద్రించాల్సిన దయనీయమైన పరిస్థితి. ఇదే విద్యార్థుల గైర్హాజరీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. స్థిరనివాసా లున్న వారికంటే, మూడురెట్లు అధికంగా షెల్టర్‌హోమ్స్‌లో నివసిస్తోన్న విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. మన దేశంలో ఆ లెక్కలు కూడా లేవు... ఇలాంటి పరిశోధనలు జరిగిన దాఖలాలు మనదేశంలో కనిపించవు. ఇదే విషయంపై ఇక్కడ పరిశోధన చేస్తే ప్రపంచం నివ్వెరపోయే అంశాలెన్నో వెలుగులోకి వస్తాయి. లక్షలాది మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల స్థితిగతులు, నిలువనీడే కాదు తిండికి కూడా నోచుకోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు గొప్ప అవగాహనా శక్తి ఉండీ, చదువుపైన మనసు లగ్నం చేయలేని స్థితి ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలో టాయ్‌లెట్ సౌకర్యం ఉన్న స్కూళ్లు ఎన్ని అని కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే మరుగు దొడ్డి సౌకర్యంలేని పాఠశాల ఒక్కటి కూడా లేదని రిపోర్టు ఇచ్చింది నాటి ప్రభుత్వం. కానీ వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలల్లో ఈ సదుపాయం వున్నదన్న విషయం తెలీదు. ఎంతోమంది ఆడపిల్లలు రుతుసమయంలో కనీసం ప్యాడ్ మార్చుకునే సదుపాయం కూడా లేక పాఠశాలలకు వెళ్ళడమే మానేస్తున్నారన్నది పరిశోధనలో తేలిన విషయం. ఆడపిల్లల డ్రాపౌట్స్ దాదాపు అన్నీ మరుగుదొడ్డి సమస్యతోనేనని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ఒకటి కల్యాణ లక్ష్మి. నిజానికి కల్యాణ లక్ష్మి వల్ల ఆడపిల్లలకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరి శీలన జరిపిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే లక్షరూపాయలకు ఆశపడి ఆడపిల్లలకు 18 ఏళ్ళు కూడా రాకుం డానే పెళ్ళిళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. కనుక తాత్కాలిక పరిష్కారాలూ, క్యాష్ పంపిణీ కాదు. విద్యావిధానానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ సైతం కొంత మాత్రమే సమస్యను పరిష్కరించ గలవు. కానీ ఆ పిల్లల మనసుని కలచివేసే ఆయా పిల్లల ఇంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నదని గ్రహించాల్సిన సందర్భమిది. వ్యాసకర్త : చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ -
ఆకలి చదువులు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటిస్తున్నా.. అమలుకు నోచుకోవడంలేదు. జూలైలో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పలు అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. ఇంటర్ విద్యార్థులతో పాటు డిగ్రీ, డైట్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు గడుస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేకుండా పోయింది. పథకం ఎప్పుడు అమలు చేస్తారో అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవడానికి ఆయా మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. దీంతో మధ్యాహ్న భోజనం కళాశాలలో అందిస్తే రెండుపూటలు కళాశాలలో ఉండి చదువుకునే వీలుంటుంది. కొంతమంది టిఫిన్ బాక్సులు తీసుకొస్తుండగా, మరికొంత మంది పస్తులుండి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా మూడు డిగ్రీ కళాశాలలు, ఒక డైట్ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్‌లో దాదాపు 5 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో దాదాపు 8 వేల వరకు విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాలలో 2వేల మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ప్రతీ రోజు ఉదయం కళాశాలకు చేరుకోవాల్సి ఉండడంతో అల్పాహారం తీసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం టిఫిన్ బాక్సులు సైతం తీసుకురావడానికి సమయం దొరకకపోవడంతో వారు మధ్యాహ్నం పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడంతో అనారోగ్యానికి గురవుతారని వైద్యులు పేర్కొంటున్నారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య.. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఉదయం పూట హాజరు శాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా మంది విద్యార్థులు ఆకలిని తట్టుకోలేక ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం తగ్గి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపుతోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కొంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పస్తులుండి ఆటలాడుతూ కనిపిస్తుంటారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే సర్కారు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. గత రెండేళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అమలుకు నోచుకోవడంలేదు. ఇంటి నుంచి కళాశాలకు నడిచిరావడంతో ఉదయం 9 గంటలకే బయల్దేరాల్సి వస్తోంది. దీంతో టిఫిన్ బాక్సులు తీసుకురాలేని దుస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఆకలి కారణంగా చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నాం. కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే నాలాంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.– నందన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడంతో టిఫిన్ బాక్సు తెచ్చుకోని వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. – జి.లావణ్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ -
గుడ్డు లేకుండానే ఫుడ్డు
కొత్తగూడెం : పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మెనూ ప్రకారం వారానికి మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు వడ్డించాలి. ఇటీవల కొత్తగూడెం నియోజకవర్గంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయప్రాత ఫౌండేషన్‌కు అప్పగించారు. గుడ్లు మాత్రం కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై 22 రోజులు గడిచినా ఒక్కసారి కూడా గుడ్డు వడ్డించలేదు. పాఠశాలల పునఃప్రారంభం నుంచి అందని గుడ్లు జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథంకంలో వారంలో మూడు రోజులపాటు గుడ్లను వండి పెట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని 1065 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 49,159 మంది విద్యార్థులు, 169 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 22,728 మంది, 139 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 15,584 మంది.. మొత్తం 87,471 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, అదనంగా గుడ్డుకు రూ. 4లు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ6.18కు అదనంగా గుడ్డుకు రూ. 4లు చొప్పున అదనంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లిస్తారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గుడ్డు ధరతో కలుపుకొని ఒక్కో విద్యార్థికి రూ. 8.18 పైసలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 21,989 మంది విద్యార్థులకు అందని పౌష్టికాహారం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో ఆయా వంట ఏజెన్సీల ఆధ్వర్యంలోనే గుడ్లు కొనుగోలు చేసి విద్యార్థులకు అందచేస్తున్నారు. అక్షయపాత్ర సంస్థ సేవలను అందచేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం గుడ్లు అందటం లేదు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల పరిధి లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం 21,989 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. వీరందరికి పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లు వడ్డించడంలేదు. అక్షయపాత్ర ప్రారంభమైన అనంతరం గుడ్లను సరఫరా చేసేందుకు టెండర్ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. వీటిని ఉడికించి విద్యార్థులకు వడ్డించే బాధ్యత కుక్కర్ కం హెల్పర్లపై ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే వరకు ఇదే తంతు కొనసాగింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత గుడ్లు కొత్తగూడెం నియోజకవర్గంలోని ఏ పాఠశాలకూ చేరుకోలేదు. దీంతో ఇటు విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సదరుశాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. గుడ్లను అందించటం లేదు మా దగ్గర పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుంచి గుడ్లను వండి పెట్టడం లేదు. వారం రోజులకు మూడు మార్లు పెట్టాలని మెనూలో మాత్రం ఉంది. ఎందుకో..మాకు అయితే అందటం లేదు. -పవన్‌కుమార్, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రెండు రోజుల్లో పరిష్కరిస్తాం గుడ్లు అందటం లేదని రెండు రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది. సరఫరాకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం నుంచి యథావిధిగా గుడ్లు అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. -డి వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారిణి -
మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కరువు
సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. నిత్యావ సర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు పెంచినా.. ఆహార నాణ్యతలో మార్పు రావడం లేదు. చాలా పాఠశాలల్లో నిర్వాహకులు మెనూ పాటించడం లేదు. కూరగాయలకు బదులు.. పప్పు.. పప్పుకు బదులు పచ్చడి పెడుతూ విద్యార్థుల పొట్ట కొడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కలెక్టర్ అహ్మద్‌బాబు ఈ నెల 25న ఎంఈవోలతో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర పెంచినా మారని తీరు.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 3,913 ప్రభుత్వ పాఠశాలల్లో 2,71,244 మంది విద్యార్థులు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 6,882 మంది నిర్వాహకులు ఉన్నారు. గ త విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4, యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు రూ.4.65 చొప్పున ఏజెన్సీలకు బిల్లులు చెల్లించింది. కానీ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కట్టెలు, నూనె, పప్పు, ఉప్పు, ఇతర కిరాణ సామగ్రి కొనుగోలు చేయాలంటే నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. చాలాచోట్ల నాణ్యమైన భోజనం అందడం లేదు. సమస్యను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరమే పీఎస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.35, యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు రూ.6 చొప్పున ఏజెన్సీలకు బిల్లులు పెంచింది. దీంతో పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని భావించింది. నిద్రపోతున్న కమిటీలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో ప్రతి మండలానికి ఒక కమిటీ ని నియమించింది. సభ్యులందరూ రోజు కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టిసారించాలని ఆదేశించింది. పదిహేను రోజులకోసారి నివేదిక తెప్పించుకొని.. తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపై ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో సగానికిపైగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయడం లేదు. కొద్ది మాత్రమే వాస్తవ పరిస్థితులను విద్యాశాఖకు నివేదిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సభ్యులు మొక్కుబడి నివేదిక సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారంలో రెండు రోజులు సోమ, గురువారం కోడి గుడ్డు ఇవ్వాలి. కానీ చాలా స్కూళ్లలో నిర్వాహకులు వారంలో ఓ రోజు గుడ్డు ఇచ్చి రెండో రోజు తక్కువ విలువ చేసే అరటిపండ్లు ఇస్తున్నారు. మంగళవారం, శుక్రవారం కూరగాయలు పెట్టాలి. కూరగాయల ధరలు పెరుగుదలతో పప్పు పెడుతునానరు. బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలు ఇస్తున్నారు. రిఫైండ్ ఆయిల్ తో కాకుండా ఫామాయిల్తోనే వంట కానిచ్చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం కరువవుతోంది. ఫలితంగా విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలవుతున్నారు. పలు ఏజెన్సీ నిర్వాహకులు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడంతో పప్పు వండిపెడుతున్నామని చెప్తున్నారు. ఏజెన్సీలను రద్దు చేస్తాం.. - అక్రముల్లాఖాన్, డీఈవో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక అమలు తీరును పర్యవే క్షించాల్సిన బాధ్యత ఆయా క మిటీలదే. మెనూ పాటించని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించని ఏజెన్సీలను రద్దు చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఎంఈవోలు స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం.